నల్లధనం వెలికితీత కోసం పెద్ద పాత నోట్ల రద్దు.. అంటూ, దాన్నొక 'సర్జికల్ స్ట్రైక్' అని ప్రధాని నరేంద్రమోడీ, భారతీయ జనతా పార్టీ అభివర్ణించిన విషయం విదితమే. అయితే, దాని ఫలితం కన్పించకపోవడంతో సర్జికల్ స్ట్రైక్ అన్న మహోన్నతమైన కార్యక్రమానికే ఇప్పుడు మచ్చ వచ్చి పడింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో గతంలో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన విషయం విదితమే. దాన్ని, రాజకీయంగా తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ పడరాని పాట్లూ పడింది. ఆ సర్జికల్ స్ట్రైక్ పేరుని కూడా పెద్ద పాత నోట్ల రద్దుకి వాడేసి, అపహాస్యం చేసింది. ఈ పరిస్థితుల్లో భారత్ నెత్తిన పిడుగులాంటి వార్త ఒకటి పడింది. అదీ తీవ్రవాద సంస్థ అధిపతి హఫీజ్ సయీద్, భారత్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రకటించడం గమనార్హం.
30 మంది భారత సైనికులు పాకిస్తానీ తీవ్రవాదులు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌లో మృతి చెందారట. కేవలం నలుగురే నలుగురు తీవ్రవాదులు ఈ ఘనకార్యం చేశారని హఫీజ్ సయీద్ చెప్పుకున్నాడు. అంతకు ముందు భారత్ నిర్వహించింది అసలు సర్జికల్ స్ట్రైకే కాదని తేల్చి చెప్పాడు హఫీజ్ సయీద్.
ఒక్కటి మాత్రం నిజం, సరిహద్దులోంచి టెర్రరిస్టుల ప్రవాహం దేశంలోకి అలా కొనసాగుతూనే వుంది. దీన్ని నిలువరించే క్రమంలో పెద్దయెత్తున భారత సైన్యం ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. భారత్ గతంలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బకి పాక్ కుదేలవుతుందనుకుంటే, దాన్ని ఏమాత్రం లెక్క చేయడంలేదు పాకిస్తాన్. అప్పట్లో తీవ్రవాద సంస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్న వార్తల సంగతేమోగానీ, తీవ్రవాదులు మరింతగా చెలరేగిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.
సర్జికల్ స్ట్రైక్స్ లాంటి విషయాల్లో దేశ రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడంతో, శతృవు వెన్నులో వణుకు పుట్టాల్సింది పోయి.. దేశం అభాసుపాలవుతోందన్న ఆవేదన సగటు భారతీయుడిలో వ్యక్తమవుతోంది.