క్రికెట్.. మన దేశంలో మోస్ట్ పాపులర్ గేమ్. అయినాసరే, ఈసారి క్రికెట్ కంటే ఎక్కువగా ఒలింపిక్స్ పుణ్యమా అని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి పాపులారిటీ పెరిగింది. పీవీ సింధు ఒలింపిక్ గేమ్స్‌లో 'ఆట' మొదలెట్టినప్పటినుంచీ, గోల్డ్ కోసం చేసిన పోరాటం ముగిసేదాకా.. దేశమంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసింది. తృటిలో బంగారు పతకం మిస్ అయినాసరే, రజత పతకం సాధించిన సింధు దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. కోట్లు గుమ్మరించేశాయి వివిధ రాష్ట్రాలు. తెలంగాణ ప్రభుత్వం, పీవీ సింధుని ఘనంగా సన్మానిస్తే, అంతకన్నా ఘనంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ పీవీ సింధు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. అలా ఈ ఏడాది సింధు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అయిపోయింది.. అదీ రాత్రికి రాత్రి.
ఇక, ఈ ఏడాది పారా ఒలింపిక్స్‌లో కూడా భారత క్రీడాకారులు అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చడం విశేషం. అయితే ఒలింపిక్ విజేతల స్థాయిలో పారా ఒలింపియన్లకు పాపులారిటీ దక్కలేదనుకోండి.. అది వేరే విషయం. అసలు పారా ఒలింపియన్ విజేతలెవరు.? అంటే, ఇప్పుడు గూగుల్ వెతకాల్సిన పరిస్థితి. అదే, ఒలింపిక్స్‌లో సత్తా చాటిందెవరు.? అంటే పతకం రాకపోయినా దీపా కర్మాకర్, పతకం సాధించిన సాక్షి మాలిక్ పేర్లు గుర్తుకొస్తాయి. ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ వస్తే, పారా ఒలింపిక్స్‌లో నాలుగు మెడల్స్ వచ్చాయి. ఇందులో రెండు గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి బ్రాంజ్. మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జఝారియా గోల్డ్ సాధిస్తే, దీపా మాలిక్ సిల్వర్, వరుణ్ భాటి కాంస్య పతకాన్ని సాధించారు.
అన్నట్టు, ఈ ఏడాదిలో మరో క్రీడా అద్భుతం చోటు చేసుకుంది. అదే, కబడ్డీ వరల్డ్ కప్. ఈసారీ భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. కబడ్డీలో భారత్‌కి తిరుగులేదని మరోమారు భారత జట్టు నిరూపించింది. తొలి గేమ్‌లో సౌత్ కొరియా చేతిలో ఓటమి పాలైనా, ఆ తర్వాత ఎక్కడా భారత జట్టు తడబడలేదు. కబడ్డీ, ఇండియన్ గేమ్. అయినాసరే, ఈ గేమ్‌కి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఈ కబడ్డీ వరల్డ్ కప్‌తో తీసుకురాగలిగామంటే భారతీయులుగా మనమంతా గర్వపడాల్సిన విషయం.
క్రికెట్‌లో టీమిండియా సాధించిన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా ఈ ఏడాది క్రికెట్ అభిమానుల్ని ఓ రేంజ్‌లో అలరించింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా టీ20 వరల్డ్ కప్‌ని మాత్రం టీమిండియా చేజార్చుకుందనుకోండి.. అది వేరే విషయం. మొత్తమ్మీద, క్రీడారంగం పరంగా ఈ ఏడాది మిక్స్‌డ్ రిజల్ట్ భారత్‌కి లభించింది.