పురందేశ్వ‌రి…మీరే పార్టీ అధ్య‌క్షురాలు?

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తాను టీడీపీ మ‌నిషిన‌ని నిరూపించుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే విమ‌ర్శ వుంది. అందుకే అధ్య‌క్షురాలిగా బాధ్య‌త తీసుకున్న మ‌రుక్ష‌ణం నుంచి వైసీపీ ప్ర‌భుత్వంపై ఆమె ఘాటు…

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తాను టీడీపీ మ‌నిషిన‌ని నిరూపించుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే విమ‌ర్శ వుంది. అందుకే అధ్య‌క్షురాలిగా బాధ్య‌త తీసుకున్న మ‌రుక్ష‌ణం నుంచి వైసీపీ ప్ర‌భుత్వంపై ఆమె ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో సోము వీర్రాజు టీడీపీ, వైసీపీల‌ను స‌మానంగా చూసేవారు. ఆ రెండు పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీల‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించే వారు.

సోము వీర్రాజును మార్చిన త‌ర్వాత‌, ఏపీ బీజేపీ విధానాలు కూడా మారిపోయాయి. పురందేశ్వ‌రి వ్య‌క్తిగ‌త ఎజెండానే పార్టీ ఎజెండాగా మారిపోయింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో పురందేశ్వ‌రి మంత్రి ఆర్కే రోజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రోజా మీడియాతో మాట్లాడుతూ పురందేశ్వ‌రి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలా? టీడీపీ అధ్య‌క్షురాలా? అని ప్ర‌శ్నించారు. ఇంత‌కూ ఏ పార్టీ అధ్య‌క్షురాల‌ని సందేహంతో ప్ర‌శ్నించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంద‌న్నారు.

టీడీపీ వాయిస్‌ను పురందేశ్వ‌రి వినిపిస్తున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో, అవే మాట‌ల్ని పురందేశ్వ‌రి పున‌రావృతం చేస్తున్నార‌ని దెప్పి పొడిచారు. ఇప్పుడు ప‌డుతున్న క‌ష్టం త‌న తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని తీసుకుని శ్ర‌మిస్తే ఉప‌యోగం వుంటుంద‌ని పురందేశ్వ‌రికి రోజా హిత‌వు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింద‌ని పురందేశ్వ‌రి విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. మ‌రోవైపు కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే ఏపీ అప్పు త‌క్కువ అని చెప్పార‌ని రోజా గుర్తు చేశారు.

ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబుపై కెవ్వు కేక అనేలా పంచ్ విసిరారు. నధుల అనుసంధానం గురించి ఇప్పుడు ఉప‌న్యాసాలు ఇస్తున్న చంద్ర‌బాబునాయుడు, తాను సీఎంగా ఉన్న 14 ఏళ్ల కాలంలో ఏం చేశార‌ని రోజా నిల‌దీశారు. అప్పుడు న‌దుల అనుసంధానం కంటే నిధుల అనుసంధానం చేయ‌డంలో త‌ల‌మున‌క‌లై ఉన్నార‌ని రోజా త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబుపై సెటైర్ విసిరారు.