సాధారణంగా ఏ కాయిన్ కయినా రెండు ముఖాలు వుంటాయి. రాజకీయ నాయకులైనా, రౌడీలైనా కూడా అంతే. వీధిలో కరుకుగా వుండే రౌడీ కూడా ప్రేమిస్తాడు. రాజకీయ నాయకులు తమ తమ ఇళ్లలో వేరే అభిరుచి కలిగి వుండొచ్చు. కానీ జనానికి ఒక వైపే కనిపిస్తుంది. అందుకే రాజకీయ నాయకులు, రౌడీల కథలు తెరకెక్కించాలనుకున్నపుడల్లా సమస్యే. అది మణిరత్నం అయినా కావచ్చు, రామ్ గోపాల్ వర్మ అయినా కావచ్చు. అందుకే సాధారణంగా ఎవరి సినిమా తీయాలనుకున్నా, దాదాపు వారికి అనుకూలంగానే వుంటుంది తప్ప, ప్రతికూలంగా వుండదు.
ఎందుకంటే లేని పోని తకరారులు, సమస్యలు సినిమాకు అడ్డం పడతాయి. మణిరత్నం ఎంజీఆర్ పై సినిమా తీయాలనుకున్నపుడు జయలలిత, కరుణానిధిని ఇధ్దరిని ఒప్పించేందుకు కిందా మీదా అయ్యారు. వారి అభీష్టాల మేరకు స్క్రిప్ట్ కు కూడికలు తీసివేతలు చేయాల్సి వచ్చింది. అలాగే ముంబాయి స్మగ్లర్ కథను బేస్ చేసుకుని నాయకుడు తీసినపుడు కూడా పాజిటివ్ ధోరణిలోనే తీయాల్సి వచ్చింది. ఇలా చాలా ఉదాహరణలు వున్నాయి. కానీ రామ్ గోపాల్ వర్మ ఆ టైపు కాదు. అలా రాజీ పడే రకమూ కాదు. అందుకే ఈ సినిమా ఎలా వుంటుంది? ఎటు మొగ్గుతుంది? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతానికి వస్తే, రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమా తీస్తున్నారు. వంగవీటి రంగాపై సినిమా అన్నది చిన్న విషయం కాదు. కత్తిమీద సాము. ఎందుకుంటే రంగాకు ఆయన కులంలో వున్న ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. రంగా మరణానంతరం కోస్తా జిల్లాల్లో చెలరేగిన అలజడి కూడా అంతే. అలాంటి నాయకుడిపై సినిమాకు రంగంలోకి దిగారు రామ్ గోపాల్ వర్మ. రంగా హత్య చేయబడ్డాడు.
సహజంగానే ఈ హత్య కు, రంగాను వ్యతిరేకేంచే కమ్మసామాజిక వర్గం వైపే అనుమానాలు మళ్లుతాయి. అందుకే అప్పట్లో రంగా మరణించిన తరువాత జరిగిన విధ్వంసకాండలో కమ్మవారి ఆస్తులు టార్గెట్ అయ్యాయి. వాటిల్లో విజయవాడ ఈనాడు కార్యాలయం కూడా వుంది. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాన్ని సినిమాకు తీసుకోవడం అన్నది నిజంగా రామ్ గోపాల్ వర్మ ధైర్యాన్ని సూచిస్తుంది.
కథ ఎటు మొగ్గుతుంది
వంగవీటి రంగా కథ అనే కన్నా, విజయవాడలో కమ్మ-కాపు వర్గపోరాట చరిత్రగానే చెప్పుకోవాలి. ఈ చరిత్రలో ఈ వర్గానిదీ పైచేయి వుంది..ఆ వర్గానిది పైచేయి వుంది. ఎవరి టైమ్ వారిది. రాయలసీమలో ఫ్యాక్షనిజం మాదిరిగా విజయవాడ రౌడీ ఇజం. పేర్లు ఏవైనా రెండు వర్గాల మధ్య పోరాటాలే. అనంతపురం ప్రాంతంలో నాయుళ్లకు అండగా వున్న పరిటాల రవి వారికి నాయకుడైతే, విజయవాడలో కాపులకు అండగా వున్న రంగా వారికి నాయకుడు. ఇద్దరూ ప్రత్యర్థుల కుట్రలకు బలైనవారే. ఇద్దరిని రాజకీయ పార్టీలు చేరదీసాయి. నాయకులను, ప్రజా ప్రతినిధులుగా మార్చాయి.
మరి వంగవీటి కథను లైన్ ఆర్డర్ గా రాసుకుంటే, రాధా వ్యవహారం. అతగాడు హత్యగావించబడిన వైనం, దాంతో రంగా తెరమీదకు వచ్చిన తీరు, నాయకుడిగా ఎదిగిన వ్యవహారం, ప్రత్యర్థులకు మింగుడుపడని పరిస్థితి. చివరకు రంగా హత్య. నిజానికి గాయం సినిమాలో కొంత వరకు ఈ విజయవాడ వ్యవహారాలను వర్మ టచ్ చేసాడు. అయితే ఇప్పుడు కథను యథావిథిగా నెరేట్ చేయాల్సి వుంది. పక్కదారి పట్టించడానికి వీలు లేదు. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి జరిగినది ఏమిటన్నది విజయవాడ వాసులు అందరికీ తెలిసిందే. రెండవది పక్కదారి పట్టిస్తే వచ్చే పరిణామాలు.
మరెందుకు వద్దంటున్నారు
రంగాపై సినిమా అంతే అతగాడిదే హీరో పాత్ర. వంగవీటి టైటిల్ అంటేనే అది. మరి వంగవీటిని హీరో చేస్తూ, అతడి కథను హైలైట్ చేస్తూ సినిమా తీస్తామంటే ఆయన భార్య, కొడుకు ఎందుకు వద్దంటున్నారు. అభ్యంతరం చెబుతున్నారు. వర్మ భాషలో చెప్పాలంటే వార్నింగ్ ఇస్తున్నారు? అంటే స్క్రిప్ట్ వినకుండా అయితే అభ్యంతరాలు చెప్పి వుండరు కదా? లేదా వర్మ స్క్రిప్ట్ చెప్పడానికి నిరాకరిస్తే, వారు అలా అనుకుంటున్నారా?
పైగా విజయవాడ కమ్మ వర్గం తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మంచి సంబంధాలున్నాయి. ఒకరిద్దరు ఆయనతో సినిమాలు కూడా చేసారు. ఇప్పుడు విజయవాడ కమ్మవర్గం ఈ సినిమాకు అనుకూలంగా వున్నట్లే కనిపిస్తోంది. కొడాలి నాని, దేవినేని తదితరులు వర్మకు పక్కనే వుంటున్నారు. మరి అలా ఆ వర్గాన్ని పక్కన పెట్టుకుని వర్మ ఏ విధంగా వారికి వ్యతిరేకంగా సినిమా తీస్తారు?
నిర్మాత సంగతేమిటి?
వంగవీటి సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పక్కా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. పైగా గతంలో విజయవాడ ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి నిర్మించే సినిమా కాపులకు, కాపు నాయకుడు వంగవీటికి వ్యతిరేకంగా వుంటుందా? ఈ అనుమానం ఇప్పటికే కొందరు మెగాభిమానులకు, కాపు యువతకు వచ్చిందని తెలుస్తోంది.
ఈ మేరకు వారు దాసరి కిరణ్ కుమార్ ను అడిగినట్లు వినికిడి. తనెందుకు అలాంటి సినిమా తీస్తానని, తనకు తెలియకుండా, తాను పూర్తిగా చూడకుండా సినిమా విడుదల కాదని, ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఇలా అడిగిన జనం మాత్రం, వర్మ తను అనుకున్నది చేస్తాడు కానీ, నిర్మాతకు చూపించడం, మార్చడం లాంటివి వుంటాయా? అని అనుమాన పడుతున్నారు. పైగా కాపు వర్గాల్లో వర్మ తమకు వ్యతిరేకి అన్న చిన్న అనుమానం కూడా వుంది.
ఇవన్నీ కలిసి, ఇప్పుడు ఇంతకీ ఈ వంగవీటి ఎలా వుంటుంది? కమ్మగా వుంటుందా? కాపు కాస్తుందా? అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.