ఎమ్బీయస్: టాటా వివాదంలో మిస్త్రీ తప్పుందా?

టాటా గ్రూపులో వివాదం అక్టోబరు నుంచి నడుస్తోంది. రాజీ సూచనలు ఎక్కడా కనబడకపోగా డిసెంబరు 11 ఆదివారం నాడు రతన్ టాటా సైరస్ మిస్త్రీపై బహిరంగంగా విరుచుకు పడ్డారు – అసలు సైరస్ సెక్ట్…

టాటా గ్రూపులో వివాదం అక్టోబరు నుంచి నడుస్తోంది. రాజీ సూచనలు ఎక్కడా కనబడకపోగా డిసెంబరు 11 ఆదివారం నాడు రతన్ టాటా సైరస్ మిస్త్రీపై బహిరంగంగా విరుచుకు పడ్డారు – అసలు సైరస్ సెక్ట్ కమిటీని తప్పుదోవ పట్టించి చైర్మన్ అయ్యాడని, టాటా గ్రూపును లాభాల బాట పట్టించే అద్భుత ప్రణాళికలు తన దగ్గర వున్నాయని బుకాయించి, చైర్మన్‌గా సెలక్టయిపోయాడని ఆరోపించారు. ఇది వింటే నవ్వు వస్తుంది. టాటా అంటే చాలా ప్రొఫెషనల్‌గా నడిచే సంస్థ అనుకుంటాం. నిష్ణాతులతో కూడిన ఓ కమిటీ రెండేళ్లపాటు సరైన వ్యక్తి కోసం వెతికివెతికి చివరకు ఓ కోతలరాయుడికి అప్పగించామని రతన్ ఒప్పుకుంటున్నారా? సైరస్ బోగస్ అని నాలుగేళ్ల తర్వాత తెలిసిందా? మరి తీసేయడానికి నాలుగు నెలల క్రితమే సైరస్ పనితీరును మెచ్చుకుంటూ, జీతం పెంచాలని బోర్డు తీర్మానం ఎందుకు చేసింది? అంతేకాదు, అతని 2025 నాటికి టాటా గ్రూపు ఎలా వుండాలో అంటూ వేసిన 2025 ప్లానును కూడా ఆమోదించిందెందుకు? తనను సెలక్టు చేసిన కమిటీ చైర్మన్ లార్డ్ కుమార్ భట్టాచార్య ఆర్నెల్ల కితం కూడా తనను ప్రశంసించాడని సైరస్ చెప్పాడు. 

దీనితో బాటు తన కుటుంబ వ్యాపార సంస్థ ఐన షాపుర్జీ పలోంజీకి దూరంగా వుంటానని చెప్పి మాట నిలబెట్టుకోలేదని కూడా రతన్ ఆరోపించారు. దీనికి సైరస్ సమాధానం చెపుతూ తను చైర్మన్ అయ్యాక షాపుర్‌జీ కంపెనీ బోర్డుల్లో పాలుపంచుకోలేదని ఉద్ఘాటించాడు. వివాదం తొలినాళ్లలో సైరస్ షాపుర్‌జీ కంపెనీకి మేలు చేసేడని రతన్ వర్గం ఆరోపించింది. తను చైర్మన్ అవుతూనే షాపుర్‌జీ కంపెనీకి కాంట్రాక్టులు యివ్వకూడదని తను టాటా గ్రూపు అంతటికీ ఆదేశాలిచ్చానని సైరస్ చెప్పాడు. దాన్ని వీళ్లు ఖండించలేదు. మరి యిలాటి ఆరోపణలు చేయడం రతన్ స్థాయి వ్యక్తికి తగునా? ఈ వివాదంలో సైరస్ తప్పు ఎంత వుంది?

టాటా గ్రూపులో 29 లిస్టెడ్ కంపెనీలు, 70కి పైగా అన్‌లిస్టెడ్ కంపెనీలు వున్నాయి. అన్ని కంపెనీలకు కలిపి మొత్తం 41 లక్షల మంది షేర్ హోల్డర్లు వున్నారు. టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ అక్టోబరు 24 నాటి బోర్డు సమావేశంలో ఆ బోర్డు తన చైర్మన్ సైరస్ మిస్త్రీని అత్యంత అగౌరవమైన రీతిలో తొలగించింది. అజెండాలో ముందే ప్రస్తావించకుండా, ‘ఇతర విషయాలు..’ (ఎనీ అదర్ బిజినెస్) అని హెడింగ్ కింద చైర్మన్ తొలగింపు వంటి ముఖ్య అంశాన్ని చేపట్టి ముగించింది. సమావేశం 2.30కి ప్రారంభం కానుండగా ఒక్క నిమిషం ముందు రతన్, నితిన్ నోహ్రియా అనే డైరక్టరు మిస్త్రీ గదిలోకి వచ్చి ‘నీ అంతట నువ్వు రాజీనామా చేస్తే మంచిది, లేకపోతే మేమే తీసేయాల్సి వుంటుంది’ అని చెప్పారట. ‘నేను దిగిపోను. మీరు చేసుకోవాలనుకున్నది చేసుకోండి’ అన్నాడు సైరస్. సమావేశంలో మొత్తం 9 మంది డైరక్టర్లలో 6గురు మద్దతు తెలిపారు. ఇద్దరు రాలేదు. మిగిలిన వ్యక్తి సైరస్సే. 

ఆ తర్వాత  టాటా సన్స్‌లో బోర్డు డైరక్టర్లుగా వున్న టివిఎస్‌కి చెందిన వేణు శ్రీనివాసన్, బెయిన్ క్యాపిటల్‌కు చెందిన అమిత్ చంద్ర, మాజీ రాయబారి రోనెన్ సేన్‌లతో బాటు స్వతంత్ర సభ్యుడు బ్రిటిష్ ఎంపీ లార్డ్ కుమార్ భట్టాచార్య, మరొకరు సభ్యులుగా వుండే ఒక అన్వేషణ కమిటీ వేసి కొత్త చైర్మన్ కోసం వెతికించి నాలుగు నెలల్లో కొత్త చైర్మన్‌ను వేస్తామని అప్పటివరకు 7 ఏళ్ల రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్‌గా అప్పటికప్పుడే నియమించింది. కొందరు చెప్పేదేమిటంటే ఏడాదిగా రతన్ సైరస్‌పై చిర్రుబుర్రు లాడుతూనే వున్నాడట. తన అసంతృప్తిని గుర్తించి సైరస్ తనంతట తనే వెళ్లిపోతాడేమోనని పదినెలలు ఓపిక పట్టాడట. చివరకు రెండు నెలలుగా ఎలా తీసేయాలా అని పథకం రచించాడు. న్యాయసలహా తీసుకుంటే సైరస్ తనంతట తనే రాజీనామా చేయాలి లేకపోతే బోర్డులో అధిక సంఖ్యాకులు అతన్ని తీర్మానం ద్వారా తీసేయాలి అని చెప్పారు. కొందరు డైరక్టర్లను విశ్వాసంలోకి తీసుకుని పథకం గురించి చెప్పి ఆఖరి ఛాన్సుగా అక్టోబరు 23న రతన్ సైరస్‌కు కబురు పంపాడు – నీ అంతట నువ్వే రాజీనామా చేస్తే మర్యాదగా వుంటుంది అని. తన తరఫు వాదన వినిపించడానికి బోర్డు సమావేశాన్ని వేదికగా వుపయోగించుకోదలచిన సైరస్ దానికి ఒప్పుకోలేదు. అయితే సైరస్‌కు మాట్లాడే అవకాశం కూడా యివ్వకుండా కుట్ర పన్ని తీసేశారు. 

ఇప్పుడు అవమానకరంగా తీసేయడంతో సైరస్ తిరగబడ్డాడు. బోర్డు సభ్యులకు ఒక ఈమెయిల్ రాశాడు. అది మీడియాకు లీకయింది. సైరసే లీక్ చేశాడని రతన్ గ్రూపు అంటుంది. ఆ ఈమెయిల్‌లో సైరస్ చాలా ఆరోపణలే చేశాడు. రతన్ తనను స్వతంత్రంగా పని చేయనీయలేదన్నది ప్రధాన ఆరోపణ. టాటా సన్స్ బోర్డు సమావేశాలకు గత నాలుగేళ్లగా తను హాజరు కాకపోవడం మిస్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ యిచ్చేదానికే అంటాడు రతన్. రాకపోయినా వెనక్కాల నుంచి కథ నడిపించేవాడనీ, ఓ సారి ఓ మీటింగు మధ్యలో యిద్దరు టాటా ట్రస్టు డైరక్టర్లు బయటకు వెళ్లిపోయి, రతన్ ఆదేశాలు తీసుకుని వెనక్కి రావడానికి గంట పట్టిందని సైరస్ అన్నాడు. రతన్ హయాంలో చేసిన విదేశీ కొనుగోళ్ల కారణంగా గ్రూపులోని 5 కంపెనీలలో రూ.1.96 లక్షల కోట్లను పోసినా రూ. 1.1 లక్షల కోట్ల పెట్టుబడి నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని, వాటిని యిప్పుడు రైటాఫ్ చేయవలసి వస్తోందని అంటాడు సైరస్. రతన్ యివన్నీ తిప్పికొడుతూ తరతరాలుగా వున్న టాటా సిద్ధాంతాల ప్రకారం సైరస్ నడవలేదని, గ్రూపు భవిష్యత్తుకై అతన్ని తప్పించక తప్పలేదని అన్నాడు. టాటా సిద్ధాంతాలు అనే మంత్రాన్ని రతన్ ఎన్నిసార్లు జపిస్తున్నాడో లెక్కలేదు.

లాభాల్లో వున్న కంపెనీలపైనే సైరస్ మిస్త్రీ దృష్టి పెట్టారని, నష్టాల్లో వున్నవాటిని వదుల్చుకోవాలని చూసి, ఉద్యోగులను సాగనంపి టాటా ఫిలాసఫీకే ఎసరు పెట్టాడని సైరస్‌పై రతన్ వర్గం ఆరోపణ. ప్రధాన కంపెనీలపై పెత్తనం చేద్దామని కూడా సైరస్ ప్రయత్నించాడని మరో ఆరోపణ. టాటా సన్స్ చైర్మన్‌గా వున్న వ్యక్తి కంపెనీలన్నిటిలోను కామన్‌గా డైరక్టరుగా వుండాలంటూ నిబంధనలు మార్చాడని, యిప్పుడది మారుస్తామని అంటున్నారు. టాటా సన్స్‌కు కొన్ని కంపెనీల్లో వాటా పెద్దగా వుంది. కొన్నిటిలో లేదు. వాటా పెద్దగా వున్న చోటల్లా సైరస్‌ను తీసేస్తున్నారు. అయితే ఇండియన్ హోటల్స్ కంపెనీ, టాటా కెమికల్స్ బోర్డు సైరస్‌కు వత్తాసుగా నిలబడడం, స్వతంత్ర డైరక్టర్లయిన దీపక్ పరేఖ్, నుస్లీ వాడియా, నాదిర్ గోద్రెజ్ వంటి ప్రముఖులు సైరస్‌ను సమర్థించడం చూసి రతన్ వర్గం సైరస్ వారిని తన వైపు తిప్పుకున్నాడంటూ ఆరోపించింది. ఆ పెద్దమనుషులను బజారు కీడ్చే చర్యలకు పాల్పడుతున్నారని సైరస్ వర్గం ధ్వజమెత్తింది. అసాధారణ జనరల్‌బాడీ మీటింగ్ పెట్టి సైరస్‌ను తీసేయాలని రతన్ వర్గం కంకణం కట్టుకుంది. 

అసలు మిస్త్రీని తెచ్చినదే మాజీ చైర్మన్ రతన్ టాటా! 2012 డిసెంబరు 29 నాటికి తనకు 75 ఏళ్లు పూర్తవుతాయి కాబట్టి తన స్థానంలో మరొకరు రావాలని రతన్ అన్నాడు. ఆ వారసుణ్ని వెతికే పనిని 5గురు సభ్యుల సెర్చ్ కమిటీకి అప్పగించాడు. వాళ్లు రెండేళ్ల పాటు అన్వేషించి అప్పటికి 44 ఏళ్ల సైరస్ మిస్త్రీని ఎంపిక చేశారు. అతను లండన్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసి లండన్ బిజినెస్ స్కూలులో ఎంబిఏ చేశాడు. 1991లో తండ్రి షాపుర్‌జీ స్థాపించిన షాపుర్‌జీ పల్లోంజీ గ్రూపులో తన కెరియర్ ప్రారంభించాడు. ఆ గ్రూపుకి టాటా సన్స్‌లో అందరి కంటె ఎక్కువగా 1.4% వాటా వుంది. ఆ గ్రూపు ప్రతినిథిగా 2006లో తన తండ్రి రిటైరైన దగ్గర్నుంచి సైరస్ టాటా సన్స్‌లో  డైరక్టరుగా వున్నాడు. సైరస్ సోదరి ఆలూ, రతన్ సవతి సోదరుడైన నోయల్ టాటా  భార్య. ఆ విధంగా రతన్‌తో బంధుత్వం కూడా వుంది. సైరస్ 2011 నవంబరులో రతన్ కింద డిప్యూటీ చైర్మన్‌గా పదవి చేపట్టి, ఆయన రిటైరయ్యాక 2012 డిసెంబరులో చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు తన శిష్యుడి మీదనే గురువు పగ బట్టి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు.

అసలు రతన్ టాటా స్వభావం ఎటువంటిది? టాటా గ్రూపుపై అతనికి అంత పట్టు ఎలా వచ్చింది? టాటా గ్రూపులోని కంపెనీలకు స్వతంత్ర ప్రతిపత్తి వున్నప్పటికి అవన్నీ హోల్డింగ్ కంపెనీ ఐన టాటా సన్స్ ఆదేశాలను గౌరవిస్తాయి. టాటా సన్స్‌లో 66% వాటా రెండు ట్రస్టులది. అవి సర్ దొరాబ్జీ టాటా ట్రస్టు, సర్ రతన్ టాటా ట్రస్టు. ఈ రెండు ట్రస్టులకు జీవితకాలపు చైర్మన్ రతన్ టాటాయే. ఆ విధంగా రతన్ టాటా సన్స్‌పై తన పట్టుపోకుండా చూసుకున్నాడు. గతంలో రతన్ టాటా సన్స్‌కు కూడా చైర్మన్‌గా వుండగా సెలక్షన్ కమిటీలో ట్రస్టు నామినేట్ చేసిన డైరక్టర్లిద్దరూ, బోర్డు డైరక్టర్లిద్దరూ, బోర్డు నియమించిన బయటి డైరక్టరు ఒకడు మొత్తం ఐదుగురు వుండేవారు. టాటా సన్స్‌కు ఎవరు చైర్మన్‌గా వుండాలి అనేది నిర్ణయించగల అధికారం యీ కమిటీకి వుంటుంది. తను పదవిలో దిగిపోవడానికి కొద్ది రోజులు ముందుగా 2012, డిసెంబరు 6న కమిటీ ఏర్పాటును మార్చేశాడు. ట్రస్టు డైరక్టర్ల సంఖ్య రెండు నుంచి మూడుకు పెంచి, బోర్డు డైరక్టర్ల సంఖ్యను రెండు నుంచి ఒకటికి తగ్గించాడు. ఆ విధంగా ట్రస్టు డైరక్టర్ల మాటే చెల్లేట్లు చూశాడు. ఆ ట్రస్టులు తన చేతిలో వుండేట్లు చూసుకున్నాడు. 

ఇలాటి విద్యలు రతన్‌కు కొత్త కాదు. 1991లో టాటా సన్స్‌కు తను కొత్తగా చైర్మన్ అయినప్పుడు అప్పట్లో దిగ్గజాలుగా వున్న రూసీ మోదీ, దర్బారీ సేఠ్, అజిత్ కేర్కర్, నానీ ఫల్కీవాలాలను తన దారికి అడ్డుగా భావించాడు. అంతే డైరక్టర్ల రిటైర్‌మెంట్ వయసును తగ్గించేసి వాళ్లను యింటికి పంపేశాడు. వాళ్లు వెళ్లిపోయాక మళ్లీ వయోపరిమితి పెంచేశాడు. ఇప్పుడు సైరస్‌తో పోట్లాట సందర్భంగా తనకు మద్దతుగా యూనియన్లను లాక్కుని వచ్చాడు. 16 వేల మంది ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుణె, జంషెడ్‌పుర్ యూనిట్లకు చెందిన రెండు ఉద్యోగసంఘాలు రతన్‌కే తమ మద్దతు అని ప్రకటించాయి. మేనేజ్‌మెంట్‌తో తమ సంబంధాలు మిస్త్రీ కారణంగా గత 14 నెలల్లో బాగా క్షీణించాయని యూనియన్ లీడర్లు ప్రకటించారు.

సైరస్ చేరిన ఒక ఏడాది వరకు రతన్‌తో సంబంధబాంధవ్యాలు బాగానే వుండేవి. సైరస్ వ్యవస్థలో ఏ మార్పుచేర్పులూ చేయకుండా తన విధానాలే కొనసాగించడంతో, ప్రతిదానికీ తనను సంప్రదించడంతో రతన్‌కు నచ్చాడు. ట్రస్టుల్లో తనకున్న పలుకుబడితో టాటా సన్స్‌లో సైరస్‌కు ఏ యిబ్బందీ రాకుండా చూసేవాడు. ఒక దశలో సైరస్‌కు ట్రస్టుల్లో కూడా స్థానమిద్దామా అని ఆలోచించాడట. అయితే క్రమేపీ సైరస్ కొత్తరకంగా ప్రయత్నిద్దామని చూశాడు. గ్రూపు కార్యకలాపాలు ఎలా సాగాలో స్ట్రాటజీ నిర్ణయించేందుకు జిఇసి (కౌన్సిల్) పేర ఒక సలహా మండలిని ఏర్పాటు చేసి తనకు మాత్రమే రిపోర్టు చేయాలన్నాడు. మధు కణ్ణన్, ముకుంద్ రాజన్, ఎన్‌ఎస్ రాజన్, నిర్మాల్య కుమార్, హరీష్ భట్‌లు దానిలో సభ్యులు. అందరూ 45-55 ఏళ్ల మధ్య వాళ్లు. అంతకుముందు రతన్ చైర్మన్‌గిరీలో రెండు సలహా మండళ్లు వుండేవి. గ్రూప్ కార్పోరేట్ కౌన్సిల్ అని ప్రణాళికలు రచించడానికి, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అని ప్రణాళికలను అమలు చేయడానికి వుండేవి. ఆ మండళ్లలో వుండేవాళ్లు 60,70ల వయసులో వుండేవారు. వాళ్లందరినీ ట్రస్టుల్లో కొనసాగిస్తూనే సలహా కమిటీలోంచి రిటైర్ చేయించాడు సైరస్. రతన్ వర్గం సైరస్‌ను దింపుతూనే యీ కౌన్సిల్‌ని రద్దు చేసేశారు. ఓ యిద్దర్ని తప్ప తక్కిన వారిని యింటికి పంపేశారు. 

జిఇసితో బాటు సైరస్ టాటా బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్ (టిబిఇఎమ్) అని ఏర్పరచాడు. వాళ్లు ఏడాది కోసారి గ్రూపు కంపెనీల నిర్మాణాన్ని, వ్యవహారశైలిని సమీక్షిస్తారు. ఇది  ఆ సమీక్షలు కంపెనీల సిఇఓలకు నచ్చేవి కావు. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, టాటా పవర్, టిసిఎస్ నడిపే సీనియర్ అధికారులు జిఇసితో, టిబిఇఎమ్‌తో విభేదిస్తూ, ‘మీదంతా థియరీ మాత్రమే. బిజినెస్ డైనమిక్స్ మీకు అర్థం కావు’ అని వాదించేవారు. సైరస్ హయాంలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండియన్ హోల్స్ యొక్క సిఇఓలు మారారు. టాటా స్టీల్ సిఇఓ రిటైర్ కాగా టాటా మోటార్స్ సిఇఓ చనిపోయాడు. ఇండియన్ హోటల్స్ సిఇఓ సైరస్‌తో విభేదించి రాజీనామా చేశాడు. అతను రతన్‌కు బాగా సన్నిహితుడు. సైరస్ నానో మూసేయడానికి ప్రయత్నించడం, టాటా స్టీల్ యుకె నష్టాలను తగ్గించడానికి చూడడం, ఇండియన్ హోటల్స్ ద్వారా భారీగా ఇండియాలో, విదేశాలో కొనుగోళ్లు చేయడం, టాటా పవర్‌లో వెల్‌స్పన్ ఎనర్జీ కొనడం – యివన్నీ రతన్‌కు కోపం తెప్పించాయి. 

సైరస్ 2012 డిసెంబరులో బాధ్యత చేపట్టాడు. 2011-12లో టాటా గ్రూపు టర్నోవర్ 101 బిలియన్ డాలర్లు.వుండగా 2015-16 నాటికి అది 103 బిలియన్ డాలర్లు అయింది. ఇది చాలా తక్కువ అంటుంది రతన్ గ్రూపు. మార్కెట్ కాపిటలైజేషన్‌ను రూ. 4.9 లక్షల కోట్ల నుంచి రూ. .5 లక్షల కోట్లు (125 బిలియన్ డాలర్లు) కు తెచ్చాడు అంటుంది సైరస్ గ్రూపు. రతన్ వర్గం ప్రకారం సైరస్ హయాంలో గ్రూపులోని 40 కంపెనీల్లో యిన్వెస్టర్లకు డివిడెండ్లు తగ్గిపోయాయి. టిసిఎస్‌ను పక్కన పెట్టి చూస్తే డివిడెండ్లు రూ.1000 కోట్ల నుండి రూ.70 కోట్లకు తగ్గాయి. వ్యయాలు మాత్రం రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెరిగిపోయాయి. నాలుగేళ్ల క్రితం రూ.సుమారు 70 వేల కోట్ల గ్రూపు ఋణం యిప్పుడు రూ.2.26 లక్షల కోట్లయింది. 

సాధారణంగా తరాల మధ్య అంతరం వుంటుంది. తండ్రి నుంచి కొడుక్కి కంపెనీ చేతులు మారినప్పుడు కూడా విధానాల్లో మార్పు వుంటుంది. కింద సంస్థల వారీగా యిస్తున్న సమాచారం గమనిస్తే రతన్ చాలా విషయాల్లో గొప్పలకు పోయి, దూకుడుగా వెళ్లాడని అర్థమవుతుంది. నష్టాలు వచ్చినా వాటిని మేన్‌టేన్ చేస్తూ పోయాడు. అయితే సైరస్ కొత్తతరం వాడు. నష్టాల్లో వున్నవాటిని సవ్యమైన బాట పట్టించాలని కొద్దికాలం చూడడం, అప్పటికీ బాగు పడకపోతే మూసేసి, నష్టాలు తగ్గించడం మంచిదని భావించి అమలు చేయసాగాడు. వీటి కారణంగా గతంలో రతన్ తీసుకున్న నిర్ణయాలు పొరపాటు అని రుజువౌతోంది. అది తన ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందని రతన్ బాధ.  

ఇప్పుడు ఒక్కో విభాగం గురించి కాస్తకాస్త సమాచారం – 
టాటా మోటార్స్ – రతన్ టాటా 200లో జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్)ను 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ చేత కొనిపించాడు. నష్టాల్లో వున్న కంపెనీ టర్న్ ఎరౌండ్ అయి లాభాలు ఆర్జించసాగింది. దేశీయంగా టాటా తెచ్చిన కార్లు ఫెయిలయ్యాయి. అయినా జాగ్వార్ లాభాలతో నష్టాలు కొంత పూడుస్తోంది. కానీ జాగ్వార్‌కు అతి పెద్ద మార్కెట్ ఐన చైనాలో ఆటోమొబైల్స్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అందువలన యీ లాభాలు ఎంతకాలం వుంటాయో తెలియదు. టాటా మోటార్స్ ద్వారా ఏటా రెండు కార్లు తీసుకుని వస్తానని సైరస్ హామీ యిచ్చి తప్పాడని రతన్ గ్రూపు ఆరోపణ. ఇప్పటికే విడుదల చేసిన టియాగో (జికా పేరు మారింది), బోల్టులు కూడా నిరాశ పర్చాయి. బ్రెగ్జిట్ కారణంగా జాగ్వార్ పైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. నానో గుదిబండగా మారిందని సైరస్ అంటాడు. టర్న్ ఎరౌండ్ చేయడం చేతకాలేదని రతన్ వర్గం అంటోంది. మూడేళ్లల్లో కార్ల దేశీ మార్కెట్‌లో వాటా 13% నుంచి 5%కి, వాణ్యివాహనాల మార్కెట్‌లో 60% నుంచి 40%కి పడిపోయింది. నానో విషయంలో ఆ మోడల్ ఫెయిలై వెయ్యి కోట్ల నష్టం వచ్చిందంటాడు సైరస్. ‘దాన్ని మూసేద్దామంటే రతన్ ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకు వాటా వున్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి నానో గ్లయిడర్లను సప్లయి చేస్తోంది. నానో మూసేస్తే ఆ కంపెనీకి కష్టం’ అన్నాడు. అతని ఆరోపణలకు రతన్ వర్గం సమాధానం చెప్పలేదు. 

టాటా పవర్ – రతన్ హయాంలో 2006లో ముంద్రా అల్ట్రా పవర్ ప్రాజెక్టును అధిక ధరకు బిడ్ చేసిందని, దీనివలన భారీ మొత్తంలో పెట్టుబడులను రైట్ డౌన్ చేయాల్సి వస్తోందంటూ సైరస్ ఆరోపణ. ఈ ఏడాది సైరస్ వెల్‌స్పన్ రెన్యూవబుల్ ఎనర్జీని రూ.9300 కోట్లకు కొన్నాడు. ఆ విషయం మాకు చెప్పలేదు అంటుంది రతన్ వర్గం. ‘చెప్పకపోవడమేం, ఏడాది మొదట్లోనే టాటా సన్స్ మీటింగులో ఒక ప్రజంటేషన్ యిచ్చాం. మే 31 న రతన్ టాటాకు, టాటా సన్స్ బోర్డుకు నోట్ పంపడం జరగడం జరిగింది. ఇది అయ్యాక జూన్ 12 న అగ్రిమెంటుపై సంతకాలు జరిగాయి. తర్వాత రతన్, ఎన్ ఎ సూనావాలా అనే ట్రస్ట్టీ సమక్షంలో అనేక చర్చలు జరిగాయి.’ అంటోంది సైరస్ వర్గం.

టాటా హోటల్స్ – సీ రాక్ హోటల్‌ను అనవసరంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేశారంటాడు సైరస్. న్యూయార్క్‌లోని పియరీ హోటల్ లీజు కూడా ఎంత క్లిష్టంగా వుందంటే, దానిలోంచి బయటపడడమూ కష్టమట.

టెట్లీ – టెట్లీ అనేది ఇంగ్లండు, కెనడాలలో టీ వ్యాపారం చేసే బ్రిటిష్ కంపెనీ. రతన్ 2000 సం॥ బ్రిటిష్ కంపెనీ టెట్లీ ని 45 కోట్ల డాలర్లకు కొన్నాడు. ఆసియాలో దాని వ్యాపారాన్ని టాటా టీతో కలిపేశారు. ప్రపంచస్థాయిలో యూనిలివర్ తర్వాత అతి పెద్ద కంపెనీగా చేసి 2006లో దాన్ని టాటా గ్లోబల్ బెవరేజెస్‌గా పేరు పెట్టారు. దానికి ఇండియా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి కానీ యూరోప్, ఉత్తర అమెరికాలలో వచ్చే లాభాలతో పూడ్చుకున్నారు. ఇండియాలో కనీస వేతనాలైనా చెల్లించని టీ ఎస్టేట్ల నుండి టాటా కంపెనీ టీ ఆకులు కొంటోందని 2014లో ఆరోపణలు వచ్చాయి. దానిపై విచారణ జరిపిస్తామని టాటా గ్రూపు అంది. తర్వాత అలాటి ఎస్టేట్లలో కొన్నదాన్ని ఇండియాలోనే అమ్ముతున్నామని, ఎగుమతి చేసే సరుకులో యిలాటి తిరకాసులు లేవని అంది.

టాటా ఏవియేషన్ – టాటా గ్రూపులో ఏవియేషన్స్ విభాగంలో కూడా చాలా అవకతవకలు జరిగాయని కూడా చెప్పుకొచ్చాడు. ఏవియేషన్ సెక్టార్ క్లిష్టకాలంలో వున్నపుడే టాటా ఎయిర్ ఏసియా బెర్‌హాద్, అరుణ్ భాటియాలతో కలిసి పెట్టిన జాయింటు వెంచర్ – ఎయిర్ ఏసియా ఇండియా. ఇదీ, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన విస్తారా అనే జాయింటు వెంచర్ రెండూ ఫెయిలయ్యాయి. ఎయిర్ ఏసియా ఇండియా నష్టాలు రూ.20 కోట్లు కాగా, విస్తారా నష్టాలు రూ. 400 కోట్లు. ఎయిర్ ఏసియా ఇండియా ఏర్పరచడానికి దేశంలో ఊరు పేరు లేని కొందరికి రూ. 22 కోట్లు చెల్లించారని సైరస్ ఆరోపించాడు. ఈ విమానరంగంలో రావడం రతన్ ఒత్తిడి వల్లనే జరిగిందని సైరస్ ఆరోపణ. ఈ జాయింటు వెంచర్ ఏర్పాటు ఒప్పంద సమయంలో ఎయిర్ ఏసియా తన బ్రాండ్ ఈక్విటీ ఎగ్రిమెంట్ వివరాలను వెల్లడించకపోవడం ఎఫ్‌డిఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానానికి వ్యతిరేకమని,  ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఆరోపించింది. వారికి యిచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ 2014 ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టుకి వెళ్లింది. హైకోర్టు 17 సార్లు వాయిదాలు వేస్తూ ఆలస్యం చేయడంతో ఆ సంగతి చూడమంటూ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. 

టాటా స్టీల్ – కోరస్ – రతన్ టాటా 2007లో టాటా స్టీల్ ద్వారా 1310 కోట్ల డాలర్లు వెచ్చించి ఆంగ్లో డచ్ కంపెనీ ఐన కోరస్ కంపెనీని కొని టాటా స్టీల్ యుకెగా పేరు మార్చాడు. అది ప్రపంచంలో కల్లా పెద్ద స్టీలు కంపెనీ అయింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టీలు ధర పడిపోవడంతో అది నష్టాల్లో మునిగిపోయింది. సైరస్ చెప్పేదాని ప్రకారం 10 బిలియన్ డాలర్ల నష్టం వుంది. సైరస్ దాని ఆస్తులను రైట్ ఆఫ్ చేసి అమ్మేయడం, రతన్‌కు నచ్చలేదు. ‘టర్న్ ఎరౌండ్ చేసి వుండాల్సింది. సైరస్ అమ్మేసిన ఆస్తులు కొన్న కంపెనీ ఏడాదిలోనే టర్న్ ఎరౌండ్ చేసింది’ అంటాడు. 2016 తొలి క్వార్టర్‌లో టాటా స్టీల్‌కు రూ. 3 వేల కోట్ల భారీ నష్టం వచ్చింది. దానికి కారణం యుకె విభాగమే. టాటా స్టీలులో డైరక్టరైన నుస్లీ వాడియా సైరస్ పక్షాన నిలవగా అతనితో తక్కిన స్వతంత్ర డైరక్టర్లు కలిసి రాలేదు.

టాటా-డొకొమో వివాదం – జపాన్‌కు చెందిన ఎన్‌టిటి డొకొమో కంపెనీ 2009 నవంబరులో టాటా టెలీ సర్వీసెస్ ఒక షేరుకు రూ.117 చొప్పున రూ.12700 కోట్లు యిచ్చి ఈక్విటీలో 26.5% వాటాను తీసుకుంది. వ్యాపారం సరిగ్గా సాగక ఐదేళ్ల లోపు విత్‌డ్రా అయ్యేటట్టయితే షేరుకి న్యాయమైన ధర యిచ్చి తిరిగి తీసుకుంటానని (బై బ్యాక్) టాటా ఒప్పుకుంది. కనీసం రూ. 5 (కొన్నదానిలో 50%) యిచ్చి తీసుకుంటానంది.  ఈ ఒప్పందం రతన్ హయాంలో జరిగింది. నిజానికి రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల విషయంలో బై బ్యాక్‌కు ముందే ఒక ధరను నిర్ణయించరాదు. ఎవరైనా రిజిస్టర్డ్ మర్చంట్ బ్యాంకర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆధారంగా ఏది సవ్యమైన ధరో నిర్ణయించాక, దాన్ని మాత్రమే చెల్లించాలి. ఈ విషయాన్ని రెండు కంపెనీలు ఎలా విస్మరించాయో తెలియదు. జాయింటు వెంచర్ అనుకున్న విధంగా విజయవంతం కాకపోవడంతో, ఐదేళ్లు పూర్తవడానికి ఆర్నెల్ల ముందే 2014 ఏప్రిల్‌లో ‘నేను తప్పుకుంటాను, 5 రూ.ల రేటు చొప్పున రూ.6350 కోట్లు డబ్బు వాపసు యిచ్చేయండి’ అంది డొకొమో. అప్పటికి సైరస్ చైర్మన్‌గా వచ్చాడు. ‘రిజర్వ్ బ్యాంకు నిబంధన ప్రకారం షేరుకు రూ. 23.34 కంటె చెల్లించడానికి వీల్లేదు. కాబట్టి మేం యింతకంటె యివ్వలేం’ అన్నాడు.  వ్యవహారాన్ని డొకొమో బ్రిటన్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుకి లాగింది. మాట తప్పినందుకు గాను రూ.739 కోట్లు నష్టపరిహారం యివ్వాలని ఆ కోర్టు 2016 జూన్‌లో టాటాను ఆదేశించింది. 

ఆ తీర్పు కాపీని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసింది డొకొమో. దాంతో బాటు లండన్ కమ్మర్షియల్ కోర్టులో తీర్పు అమలుకై అప్పీలు చేస్తూ, యుకెలోని టాటా షేర్లున్న జాగ్వార్, టాటా స్టీల్ ఆస్తులను ఎటాచ్ చేయాలని కోరింది. ఈ లోగా టాటా సన్స్ రూ.739 కోట్లను ఢిల్లీ హైకోర్టులో ధరావత్తుగా పెట్టింది. డొకొమోకు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఆర్‌బిఐ అనుమతి కోరింది. కానీ ఆర్‌బిఐ అనుమతి యివ్వలేదు. ‘ఇవ్వందే మేమెలా డబ్బు చెల్లించగలం, భారతీయ చట్టానే గౌరవించి యిక్కడి రూల్సు ప్రకారమే చెల్లింపులు చేస్తామ’ని సైరస్ స్పష్టం చేశాడు. ఆర్‌బిఐని రిక్వెస్ట్ చేయడానికి తమతో కలిసి రమ్మనమని డొకొమోను కోరాడు. అయితే డొకొమోకు ఆర్‌బిఐ ఏం చెపుతుందో తెలుసు. టాటా వాళ్లు యిచ్చిన డబ్బును తమ దేశానికి తీసుకోపోమని, యిక్కడే పెట్టుబడిగా పెడతామని (నాన్-రిపాట్రియేషన్) జపాన్ కంపెనీ హామీ యిస్తే సమస్య తీరిపోతుంది. 

కానీ రిజర్వ్ బ్యాంకు పెట్టిన యీ రూలు మార్చాలని పాన్ కంపెనీ పట్టుబడుతోంది. మార్చకపోతే ఇండియాలో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలు వెనుకాడతాయని సంకేతాలు పంపుతోంది. కానీ ఆర్‌బిఐ యిప్పటివరకు బెసకలేదు. అందువలన డొకొమో అంతర్జాతీయ కోర్టుల్లోనే పోరాడుతోంది. ఈ వ్యవహారంలో సైరస్ సరిగ్గా వ్యవహరించటం లేదని ఆరోపిస్తున్న రతన్ తనైతే ఎలా చేస్తాడో చెప్పటం లేదు. ఆలోచిస్తే సైరస్ మాత్రం చేయగలిగేదేముంది? ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు రతనే సరిగ్గా చూసుకుని వుండాల్సింది. సగం రేటు వాపసు యిస్తామని రాసిచ్చి వుండకూడదు. డొకొమో వివాదాన్ని పక్కన పెడితే టాటా టెలిసర్వీసెస్ నిర్వహణ కూడా నష్టాలు తెస్తోందని దాన్ని మూసేసినా లేక ఎవరికైనా అమ్మేయాలని చూసినా 400-500 కోట్ల డాలర్ల నష్టమంటాడు సైరస్.

ఈ వ్యాసం అసమగ్రమే. పొరపాట్లూ వుండవచ్చు. కానీ టాటా వివాదం గురించి బొత్తిగా తెలియనివారికి కొద్దిపాటి అవగాహన కలిగిస్తుంది. ఇకపై టాటా గ్రూపు వార్తలు చదివేటప్పుడు, వారి ఆరోపణ-ప్రత్యారోపణల గురించి విన్నప్పుడు, కథ ఎన్ని మలుపులు తిరుగుతోందో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. టాటా గ్రూపు అనేది లాభనష్టాల లెక్కలు వేసే సంస్థ కాదని, దానికో ఫిలాసఫీ వుందని, సైరస్‌కు ఆ ఫిలాసఫీ వంటబట్టలేదని రతన్ మాటిమాటికి ఎత్తిపొడుస్తున్నాడు. అప్పు చేసి పప్పుకూడు తినడం, నష్టాలు వచ్చినా గొప్పలకు పోయి కంపెనీ నడపడం టాటా ఫిలాసఫీయా అనేది రతనే చెప్పాలి. ఏ కంపెనీ యాజమాన్యమైనా షేర్ హోల్డర్లకు జవాబుదారీ. పెట్టుబడి పెట్టినవాడు డివిడెండ్లు ఆశిస్తాడు. వీటన్నిటిలో 41 లక్షల మంది ప్రల కష్టార్జితం వుంది. తన భేషజం కోసం ప్రజలు నష్టపోవాలనుకోవడం, అదేమంటే టాటా గ్రూపు సిద్ధాంతం, ఆదర్శం వంటి కబుర్లు చెప్పడం రతన్‌కే చెల్లింది. నీరా రాడియా టేపులు విన్నపుడే రతన్ టాటా ఎంత ‘మేలి’ రత్నమో తెలిసిపోయింది. ఇప్పుడు రతన్ సైరస్‌పై పగబట్టి అతన్ని ఒక్కో కంపెనీ నుంచి తొలగించడానికి కుట్రలు పన్నుతున్నాడు. మరొకరైతే రతన్ తడాఖాకు పారిపోయేవారు. కానీ సైరస్ నిలబడ్డాడు. నిలబడి పోరాడుతున్నాడు. అంతిమంగా తనకున్న పలుకుబడితో, మూకబలంతో రతనే జయించవచ్చు. కానీ సైరస్ సంధిస్తున్న అనేక ప్రశ్నలకు రతన్ వద్ద సమాధానాలు లేవు. ఈ పోరాటం చాలా కాలమే సాగేట్లుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2016)