అమెరికన్లకు మాత్రమే: ప్రెసిడెంట్‌ ట్రంప్‌

'అమెరికా పునర్‌నిర్మాణం అమెరికన్ల చేతుల మీదుగానే జరుగుతంది.. ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం అమెరికన్ల ప్రభుత్వం. ప్రతి అమెరికన్‌, అమెరికా పునర్‌నిర్మాణంలో భాగం పంచుకోవాలి. పరిపాలన ప్రతి అమెరికన్‌ ఆలోచనలకు తగ్గట్టుగానే జరుగుతుంది. ఉద్యోగావకాశాల్లో తొలి…

'అమెరికా పునర్‌నిర్మాణం అమెరికన్ల చేతుల మీదుగానే జరుగుతంది.. ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం అమెరికన్ల ప్రభుత్వం. ప్రతి అమెరికన్‌, అమెరికా పునర్‌నిర్మాణంలో భాగం పంచుకోవాలి. పరిపాలన ప్రతి అమెరికన్‌ ఆలోచనలకు తగ్గట్టుగానే జరుగుతుంది. ఉద్యోగావకాశాల్లో తొలి ప్రాధాన్యత అమెరికన్లదే. ఇప్పటిదాకా నిర్లక్ష్యానికి గురైనవారు ఇకపై శాసిస్తారు. వారికి మంచి రోజులు వచ్చాయి' 

– ఇదీ అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగం తాలూకు సారాంశం. 

ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఏం చెప్పారో, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాక కూడా అదే చెప్పారు. డోనాల్డ్‌ ట్రంప్‌ మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. కానీ, ఆ కొత్తదనమే ఇప్పుడు ప్రపంచం కొంప ముంచేస్తోంది. నిజమే మరి, అమెరికా అంటే అది కేవలం అమెరికన్లదే కాదు. అమెరికాలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. మరీ ముఖ్యంగా మన భారతీయులు అమెరికాలో చాలా ఎక్కువగానే వున్నారు. 

డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలతో అమెరికాలో భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత.. అన్న మాట అమెరికాలోని భారతీయుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. అయితే, అంతా భయపడుతున్నట్లుగా పరిస్థితులు ఏమీ వుండవని, అమెరికాలో సెటిలైన కొందరు భారతీయులు అభిప్రాయపడ్తున్నా, వారి పైకి చెప్పే మాటలకీ, లోలోపల ఆందోళనలకీ పొంతనే లేని పరిస్థితి. 

మొత్తమ్మీద, అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి ప్రసంగం ఎలా వుండబోతోంది.? అని ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచానికి ట్రంప్‌ పెద్ద షాకే ఇచ్చారు. ఇప్పుడిక, అమెరికాలో స్థిరపడ్డ వివిధ దేశాలకు చెందినవారి పరిస్థితేంటి.? కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది.