సినీ నటుడు మోహన్‌బాబుకి కోపమొచ్చింది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్ళిన మోహన్‌బాబుకి, అక్కడి పరిస్థితులు ఇబ్బందికరంగా కనిపించాయట. 'వెంకన్న దర్శనం డబ్బున్నోళ్ళకేనా.? ఇదెక్కడి చిత్రం.? చాలా బాధ కలిగింది నాకు..' అంటూ మోహన్‌బాబు వాపోయారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు జనం పోటెత్తారు తిరుమలలో. లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాలతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లుచేశామని టీటీడీ చెబుతోంది. ఏర్పాట్లు దేవుడి మీద భక్తితోనో, ప్రజల మీద మమకారంతోనో అనుకుంటే పొరపాటే, వచ్చే ఆదాయం మీద.!
నిజం ఎప్పుడూ నిష్టూరంలాగానే వుంటుంది. ఎందుకంటే, దేవాలయాల మీద వచ్చే ఆదాయం రుచి బాగా మరిగేశాయి ప్రభుత్వాలు. తెలంగాణ ప్రభుత్వం, యాదాద్రిని తిరుమల తరహాలో మార్చేందుకు కోట్లాది రూపాయల్ని వెచ్చిస్తున్నా, తిరుమలలా శ్రీశైలాన్ని మార్చేస్తామని ఆంధ్రప్రదేశ్ చెబుతున్నా, అందులో అసలు కోణం 'ఆదాయార్జనే'.
మోహన్‌బాబు, ఇప్పుడు కొత్తగా తిరుమలలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంలేదు. గతంలోనూ ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అఫ్‌కోర్స్, ఆయనా వీవీఐపీనే అనుకోండి.. అది వేరే విషయం. గతంలో ఆయన రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు, పైగా సినీ ప్రముఖుడు.. అన్నిటికీ మించి అన్ని రాజకీయ పార్టీలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. కాబట్టి, తిరుమలలో మోహన్‌బాబు 'గౌరవానికి' భంగం కలిగిందంటే కాస్తంత ఆలోచించాల్సిన విషయమే.
చిన్న చిన్న దేవాలయాల్లోనే వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. 'దేవుడి ముందు అందరూ సమానమే' అన్న మాట ఉత్తదే. వీవీఐపీలు వేరు.. వారి ద్వారా వచ్చే ఆదాయం లెక్కలు వేరు.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆలయాలకు చెందిన అధికారులు పడే పాట్లు వేరు.
ఏది ఏమైనా, హిందూ దేవాలయాలంటే 'మాంఛి ఆదాయ వనరులుగా' ప్రభుత్వాలు భావిస్తున్న దరిమిలా, తిరుమల లాంటి దేవాలయాలు ప్రముఖులకు విహార యాత్రా స్థలాలుగా మారిపోతున్న దరిమిలా.. ఇలాంటివన్నీ మామూలే మరి.! దేవుడి దగ్గర అంతా సమానమే, కానీ దేవాలయాల్లో మాత్రం కాండోయ్.!