మ‌ర‌ద‌ల్ని నారాయ‌ణ వేధిస్తే… ప్ర‌భుత్వ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం!

మాజీ మంత్రి నారాయ‌ణ త‌మ్ముడు మ‌ణి భార్య ప్రియ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న బావ‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయ‌, విద్యా ప్ర‌ముఖుడైన నారాయ‌ణ‌పై మ‌ర‌దలి ఆరోప‌ణ‌లు దుమారం రేపుతున్నాయి. టీడీపీ నాయ‌కుడు, మాజీ…

మాజీ మంత్రి నారాయ‌ణ త‌మ్ముడు మ‌ణి భార్య ప్రియ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న బావ‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయ‌, విద్యా ప్ర‌ముఖుడైన నారాయ‌ణ‌పై మ‌ర‌దలి ఆరోప‌ణ‌లు దుమారం రేపుతున్నాయి. టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అయిన నారాయ‌ణ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి అత్యంత స‌న్నిహితుడు. గ‌త కేబినెట్‌లో మున్సిప‌ల్ శాఖ మంత్రిగా నారాయ‌ణ ఓ వెలుగు వెలిగారు.

అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేయ‌డంలో నారాయ‌ణ పాత్ర కీల‌క‌మైంది. నెల్లూరు సిటీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన నారాయ‌ణ ఓడిపోయారు. ఆ త‌ర్వాత నాలుగేళ్ల పాటు నోరు తెర‌వ‌ని నారాయ‌ణ‌… ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. ఈ ద‌ఫా నెల్లూరు సిటీ నుంచి మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. నారాయ‌ణ‌పై తాజాగా ఆయ‌న మ‌ర‌ద‌లి ఆరోప‌ణ‌ల్ని వైసీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా ఇదే ప‌ని చేస్తారు.

అయితే చేతిలో అధికారాన్ని పెట్టుకుని కేవ‌లం ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితం కావ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. నారాయ‌ణ త‌మ్ముడు మ‌ణి భార్య ప్రియ ఆరోప‌ణ‌ల్ని సుమోటోగా తీసుకుని కేసు ఎందుకు న‌మోదు చేయ‌లేద‌నే నిల‌దీత‌లు ఎదుర‌వుతున్నాయి.

నారాయ‌ణ నిత్యం త‌న‌ను న‌ర‌క‌యాత‌న పెడుతూ తీవ్రంగా వేధించేవాడ‌ని ఆమె వాపోయారు. మ‌రీ ముఖ్యంగా ఆమె చేసిన ఆరోప‌ణ‌ల్లో …”గ‌ద్ద లాంటి నారాయ‌ణ చేతికి అభంశుభం తెలియ‌ని పిట్ట‌లాంటి నేను దొరికి విల‌విల‌లాడుతున్నాను. ఇంటి పైపోర్ష‌న్‌లో ఉంటూ అధికారికంగా, అన‌ధికారికంగా అప్ప‌టికే ఇద్ద‌రు భార్య‌ల‌తో సంసారం చేస్తున్న నారాయ‌ణ‌… నా భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యంలో కింద పోర్ష‌న్‌లో వుంటున్న నాతో అత్యంత నీచంగా, అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించేవాడు”

నారాయ‌ణ‌పై ఈ స‌మ‌యంలో రాజ‌కీయ ఆరోప‌ణ‌లు కాదు, చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా వైసీపీ స‌ర్కార్ మ‌హిళ‌ల‌కు అండ‌గా వుంటుంద‌నే సంకేతాలు పంపించిన‌ట్టు అవుతుంది. అలా కాకుండా విజ‌య‌సాయిరెడ్డి లాంటి వాళ్లు ట్విట‌ర్ వేదిక‌గా కేవ‌లం విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం కావ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేదు. విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ ఏంటో చూద్దాం.

“వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు…నారాయణ! నారాయణ! నారాయణ!”

గ‌ద్ద‌లు, డేగ‌ల్లా అమాయ‌క అబ‌ల‌ల‌పై క‌న్నేసి ఖ‌తం చేస్తుంటే, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు క‌దా తీసుకోవాల్సింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. నారాయ‌ణ‌పై మాట‌లు క‌ట్టిపెట్టి చేత‌ల‌కు ప‌ని చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఆ ప‌ని చేయ‌గ‌లిగితే ఎవ‌రికైనా ఒక హెచ్చ‌రిక‌లా వుంటుంది. లేదంటే రాజ‌కీయం కోస‌మ‌నే ఇదంతా చేస్తున్నార‌నే అభిప్రాయం క‌లుగుతుంది.