విచారణ ఇప్పుడా.? ఏంటి ఉపయోగం.?

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంపై సుమారు 100 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానికి సంబంధించి 24 పిటిషన్లను సర్తోన్నత న్యాయస్థానం ఇప్పుడు తీరిగ్గా విచారణకు స్వీకరించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మూడేళ్ళ క్రితం నాటి…

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంపై సుమారు 100 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానికి సంబంధించి 24 పిటిషన్లను సర్తోన్నత న్యాయస్థానం ఇప్పుడు తీరిగ్గా విచారణకు స్వీకరించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మూడేళ్ళ క్రితం నాటి సంగతి విభజన అంటే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ తమ పని తాము చేసుకుపోతున్నాయి. విభజన చట్టం అన్యాయం, అక్రమం.. అంటూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిష్లపై విచారణ.. అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. 

'గడియారంలో ముల్లు వెనక్కి తిరుగుతుంది.. క్యాలెండర్‌ వెనక్కి వెళుతుంది..' 

– ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా అప్పటి ఎంపీ, కాంగ్రెస్‌ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యల సారాంశమిది. 

అసలు, పార్లమెంటులో విభజన బిల్లు పాస్‌ అయ్యే అవకాశమే లేదని ఉండవల్లి అప్పట్లో చెప్పారు. కానీ, ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది, అది చట్టంగా మారింది.. ఆ చట్టం ప్రకారమే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇది, దాదాపు మూడేళ్ళ క్రితం మాట. అయినాసరే, ఇప్పటికీ లోక్‌సభలో విభజన బిల్లు పాస్‌ అవలేదంటారు ఉండవల్లి. ఆయన వాదన ఆయనది. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఉండవల్లి సహా పలువురు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి, బిల్లు రూపొందకముందూ, బిల్లుగా మారాక – చట్టంగా మారకముందూ, చట్టంగా మారిన తర్వాత కూడా పలువురు సర్వోతన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించి, విభజనను ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేసినా, ఉపయోగం లేదాయె.! పలు దఫాలు సుప్రీంకోర్టులో ఉండవల్లి తన వాదనలు విన్పించారు. చివరికి ఆ కేసు ఏమయ్యింది.? అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. తాజాగా, మరోమారు ఈ వివాదం తెరపైకొచ్చింది. 

పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం, ఒకనాటి విభజన ప్రసహనంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి వుంటుంది. ఆనాటి లోక్‌సభలో ఏం జరిగిందన్నది ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అధికార పార్టీ నుంచి ఎంపీలు సస్పెండ్‌ అయ్యాక, సభలో వుండాల్సిన బలం లేని మన్మోహన్‌ సర్కార్‌ రూపొందిన చట్టానికి ఆమోదం ఎలా లభించినట్లు.? ఇది అత్యంత కీలకమైన విషయం. 

అయితే, న్యాయ వ్యవస్థకీ – రాజకీయానికీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. చట్ట సభల సాక్షిగా కేంద్ర మంత్రులు, న్యాయవ్యవస్థకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు పాలకుల తీరుని చూసి కంటతడిపెడ్తున్నారు. సో, విభజన చట్టంపై ఇప్పుడు విచారణ జరగడమంటే దానివల్ల ఒరిగేదేమీ వుండకపోవచ్చు. న్యాయం ఆలస్యమయితే, అసలు న్యాయం జరగనట్టే.. అన్న వాదన ఒకటుంది. దాదాపు మూడేళ్ళ తర్వాత.. ఇప్పుడు విచారణ అంటే, 'న్యాయం' ఎప్పటికి దక్కేను.? దక్కినా అది న్యాయమెలా అవుతుంది.?