ఇంగ్లండ్.. ఆడలేక, మద్దెల ఓటు..!

అందని ద్రాక్ష పుల్లన.. ఆడలేక మద్దెల ఓటన్నట్టుగా.. ఉంది ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ తీరు. వరసగా మూడో టెస్టులో ఓటమిపాలై, టెస్టు సీరిస్ ను కోల్పోయిన ఇంగ్లండ్ అప్పుడే పిచ్ మీద నిందలేస్తోంది. భారత్…

అందని ద్రాక్ష పుల్లన.. ఆడలేక మద్దెల ఓటన్నట్టుగా.. ఉంది ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ తీరు. వరసగా మూడో టెస్టులో ఓటమిపాలై, టెస్టు సీరిస్ ను కోల్పోయిన ఇంగ్లండ్ అప్పుడే పిచ్ మీద నిందలేస్తోంది. భారత్ విజయాలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోంది. ముంబై టెస్టు అనంతరం ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ అండర్సన్ మాట్లాడుతూ.. భారత్ విజయాలకు కారణం స్లో పిచ్ లే అంటూ పేలాడు.

అనుకూలమైన పిచ్ లు తయారు చేసుకుని ఇండియా విజయం సాధిస్తోందన్నట్టుగా మాట్లాడాడు. తమ ఓటమిని ఒప్పుకునే హుందాతనం లేక బ్రిటీషర్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పాలి. ఆడటం చేతగాక మద్దెల ఓటుగా ఉందని వ్యాఖ్యానించినట్టుగా, పిచ్ లను సాకుగా చూపుతున్నారు.

ఉపఖండం పిచ్ లు బ్రిటీషర్లకు వణుకు పుట్టిస్తుండవచ్చు.. అంతమాత్రాన ఇవి భారత్ కు అనుకూలంగా తయారు చేసినవి అంటే ఎలా? పిచ్ ల మీద ఏమైనా రాస్తారా ఇండియా గెలవాలి అని? మరి ఇప్పుడు ఇండియా గెలుపుకు పిచ్ లు కారణం అంటున్నారు కదా.. క్రితం సారి టెస్టు సీరిస్ ఆడటానికి వచ్చినప్పుడు ఇంగ్లండ్ కూడా గెలిచింది కదా.. అప్పుడు ప్రతిభ పరంగా కాకుండా… పిచ్ ల సహకారంతో గెలిచిందా?

ఇక ఇండియా పిచ్ లు స్లోనే కావొచ్చు.. ఇరు జట్లూ అదే పిచ్ మీద కదా బ్యాటింగ్ చేసేది! ఇంగ్లండ్ కూడా తమ బలగంలో స్పిన్నర్లను కలిగి ఉంది కదా! మరి వాళ్లెందుకు పిచ్ నుంచి ఉండే సహకారాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు? అంత వరకూ ఎందుకు.. ఇండియా లో పిచ్ ఇండియాకు అనుకూలంగా తయారు చేసుకొంటారు అంటున్న ఈ బ్రిటీషర్లు తమ దేశంలో మ్యాచ్ లు జరిగినప్పుడు ఏం చేస్తున్నారు? పాస్ట్ పిచ్ లను తయారు చేసుకుని.. ఆతిథ్య జట్లను ఆటాడిస్తున్నారు కదా! 

చేతకాలేదు.. ఓటమిని హుందాగా ఒప్పుకుంటే క్రికెట్ కు ఉన్న జెంటిల్మన్ గేమ్ ఇమేజ్ ను కూడా కాపాడిన వారు అవుతారు. అలాగాక.. పిచ్, విరాట్ కొహ్లీ గొప్ప బ్యాట్స్ మన్ కాదు.. అని మాట్లాడటం ద్వారా తమ విషసంస్కృతిని ప్రదర్శించినట్టవుతుంది. వరస ఓటములతో నిస్పృహతో ఉన్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా విషం కక్కి నవ్వుల పాలు అవుతున్నట్టున్నారు.