ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా అనేక కోరికలు ఉంటాయి. ఇందులో ప్రజలకు మేలు చేసే కోరికలు కొన్నయితే, రాజకీయ ప్రయోజనాలను ఆశించే కోరికలు కొన్ని. ప్రజలకు మేలు కలిగించే కోరికలను అవసరమైతే పక్కకు పెడతారు. కాని రాజకీయ ప్రయోజనాలు కలిగించే కోరికలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని అనుకుంటారు. ఇదో తరహా రాజకీయం. ఇలాంటి రాజకీయంలో కార్యాలయాలకు, సంస్థలకు, పథకాలకు, ప్రాజెక్టులకు పేర్లు పెట్టడం ఒకటి. మన దేశంలో 'పేర్ల రాజకీయం' చాలా పెద్దది. విగ్రహ రాజకీయాల్లో, పేర్ల రాజకీయాల్లో మన నాయకులు ఆరితేరారు. కథ లేకుండా మూడు గంటల సినిమా చూపించినట్లుగా ప్రజలకు ఉపయోగపడే అంశమేదీ లేకుండా పేర్లు, విగ్రహాలతో ఎంతకాలమైనా రాజకీయాలు చేయగలరు. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం తన టర్మ్ ముగిసేలోగా తన పార్టీ నాయకుల పేర్లను సాధ్యమైనన్ని సంస్థలకు, ప్రాజెక్టులకు, పథకాలకు పెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పని అదే. ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు చేస్తున్న పని అదే. వీరిద్దరే కాదు అందరు ముఖ్యమంత్రులు చేసిన పని ఇదే. కాని వీరిద్దరు కాస్త ఎక్కువ చేశారు.
వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకానికైనా, ప్రాజెక్టుకైనా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లే పెట్టేవారు. ఇలా వీరిద్దరి పేర్లు పెట్టడం ఒక దశలో జనాలకు అసహ్యం కలిగించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. నవ్యాంధ్రలో చంద్రబాబు కూడా ఇలాగే చేస్తున్నారు. ప్రతి దానికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. కొన్ని పథకాలకు తన పేరే పెట్టుకుంటున్నారు. తన పేరు పెట్టుకోవడంతోనే ఆగిపోయారు. ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి మాదిరిగా తన శిలా విగ్రహాన్ని పెట్టుకోనందుకు సంతోషించాలి. ఇక అసలు విషయానికొస్తే…విజయవాడ విమానాశ్రయానికి 'ఎన్టీఆర్ అమరావతి ఏర్‌పోర్ట్' అని పేరు పెట్టాలని బాబు ప్రతిపాదించారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేబినెట్ సమావేశంలో పెడతానని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఆయన టీడీపీ మంత్రే కాబట్టి పని జరగడం గ్యారంటీ. నిజానికి 'ఎన్టీఆర్ అమరావతి' అనే పేరు చంద్రబాబు తీరని కోరిక. దాన్ని ఇప్పుడు తీర్చుకోవాలనుకున్నారు. రాజధాని నగర నిర్మాణం ప్రతిపాదించినప్పుడు దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకున్నారు. కాని ఒక రాజధాని నగరానికి ఎన్టీఆర్ పేరు పెడితే తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని భావించి వెనక్కు తగ్గారు.
ఎన్టీఆర్ పేరు పెడితే రాజధాని నందమూరి వంశానికి చెందిందనో, టీడీపీ సొంత ఆస్తి అనో భావన కలుగుతుందని కొందరు సలహాలు ఇవ్వడంతో చివరకు 'అమరావతి' అనే పేరు పెట్టారు. ఆల్రెడీ అమరావతి పేరుతో ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉన్నప్పటికీ దాన్నే రాజధాని నగరానికి పెట్టారు. రాజధానికి 'అమరావతి' పేరు పెట్టాలనుకుంటున్నారని వార్త రాగానే రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనివారు, విదేశాల్లోనివారు కూడా 'మంచి పేరు' అని ఆనందపడ్డారు. అమరావతి పేరునే ఖరారు చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అమరావతి పక్కన ఎన్టీఆర్ పేరు తగిలించాలని అనుకున్నా ప్రజలెవరూ అమరావతి పేరుకు ఎన్‌టిఆర్ పేరును జత చేయాలని కోరుకోలేదు. అమరావతి అనే పేరు రాజధానికి అన్ని విధాల తగినట్లుగా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చారిత్రక ప్రాధాన్యం, ప్రాశస్త్యం ఉన్నాయి. దాని వెనక తరతరాల చారిత్రక నేపథ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి పేరు ఖరారు చేసినట్లయితే హైదరాబాదుకు ఉన్నంత ప్రాధాన్యం దీనికీ ఉంటుందని జనం అభిప్రాయపడ్డారు.
ఏ భాషవారైనా పలికేందుకు అనువుగా ఉంది. దీనికి ఎన్‌టిఆర్ పేరు తగిలిస్తే 'అయ్యవారిని చేయబోతే కోతి అయింది' అనే సామెతలా ఉండేది. గుజరాత్ రాజధాని నగరానికి గాంధీ నగర్ అనే పేరు ఉన్నప్పుడు ఇక్కడ ఎన్‌టిఆర్ పేరుంటే అభ్యంతరమేంటి? అని కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నించారు. గాంధీనగర్‌కు వెనకా ముందు మరో పేరు ఏదీ లేదు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు వెనకా ముందు మరో పేరు లేదు. కాని ఇక్కడ అమరావతి పేరుకు వెనకో ముందో ఎన్‌టిఆర్ పేరు తగిలించాలనే ఆలోచన చేశారు. దీనివల్ల ఆ పేరుకున్న విశిష్టత, ప్రాధాన్యత దెబ్బ తింటాయని విజ్ఞులు బాబుకు సలహా ఇచ్చారు. గాంధీ రాజకీయాలకు అతీతుడు మాత్రమే కాకుండా, ఆయన్ని మహాత్ముడిగా ప్రపంచం కీర్తించింది. ఆయన కథ వేరు, ఎన్‌టిఆర్ కథ వేరు. రాజధానికి ఎన్‌టిఆర్ పేరు పెడితే రచ్చరచ్చ అయ్యేది. అప్పటినుంచి చంద్రబాబుకు మనసులో 'ఎన్టీఆర్ అమరావతి' అనే పేరు నిలిచిపోయింది. దేనికి ఈ పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడాయనకు విజయవాడ విమానాశ్రయం కనిపించింది.