సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోసారి వార్తలకెక్కారు. వామపక్ష పార్టీల నాయకుల్లో నారాయణది ప్రత్యేక శైలి. కమ్యూనిస్టు సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఎజెండాతో ఆయన ముందుకెళుతుంటారనే విమర్శలు లేకపోలేదు.
తన నోటి దురుసుతో అనేక మార్లు పార్టీ మీటింగుల్లో చీవాట్లు తిన్న ఘనత కూడా ఆయన సొంతం. తాజాగా కమ్యూనిస్టు శ్రేణులు జీర్ణించుకోలేని పనికి నారాయణ పాల్పడ్డారు.
విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందస్వామిని రాజకీయ నాయకులు కలిసి ఆశీస్సులు పొందడం సర్వసాధారణంగా జరిగే విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ వేళ స్వరూపానందస్వామిని ఓ వ్యక్తి కలవడం చర్చనీయాంశమైంది.
గుడులు, గోపరాలు, దేవుళ్లు, స్వాములను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుంటారు. అలాంటిది సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ బుధవారం శారద పీఠాధిపతిని కలవడం సహజంగానే ప్రత్యేక అంశంగా చెప్పుకోవాలి.
కమ్యూనిస్టు సిద్ధాంతానికి వ్యతిరేకంగా , నమ్మకం, విశ్వాసం లేని వాటి చెంతకు వెళ్లడం విమర్శలకు దారి తీసింది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన వైజాగ్ వెళ్లారు. 97వ వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన నేరుగా స్వరూపానందస్వామి దగ్గరికి వెళ్లారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
“స్వామి మిమ్మల్ని కలిసి ఆశీస్సులు తీసుకుంటే ఎన్నికల్లో గెలుస్తారట కదా! ఈ ఎన్నికల్లో మా అభ్యర్థిని కూడా గెలిపించండి” అని నారాయణ కోరారని సమాచారం. నారాయణ మాటలకు స్వామి గట్టిగా నవ్వినట్టు తెలిసింది.
శారద పీఠాధిపతి నవ్వుతో నారాయణ కూడా శృతి కలిపినట్టు సమాచారం. విశాఖ శారద పీఠాధిపతిని కలిసి ఆశీస్సులు తీసుకోవడంపై వామపక్ష శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో కూడా నారాయణ తిరుమల సందర్శించి విమర్శల పాలయ్యారు.
ప్రజలను మూఢ విశ్వాసాలకు దూరం చేయాల్సిన కమ్యూనిస్టు నేతలే, చివరికి స్వామీజీల దగ్గరికెళ్లి ఆశీస్సులు పొందుతుంటే ఇక చెప్పేదేముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.