రివ్యూ: ఇంట్లో దెయ్యం నాకేం భయం
రేటింగ్: 2/5
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక జయకుమార్, మౌర్యాని, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, ప్రభాకర్, చలపతిరావు, ప్రభాస్ శ్రీను, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
కథ, కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: డిసెంబరు 30, 2016
ఒక పెద్ద భవంతి, అందులో ఒక దెయ్యం, ఆ భవంతిలోకి కొత్తగా వచ్చి చేరిన కుటుంబం… సగటు హారర్ కామెడీ చిత్రాల సెటప్‌తోనే 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' కూడా మొదలవుతుంది. ఈ జోనర్‌కి తనవైపు నుంచి ఎలాంటి ఫ్రెష్‌నెస్ యాడ్ చేయడానికి దర్శకుడు నాగేశ్వరరెడ్డి ప్రయత్నించలేదు. ఈ ఫార్ములాతో సక్సెస్ అయిన సినిమాలని ఫాలో అయిపోయి సక్సెస్ అయిపోవాలని చూసాడు. ఇప్పటికే ఈ తరహా చిత్రాలని చాలా వరకు చూసేసిన ప్రేక్షకులకి ఇక మళ్లీ మళ్లీ అదే చూపిస్తే సరిపోదు. అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్ లాంటి నటుల్ని పెట్టుకుని కూడా హాస్యం కోసం దెయ్యంతో దెబ్బలు తినిపించే అవే రొటీన్ సీన్లు చూపిస్తే సినిమా పాస్ అయిపోదు.
కథలోకి వెళితే… ఒక అనాధ పాప ఆపరేషన్ కోసం అప్పు చేసి ఇరుక్కుపోతాడు బ్యాండ్‌మేళం నరేష్ (నరేష్). తప్పనిసరి పరిస్థితుల్లో భూతవైద్యుడి వేషం కడతాడు. కొత్తగా కొనుక్కున్న కోట్ల విలువ చేసే భవంతిలో దెయ్యం ఉండడంతో, పిల్ల పెళ్లి పెట్టుకున్న తండ్రి (రాజేంద్రప్రసాద్) సాయం కోసం నరేష్‌ని ఆశ్రయిస్తాడు. అక్కడున్న దెయ్యాన్ని బయటకి పంపించడం తెలియక, అక్కడ్నుంచి బయట పడలేక నరేష్ ఇరుక్కుపోతాడు. ఇంతలో ఆ దెయ్యం నరేష్‌ని పెళ్లి చేసుకుంటానని, అప్పుడే అక్కడ్నుంచి వెళతానని తేల్చి చెబుతుంది.
ఆ అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారిందీ, ఎవరిపై పగబట్టిందీ అనే దానికి కూడా ఇలాంటి సినిమాల్లో తరచుగా కనిపించే సీన్లే రాసుకున్నారు. ఎటుపోయీ హీరోని పెళ్లి చేసుకుంటానని, అతడితోనే ఉండాలని అనుకుంటున్నానని చెప్పే కారణం ఒక్కటే ఇందులోని కొత్త ఎలిమెంటు. మిగిలినదంతా రొటీన్ వ్యవహారం. ప్రథమార్ధంలో సీన్లు రొటీన్‌గా ఉన్నప్పటికీ వినోదం బాగానే అనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ ఇద్దరికీ విడివిడిగా దెయ్యంతో ఫస్ట్ ఎన్‌కౌంటర్ సీన్లు నవ్విస్తాయి. అయితే ద్వితీయార్ధానికి వచ్చేసరికి కూర్చోపెట్టే పాయింట్ అంటూ లేకపోయింది. ఏం జరుగుతుందనేది ముందే తెలిసిపోవడం, దెయ్యంతో ఎలాంటి ప్రమాదం లేదనే ధీమా వచ్చేయడంతో ఇక హారర్ ఎలిమెంట్ పూర్తిగా ఎఫెక్ట్ కోల్పోయింది.
ఇక కామెడీ విషయానికి వస్తే, హారర్ కామెడీ జోనర్‌లో కామెడీ అంటూ ఉంటే… దెయ్యంతో అన్ని క్యారెక్టర్లనీ కొట్టించడం తప్ప మరేమీ ఉండదన్నట్టు అవే సీన్లు రిపీట్ చేసుకుంటూ పోయారు. దీని వల్ల హాస్యం కూడా పండకపోవడంతో ద్వితీయార్ధం బోర్ అనిపిస్తుంది. దెయ్యం బ్యాక్ స్టోరీ కానీ, దానికున్న లక్ష్యం కానీ ఆకట్టుకోవు. క్లయిమాక్స్‌లో ఎంత డ్రామా నడిపించినా కానీ ఏమవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతున్నప్పుడు ఇక అదంతా సాగతీత వ్యవహారంలానే ఉంటుంది తప్ప ఉత్కంఠ రేకెత్తించదు.
ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోన్న అల్లరి నరేష్ 'హారర్ కామెడీ' చిత్రాల సక్సెస్‌ని చూసి విజయానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనుకున్నట్టున్నాడు. అయితే అందరి కంటే లేట్‌గా ఈ ట్రెయిన్ ఎక్కిన నరేష్ అందరూ వెళ్లిన రూట్ కాకుండా కొత్త దారిలో వెళ్లడానికి ప్రయత్నించాల్సింది. తను చేసే సినిమాల మధ్య తనకిది వెరైటీ అయి ఉండొచ్చు కానీ దీంట్లో మనం ఫీలయ్యే వెరైటీ ఏమీ లేకపోయింది. నరేష్, రాజేంద్రప్రసాద్‌కి తమ ప్రతిభ చూపించి ఈ కామెడీని గట్టెక్కించే అవకాశాన్ని దర్శకుడు కూడా ఇవ్వలేదు. మిగిలిన నటీనటులంతా చేసినట్టే దెయ్యాన్ని చూసి భయపడుతూ, దాంతో తన్నులు తింటూ నవ్వించడం తప్ప వీళ్లు ప్రత్యేకించి చేసిందేమీ లేదు. కృతిక ఓకే అనిపించింది కానీ, కీలకమైన పాత్రలో మౌర్యాని తేలిపోయింది. ఆమె పేలవమైన నటన కారణంగా ఆ పాత్రపై కలగాల్సిన సింపతీ కూడా కలగకుండా పోయింది. సపోర్ట్ కాస్ట్ చాలా మందే ఉన్నారు కానీ అందరికీ ఒకే తరహా పాత్రలిచ్చారు. దెయ్యాన్ని చూసి భయపడడం, లేదా దానితో తన్నించుకుని బాధ పడడం మినహా ఎవరికీ ఎలాంటి స్కోప్ ఇవ్వలేదు.
పాటలే అవసరం లేని ఈ చిత్రంలో నాలుగు పాటలు పెట్టి, వాటిని ఫారిన్ లొకేషన్లలో తీసారు. పోనీ అవి వినడానికి బాగున్నాయా అంటే అదీ లేదు. సందర్భం కూడా లేకుండా వచ్చి పడే పాటల వల్ల సినిమా మరింత విసిగిస్తుందే తప్ప బెటర్ అనిపించదు. ఇతర విభాగాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. భారీ చిత్రాలు నిర్మించే బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తక్కువ బడ్జెట్‌లో, సక్సెస్‌ఫుల్ జోనర్ సినిమాతో ఒక అటెంప్ట్ చేసారు కానీ మిగిలిన నిర్మాతల కంటే లేట్‌గా ఇది ట్రై చేయడం, అది కూడా ఒక రొటీన్ కథని ఎంచుకోవడం వల్ల ఆయనకి దీని వల్ల ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. నాగేశ్వరరెడ్డి కూడా ఈజీ సక్సెస్ కోసం చేసిన ప్రయత్నంలా ఉంది తప్ప కథ, కథనాలపై శ్రద్ధ కనిపించలేదు. ఇంత వీక్ స్క్రిప్ట్ రాసుకున్నపుడు కనీసం సన్నివేశాల పరంగా అయినా కేర్ తీసుకోవాలి. అవి కూడా వేరే సినిమాల నుంచి కాపీ చేసి… చూసిన సీన్లే చూసి నవ్వుకోమంటే డబ్బులిచ్చి మరీ ఈ సినిమాకెందుకు వెళ్లాలి? అది కూడా ఈ జోనర్‌లో ఇంతకంటే బెటర్ కామెడీ ఉన్న సినిమాలు ఫ్రీగా యూట్యూబ్‌లోనే దొరుకుతున్నపుడు! ఇప్పటికీ హారర్ కామెడీలకి కాలం చెల్లిపోలేదు. ఈ తరహా వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకులు ఇంకా ఉన్నారు. కాకపోతే పంథా మార్చి కొత్తదనంతో ముందుకొస్తే ప్రేమకథాచిత్రమ్ మాదిరిగా మళ్లీ బాక్సాఫీస్ వద్ద సంచలనం చేయవచ్చు. అంతే తప్ప దెయ్యంతో కమెడియన్లని కొట్టిస్తూ, ఈ తరహా సినిమాల్లో ఇంతకంటే ఏమీ ఉండదన్నట్టు చుట్టి పారేస్తే జోనర్ ప్రియులూ వీటిని ఇక పట్టించుకోకపోవచ్చు.
బాటమ్ లైన్: కామెడీ దెయ్యం లేదేం భయం!
గణేష్ రావూరి