ఏంటో, పవన్‌కళ్యాణ్ ఇంకా 'ప్రత్యేక హోదా అనే మాయ' లోంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చేశాక కూడా, 'పాలకుల్లో శాంతిని నింపి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలి..' అంటూ సంక్రాంతి సందర్భంగా పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించేయడం కామెడీ కాకపోతే మరేమిటి.?
మనిషి ఆశాజీవిగా వుండడంలో తప్పులేదు. కానీ, మరీ ఇంత పెద్ద ఆశలంటే ఎలా.? పైగా, పవన్‌కళ్యాణ్ మద్దతిచ్చిన నరేంద్రమోడీనే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని పాతాళానికి తొక్కేశారు. కానీ, నరేంద్రమోడీని కలిసి ప్రత్యేక హోదా అంశాన్ని చర్చింలేకపోతున్న పవన్, రెండు మూడు మీటింగులు పెట్టేసి, 'మమ' అన్పించేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలట.!
ఉద్దానం కిడ్నీ బాధితులకు సాంత్వన కలగాలని ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు. ఇది మాత్రం నూటికి నూరుపాళ్ళూ సమర్థించాల్సిన విషయమే. పవన్‌కళ్యాణ్ కోసమే స్పందించారో, లేదంటే స్పందించడం వల్ల పోయేదేమీ లేదని అనుకున్నారోగానీ అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రెండూ స్పందించేశాయి. ఇకనేం, ఉద్దానం బాగుపడిపోతుందనుకునేరు.. పాలకుల్లో ఆ మాత్రం చిత్తశుద్ధి వుంటే రెండున్నర దశాబ్దాలుగా దేశంలోని ఓ మారుమూల ప్రాంతం.. కిడ్నీ బాధితుల పరంగా అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించేంత దయనీయ స్థితికి ఎలా చేరుకుంటుంది.?
మొత్తమ్మీద, పవన్‌కళ్యాణ్ సంక్రాంతి పేరు చెప్పి, జనసేనాధినేత హోదాలో ఓ ప్రకటన చేసేశారు. చంద్రబాబు చెప్పారు, పండగ చేస్కోండి.. అంటూ ఉద్దానం వెతలపై తొందరపడి ప్రకటన చేసేసి, చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్పేసిన పవన్.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుని ప్రశ్నించడానికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు సృష్టించుకోలేకపోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?