రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు
రేటింగ్: 3.25/5
బ్యానర్: అరన్ మీడియా వర్క్స్
తారాగణం: శ్రీవిష్ణు, నారా రోహిత్, తాన్యా హోప్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, రాజీవ్ కనకాల, అజయ్, సత్యప్రకాష్, సత్యదేవ్, రవివర్మ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: నవీన్ యాదవ్
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
విడుదల తేదీ: డిసెంబరు 30, 2016
అప్పట్లో (1990ల కాలంలో) ఒకడుండేవాడు… ఒక సగటు మధ్య తరగతి యువకుడు. తల్లి రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే, రైల్వే కాలనీలో పెరుగుతాడు. క్రికెట్ అంటే పిచ్చి. డిస్ట్రిక్ లెవల్లో ఆడుతుంటాడు. అందరూ అతడిని రైల్వే రాజు (శ్రీవిష్ణు) అని పిలుస్తుంటారు. రంజీల్లోకి సెలక్ట్ అయి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని, ప్రేమించిన నిత్యని (తాన్య) పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని అనుకుంటాడు. ఏం జరిగినా తలొంచుకుని వెళ్లిపోవడమే తప్ప తెగించి ఎదురెళ్లని మనస్తత్వమున్న ఈ మధ్య తరగతి యువకుడివి చిన్న కలలు. తనకి సంబంధం లేని విషయాల వల్ల అతని జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది. కలలు కల్లలైపోతాయి. క్రికెటర్ అవుదామని అనుకున్నవాడల్లా కొన్ని సంఘటనల అనంతరం క్రిమినల్ అయిపోతాడు. వృత్తి నిర్వహణలో భాగంగా ముల్లుని ముల్లుగా చూడడమే తప్ప, ఇక మరి దేనిగురించి ఖాతరు చేయని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) కారణంగా రైల్వే రాజు జీవితం తలకిందులైపోతుంది. ఇక ఇంతియాజ్ పతనం చూసేందుకే రాజు కంకణం కట్టుకుంటాడు.
ఇదొక ఫిక్షన్ బయోపిక్. నిజంగా ఇది ఫలానా గ్యాంగ్‌స్టర్ జీవితం అంటే నమ్మేసేంత నిజమనిపించేలా దర్శకుడు ఈ కథని తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ డ్రామాలని, యాక్షన్ కథల్ని, ప్రేమగాధల్ని ఊహించుకుని రాయడం అంత కష్టమేం కాదు. కానీ జరగని ఒక జీవిత కథని జరిగినట్టు ఊహించుకుని ఒక జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. స్క్రిప్ట్ పరంగా 'అప్పట్లో ఒకడుండేవాడు' ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లోనే కాదు, గత పదేళ్లలో వచ్చిన ఉత్తమ కథల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ తరహా సినిమాతో ఆడియన్స్ రిలేట్ చేసుకోవాలంటే కచ్చితంగా పాత్రలతో ఎమోషనల్ కనక్ట్ ఏర్పడాలి. రైల్వే రాజు పాత్రతో కనెక్ట్ అవడానికి దర్శకుడు ఉద్దేశపూర్వక సన్నివేశాలేమీ రాసుకోలేదు. కాకపోతే అతనూ మనలాంటి వాడే అనే అనుభూతిని కలిగించేట్టు సింపుల్‌గా ఆ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసాడు. ఎప్పుడైతే అతనొక సగటు యువకుడు అనిపించాడో, అతని కలలన్నిటినీ ఒకడు నిర్దయగా చిదిమేస్తుంటే మనకి చివుక్కుమనిపిస్తుంది. అతనికి సంబంధమే లేని కారణం చూపించి పోలీస్ స్టేషన్‌లో పడేసి కొడుతుంటే తనకి తప్పించుకునే వీలు చిక్కితే బావుండనిపిస్తుంది. ఆరు బంతుల్లో నాలుగు సిక్స్‌లు కొడితే వదిలేస్తామంటే, అతను ఆ నాలుగు సిక్స్‌లూ కొట్టేయాలనుకుంటూ మనసు ఆరాట పడుతుంది.
ఆ సీన్‌తో రాజు క్యారెక్టర్‌తో పూర్తిగా సింపథైజ్ చేయించిన దర్శకుడు అక్కడ్నుంచీ అతడికి తగిలే ప్రతి ఎదురుదెబ్బలతో ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్‌ని బలంగా నాటగలిగాడు. తన జీవితాన్ని నాశనం చేసిన ఇంతియాజ్ అలీ వైపు రాజు కోపంతో రగిలిపోతూ చూస్తుంటే, ఆ ప్రతీకారేచ్ఛ తాలూకు తీక్షణత మనకి అనుభవంలోకి వస్తుంది. ఇవన్నీ ఒక గొప్ప సినిమా లక్షణాలు. ఒక గొప్ప కథకుడి లక్షణాలు. ఒక ప్రతిభావంతుడైన దర్శకుడి గుణాలు. సంపాదించే ప్రతి రూపాయినీ నీ పతనానికే వాడతానంటూ సవాల్ చేసిన రాజు ఆర్థికంగా బాగా ఎదిగిన తర్వాత ఇంతియాజ్‌ని పట్టించుకోకపోవడం మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఒక విధమైన వెలితి. ఓవర్లో మూడు మంచి షాట్లు ఆడితే బౌలర్‌పై జాలి పడే గుణమున్న రాజు కరడుకట్టిన క్రిమినల్‌గా మారిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవడం, దీంతో ఏం సాధించానంటూ ఆత్మ పరిశీలన చేసుకోవడం ఫిలసాఫికల్‌గా బాగుంది కానీ అందరికీ కనక్ట్ అయ్యే అంశాలు కావివి. మళ్లీ ఇంతియాజ్ తెర మీదకి వచ్చాక కానీ కథ జోరందుకోదు. కథ ఎంత బాగా చెప్పినా దానిని కంచికి చేర్చే విషయంలో తడబడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తన కథ కంటే క్లయిమాక్సే గుర్తుండిపోయేలా చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ క్లయిమాక్స్‌తో హృదయాల్ని స్పృశించాడు.
ఇందులో ప్రతినాయకులంటూ ఎవరూ లేరు. రాజు, ఇంతియాజ్ ఇద్దరి పాత్రల్లోను మంచి, చెడు లక్షణాలుంటాయి. పరిస్థితులు, పర్యవసానాలే ప్రతినాయక పాత్ర పోషిస్తుంటాయి. ఇంతియాజ్ పాత్రలో నారా రోహిత్ చక్కగా అమరిపోయాడు. తన పాత్రకి ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా కానీ కథకి అనుగుణంగా ఎంతసేపు కనిపించాలో అంతవరకే కనిపించి తనకి తన కంటే కథే ఎక్కువని నిరూపించుకున్నాడు. అమాయకుడైన మధ్య తరగతి జీవితం నుంచి పరిస్థితుల వల్ల రాటుదేలిన క్రిమినల్‌గా మారిన రాజు పాత్రలో శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. ఆ పాత్రపై సింపతీ కలగడానికి తన బాయ్ నెక్స్‌ట్ డోర్ లుక్స్ బాగా దోహదపడ్డాయి. తాన్యా హోప్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. బ్రహ్మాజీ పాత్ర చాలా బాగుంది, ఆయన నటన కూడా ఆకట్టుకుంటుంది. రాజీవ్ కనకాల కనిపించేది కాసేపే అయినా ఉనికి నిలుపుకున్నాడు. సత్యప్రకాష్, రవివర్మ, ప్రభాస్ శ్రీను, అజయ్ సహాయ పాత్రల్లో మెప్పించారు.
కొన్ని పాటలు బలవంతంగా చొప్పించినట్టు అనిపించింది. తక్కువే పాటలున్నప్పటికీ ఆకట్టుకునే బాణీలు ఇవ్వలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమా చూస్తున్న భావన రాకుండా, కళ్ల ముందు జరుగుతున్నది చూస్తున్న భావన కలిగించేట్టు చేయడంలో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా వుంది. ఆ రియలిస్టిక్ ఎఫెక్ట్ వల్ల పాత్రలతో మరింతగా రిలేట్ చేసుకునే వీలు కుదిరింది. సంభాషణలు చాలా బాగున్నాయి. తొంభైల కాలమానంలోని పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలోని మార్పులు, నక్సలిజం, భూముల దందాలు వగైరా విషయాలని అసలు ఇతివృత్తానికి అనుసంధానం చేస్తూ ఈ కథని చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. కథల ఎంపికలో నారా రోహిత్ తన ప్రత్యేకత ఇంకోసారి చాటుకున్నాడు. రోహిత్, శ్రీవిష్ణు ఇద్దరూ చాలా బాగా చేసినప్పటికీ ఈ కథ పెద్ద స్టార్ల చేతిలోకి వెళ్లి, రిస్క్ అనిపించినా వాళ్లు అటెంప్ట్ చేసి ఉన్నట్టయితే దీనికి రీచ్ పెరిగుండేదనిపిస్తుంది. అప్పుడు బడ్జెట్ పరమైన పరిమితులు కూడా పెరుగుతాయి కనుక మరింత ఎఫెక్టివ్‌గా ఈ స్టోరీని ప్రెజెంట్ చేసే వీలుండేది. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో పాటు, వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకి కావాల్సిన అంశాలేవీ లేకపోవడం దీనిని లిమిటెడ్ ఆడియన్స్‌కి పరిమితం చేస్తుంది. కానీ ఒక మంచి ప్రయత్నం కేవలం ప్రశంసలకి మాత్రం పరిమితమైపోకుండా, ఆర్థికంగాను లబ్ధి పొందితే బాగుంటుంది.
బాటమ్ లైన్: ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా!
గణేష్ రావూరి