తమిళనాడులో ప్రాంతీయాభిమానమెక్కువ. అక్కడ సెంటిమెంట్ రాజుకుందంటే, దాన్ని చల్లార్చడం అంత తేలిక కాదు. జంతు హక్కుల పరిరక్షణ.. అంటూ 'పెటా' కోసం మద్దతిచ్చినవారే, ఇప్పుడు 'పెటా'ని బ్యాన్ చేయాలని నినదిస్తున్నారు. అంతా 'జల్లికట్టు' మహిమ. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు కూడా రోడ్డెక్కేశారు.. జల్లికట్టుకు అనుకూలంగా ఉద్యమబాట పట్టారు. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా వున్నాసరే, 'డోన్ట్ కేర్' అంటోంది తమిళ సమాజం.
మరి, ఆ 'ఐక్యత' మన తెలుగు నాట ఎక్కడ.? తెలుగునాట కోడి పందాలు ఫేమస్. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే.. అనుకోడానికి వీల్లేదు కోడి పందాల గురించి. ఒకప్పుడు కోడి పందాలు అంటే పల్నాడులోనూ ట్రెండింగే. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ కోడి పందాలు జరుగుతుంటాయి. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ.. అంతే తేడా. ఈ మధ్యకాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జూదంలా మారిపోవడంతో, ఆ ఏరియా ఫోకస్ అయ్యిందంతే.
తమిళనాడులో జల్లికట్టు కోసం మన తెలుగు ప్రముఖులు కూడా తల్లడిల్లిపోతున్నారు. చిత్రంగా, ఎవరూ మన కోడి పందాల గురించి మాత్రం మాట్లాడటంలేదు. నిన్న మహేష్, జల్లికట్టు గురించి ట్విట్టర్లో స్పందించాడు. కోడి పందాల ఊసెత్తలేదు. ఈ రోజు పవన్‌కళ్యాణ్ జల్లికట్టుపై ట్విట్టర్లో స్పందించాడు.. పనిలో పనిగా కోడి పందాలపైనా కామెంట్ వేసేశాడు. దక్షిణాది సెంటిమెంట్లను ఉత్తరాది పెత్తనం వున్న ప్రభుత్వాలు అర్థం చేసుకోవడంలేదన్నది ట్విట్టర్లో పవన్ చేసిన విమర్శ.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని అప్పట్లో అడ్డగోలుగా మన్మోహన్ సర్కార్ విభజించేసినప్పుడే, కనీసం ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై ఏ సినీ ప్రముఖుడూ స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. కోడి పందాలెంత.? అదే తమిళనాడు అయితేనా, సినీ ప్రముఖుల్ని, రాజకీయ నాయకుల్ని ఎలా దార్లోకి తీసుకురావాలో వాళ్ళకి బాగా తెలుసు. పెటాకి మద్దతిచ్చినందుకే అక్కడి సినీ ప్రముఖుల్ని ఇప్పుడు కడిగి పారేస్తోంది తమిళ సినీ యువత. కొన్ని విషయాల్లో అన్పిస్తుంటుంది, ఆ స్థాయి అగ్రెషన్ అవసరమేనేమో అని.!