ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది.. కొత్తగా జరుగుడేంది.? ఎప్పటికప్పుడు గ్యాంగ్ రేప్ ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతూనే వున్నాయి. ఆ మాటకొస్తే, మనది 'గ్యాంగ్ రేప్‌ల భారతం' అని చెప్పుకోవాలేమో. ఆ స్థాయిలో నిత్యం ఎక్కడో ఓ చోట వరుస 'గ్యాంగ్ రేప్‌లు' జరుగుతూ దేశ ప్రతిష్టను దిగజార్చేస్తున్నాయన్నది నిష్టుర సత్యం. ఏమయ్యింది నిర్భయ చట్టం.? అనడక్కండి. దేశంలో చట్టాలున్నాయ్.. కానీ, చట్టం తన పని తాను చేసుకుపోదంతే.
దేశంలో అవినీతిని పారద్రోలడానికి చట్టాలు లేకనా.? మరెందుకు, అవినీతి జాడ్యంలా తయారయ్యింది.? క్యాన్సర్ మహమ్మారిలా సమాజాన్ని తినేస్తోంది.? అనంటే, అవినీతి పరులే రాజ్యమేలుతున్నారు గనుక. రాజకీయ అవినీతి అంతమొందనంతకాలం దేశంలో ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా ఉపయోగం లేదు. అది నిర్భయ చట్టం కావొచ్చు, పార్టీ ఫిరాయింపుల చట్టం కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. చట్టం తన పని తాను చేసుకుపోకుండా అన్నిటికీ రాజకీయం అడ్డు తగులుతూనే వుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, త్వరలో బినామీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని నరేంద్రమోడీ సర్కార్ చెబుతోంది గనుక. బినామీ.. ఈ పదం రాజకీయ నాయకులకు బాగా అలవాటైందే. రాజకీయం అంటే బినామీ, బినామీ అంటే రాజకీయం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగారి జేబులో వంద రూపాయలు కూడా వుండవట. ఇంకో పార్టీ అధినేతకు సొంతంగా కారు వుండదాయె. మరో కేంద్ర మంత్రిగారిది పాపం, సొంత ఇల్లు లేని దయనీయ స్థితి. చెప్పుకుంటూ పోతే, పొలిటికల్ చిత్రాలు అన్నీ ఇన్నీ కావు.
ఎమ్మెల్యే సీటు కోసం పది కోట్లు అయినా ఖర్చు చేయడానికి వెనుకాడ్డంలేదు మన దేశంలో రాజకీయ నాయకులు. ఎంపీగా గెలవడానికి 100 కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీ.. అంటున్నారు ఇంకొందరు రాజకీయ నాయకులు. దాదాపుగా దేశమంతటా ఇదే పరిస్థితి. అయినాసరే, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం సొంత కారు లేదని సదరు రాజకీయ నాయకులు డిక్లరేషన్లు ఇస్తుంటారు. వాళ్ళేమో అత్యంత ఖరీదైన కార్లలో తిరుగుతారు, కానీ సొంత కార్లు వుండవ్. ఇదెలా సాధ్యం.? సమాధానం సింపుల్.. అదే బినామీ మాయాజాలం.
దేశంలో చాలా చట్టాలు సామాన్యుల్ని ఏడిపించడానికి, పెద్దోళ్ళని రక్షించడానికే తయారవుతాయి. ఓ రాజకీయ ప్రముఖుడి పుత్రరత్నంపై నిర్భయ కేసు నమోదయ్యిందంటే, తెరవెనుక లాలూచీలు షురూ అవుతాయి. సింపుల్‌గా ఆ కేసు నుంచి తప్పించుకుంటాడు. అదే ఓ సామాన్యుడి మీద అదే కేసు నమోదయ్యిందా.. ఇక అంతే సంగతులు. పేదోడికి ఒకలా, పెద్దోడికి ఒకలా.. ఇదీ దేశంలో చట్టాల తీరు. కారణం మళ్ళీ చెప్పాలా.? అదే రాజకీయ పెత్తనం. పెద్ద పాత నోట్ల రద్దుతో నాశనమయ్యింది సామాన్యుడి జీవితమే కదా.! ఇప్పుడు మళ్ళీ బినామీ చట్టమట. ఎవర్ని ఉద్ధరించడానికి.? ఎవర్ని మభ్యపెట్టడానికి.? చిత్తశుద్ధి వుంటే ముందే రాజకీయ ప్రక్షాళనతో మొదలవ్వాలి ఏదైనాసరే. కానీ, అంత సీన్ పాలకులకి ఎక్కడిది.!