వైఎస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరోవిధంగా చెప్పాలంటే దుమ్మ దులిపేశారు. ఇదేమీ తప్పు కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సిన పనే ఇది. జగన్ విమర్శల్లో కొన్ని వాస్తవాలూ ఉన్నాయి. కాని జగన్ చంద్రబాబుపై విమర్శలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. కొన్ని విమర్శలు జగన్‌కే రివర్స్ అయ్యే ప్రమాదముంది.
చంద్రబాబు 'స్థానికేతరుడు' అని అర్థం వచ్చేలా జగన్ విమర్శించారు. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారని, తానైతే స్థలం కొని ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. అంటే సొంత రాష్ట్రంలో చంద్రబాబు అద్దెకు ఉండటమేమిటని జగన్ ప్రశ్న. చంద్రబాబు తాత్కాలికంగా ఉంటున్నారని, అధికారం కోల్పోగానే మళ్లీ హైదరాబాదుకు వెళ్లిపోతారని చెప్పడం జగన్ ఉద్దేశం కావొచ్చు. హైదరాబాదులో చంద్రబాబు సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. బాబు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంతకాలం ఆయన నివసిస్తున్న ఇల్లు సర్కారు ఇల్లు అవుతుందిగాని సొంత ఇల్లో, అద్దె ఇల్లో కాదు. ఆయన అద్దె ఇంట్లో ఉన్నా ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతే సొంత ఇల్లు కట్టుకుంటారేమో చెప్పలేం.
రాష్ట్రం విడిపోయి మూడేళ్లయినా జగన్ సొంత రాష్ట్రంలో (రాజధాని ప్రాంతంలో) ఎందుకు సొంత ఇల్లు నిర్మించుకోలేదు? ఈ లెక్కన ఆయన కూడా స్థానికేతరుడే కదా…! 'నువ్వెందుకు ఇల్లు కట్టుకోలేదు?' అని అడిగితే ఏం చెబుతారు? వాస్తవానికి ఈపాటికే ఇల్లు కట్టుకొని చంద్రబాబును విమర్శిస్తే అర్థవంతంగా ఉండేది. ఆంధ్రాలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూడా ఇప్పటివరకు నిర్మించలేదు. కార్యకలాపాలన్నీ హైదరాబాదులోని ఆయన ఇంటి నుంచే సాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీలకు కార్యాలయాలు ఉండి తమకు లేకపోయేసరికి వైకాపా నాయకులు ఆవేదన చెందుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారు? కాబట్టి జగన్ వెంటనే ఇల్లు కట్టుకోవాలి. కార్యాలయం నిర్మించుకోవాలి. ఇవి రెండూ ఆయనకు అత్యవసరం కూడా. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తానేనని ఆయనకు గట్టి నమ్మకంగా ఉంది. ఇది సహజమే కదా.
జగన్ మరో విషయంలో సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం విషయంలో అరచేతిలో స్వర్గం చూపించినా ఇప్పటివరకు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. మూడేళ్లలో ఆయన చేసిన పని భూమి సేకరించడం, విదేశాలకు వెళ్లి అక్కడి నగరాలు పరిశీలించి రావడం, వెళ్లిన ప్రతీ దేశంతో రాజధాని నిర్మాణంలో భాగస్వామి కావాలంటూ ఒప్పందాలు కుదుర్చుకోవడం, డిజైన్లు పరిశీలించడం…ఇదే పని. ఆయన చేసిన పని ఒక్కటే. తాత్కాలిక సచివాలయం నిర్మించడం. దాంట్లోనే అసెంబ్లీ కూడా ఉందనుకోండి. ఆయనకు మిగిలింది నికరంగా రెండేళ్ల సమయమే. ఆయన వైఖరి చూస్తుంటే కొన్ని భవనాలైనా నిర్మిస్తారా అనే అనుమానం కలుగుతోంది. ఇదంతా తనకు కలిసొస్తుందని జగన్ అనుకుంటున్నారు. రాజధాని నిర్మించేది తానేనని భావిస్తున్నారు. అందుకే 'ప్రజా రాజధాని నిర్మిస్తాం' అని ప్రకటించారు. చంద్రబాబుది పెట్టుబడిదారుల రాజధాని అన్నమాట. ఒకవేళ చంద్రబాబు రాజధాని నిర్మించకుండానే వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతే, జగన్ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
కాని రాజధాని నిర్మాణానికి పునాదులేసింది తాను కాబట్టి అది పూర్తయ్యేదాకా ప్రజలు తననే అధికారంలో ఉంచుతారని చంద్రబాబు నమ్మకం. ముఖ్యమంత్రి వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదే పనిగా తిరుగుతున్నారు. బాగానే ఉంది. కాని బాబు ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే ఎన్నికలు వస్తాయని పదేపదే చెబుతున్నారు. తాజాగా రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించినప్పుడు 'దేవుడి దయ ఉంటే ఏడాదిలోనే ఎన్నికలు వచ్చే అవకాశముంది' అని చెప్పారు. 'దేవుడి దయ ఉంటే' అనేది ఆయన ఊతపదం. బాబు సర్కారు పూర్తికాలం ఉండదని చెబుతున్న జగన్ దగ్గర అందుకు ఆధారాలు, అంచనాలు ఉన్నాయా? ఒక విషయం బలంగా చెబుతున్నారంటే అందుకు ఏదో ప్రాతిపదిక ఉండాలి కదా. మరి తన దగ్గర ఉన్న ప్రాతిపదిక ఏమిటో జగన్ చెప్పగలగాలి. బాబు సర్కారు పూర్తికాలం అధికారంలో ఉన్నట్లయితే జగన్ చెప్పిందానికి విలువేముంటుంది? జగన్ కొన్నిసార్లు మరీ చీప్ విమర్శలు చేస్తుంటారు. బాబుకు ఇంగ్లీషు రాదని, స్పెల్లింగులు తెలియవని…ఇలాంటివి హుందాగా ఉండవు. బాబు కూడా హుందాతనం కోల్పోయారు. అది వేరే విషయం. ఆయన దారిలోనే ఈయనా నడవాలా?