ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అంతరంగం ఏమిటనేది అంతబట్టడంలేదు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? లేదా? అర్థం కావడంలేదు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు, ఫలాన పార్టీలో చేరబోతున్నట్లు కొంతకాలం మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత దాని ఊసే ఉండటంలేదు.
కిరణ్ రాజకీయ రీఎంట్రీ గురించి అనేక రకాలుగా ప్రచారం జరుగుతున్నా ఆయన నుంచి సరైన ప్రతిస్పందన లేదు. తాను మళ్లీ రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నట్లు కొంతకాలం కిందట ఆయనే సంకేతమిచ్చారు. మరోమాటలో చెప్పాలంటే స్పష్టంగానే తన అంతరంగం బయటపెట్టారు. కాని మళ్లీ కామైపోయారు.
కిరణ్ సాధారణ రాజకీయ నాయకుడైవుంటే రాజకీయ రీఎంట్రీ గురించి ఇంతలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కాని ఆయన మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పదవి చేపట్టి ఆ తరువాత అనూహ్యంగా తెరమరుగైపోయారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారా? సన్యాసం తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలకు జవాబులు వెదుక్కుంటున్న నేపథ్యంలోనే తాజాగా 'నాకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు' అని కిరణ్ చెప్పారు. ఈ మాట క్యాజువల్‌గా అన్నారో, సీరియస్‌గా ఉన్నారో తెలియదు. ఎందుకంటే మీడియా ఈ స్టేట్‌మెంటుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడలేదు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ వివాహానికి హాజరైన కిరణ్ తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోడంలేదని చెప్పారు. ఈ ఒక్క మాట తప్ప మరేమీ చెప్పకపోవడంతో ఇదంత సీరియస్ విషయం కాదనుకుంటున్నారు. మీడియా ప్రతినిధులను కూడా కలుసుకోవడానికి ఇష్టపడలేదు. మళ్లీ రాజకీయరంగ ప్రవేశం చేయబోవడంలేదని చెప్పదల్చుకుంటే మీడియా సమావేశం పెట్టి చెప్పేవారే. తాను రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పలుసార్లు సంకేతాలిచ్చిన కిరణ్ దాన్ని ఊహాగానాలకే పరిమితం చేస్తున్నారు.
ఈమధ్య జనసేన పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయట…! కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు కిరణ్‌కు అభినందనలు కూడా చెప్పినట్లు ఓ పత్రిక రాసింది. రాజకీయాల్లో సీనియర్, ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తారనుకోవడం భ్రమ. కిరణ్ గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు కాకపోవచ్చు. కాని ఆయన ముందు పవన్ కళ్యాణ్ తక్కువే కదా…!
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు హైకమాండ్‌ను ఎదిరించి పదవికి, పార్టీకి రాజీనామా చేశాక, ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక ఉద్దేశపూర్వకంగానే ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉన్నారు. కాని రాజకీయాలనుంచి విరమించాలని అనుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. రీఎంట్రీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టే అందుకు సంబంధించిన వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. తన ప్రయత్నాలు వర్కవుట్ కాకపోవడంతో ఆయన మీడియా వార్తలకు స్పందించలేదు. రెండుమూడుసార్లు ఏవో కార్యక్రమాలకు హాజరైనప్పుడు రీఎంట్రీ గురించి మీడియాకు పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అర్థమైంది. ఈ నేపథ్యంలోనే కొంతకాలం క్రితం తన అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య చేసిన ప్రకటన ఆయన రాజకీయరంగ ప్రవేశం ఖరారైందనే భావన కలిగించింది. రీఎంట్రీ గురించి గమ్మత్తుగా ప్రకటించారు. ఆ ప్రకటన ఆషామాషీగా ఏమీ లేదు. నిర్దిష్టంగానే ఉంది.
పెళ్లి (రీఎంట్రీ) గురించి మాటా ముచ్చట అయ్యాయని, పెళ్లికూతురు పేరు (పార్టీ పేరు) గోప్యంగా ఉంచామని కిరణ్ స్వయంగా తన శ్రేయోభిలాషులకు చెప్పారు. తాళిబొట్టు కట్టే తేదీ ఖరారైతే (చేరే తేదీ) అందరికీ శుభలేఖలు పంపుతానని, తొందరపడాల్సిన అవసరం లేదని అన్నారు. దీన్నిబట్టి ఏమనుకోవాలి? ఆయన మళ్లీ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారనుకోవాలి. కాని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఈ మాజీ ముఖ్యమంత్రి కావాలనే గోప్యత పాటిస్తున్నారనిపిస్తోంది. కిరణ్‌ను కాంగ్రెసులోకి తీసుకురావాలని ఆ పార్టీలోని ఆయన సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ప్రస్తుత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఆయనకు పోటీగా కిరణ్‌ను తీసుకురావాలనుకుంటున్నారట…! ఈ నాయకులు కిరణ్ సమైక్యాంధ్ర పెట్టినప్పుడు ఆయనకు అండగా ఉన్నవారు. కాలక్రమంలో కాంగ్రెసులోకి వెళ్లిపోయారు. కిరణ్ చెప్పేదాన్నిబట్టి చూస్తే ఇది కూడా కేవలం ఊహాగానమేనా? రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆయనకే ఆసక్తి లేనప్పుడు రఘువీరాకు పోటీగా కాంగ్రెసులోకి ఎందుకు వెళ్లాలనుకుంటారు? రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కొందరు నాయకులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారెవ్వరి మీదా జరగని ప్రచారం కిరణ్‌పై జరిగింది. దీనికి ముగింపు ఏమిటో ఆయనే చెప్పాలి…!