'బాహుబలి' సినిమా పెద్దయెత్తున వసూళ్ళు సాధించిందనీ, 'బాహుబలి-2' విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిందనీ జరిగిన ప్రచారంతో ఒక్కసారిగా ఐటీ అధికారులు అలర్ట్ అయ్యారు. 'బాహుబలి' నిర్మాతల కార్యాలయాల్లో ఈ మధ్యనే సోదాలు కూడా జరిగాయి. సినిమా అంటే కళాత్మకమైన వ్యాపారం. పైగా, బోల్డంత హైప్ వున్న ఇండస్ట్రీ ఇది. లోపలి లెక్కలకీ, పైకి ప్రచారం జరిగే లెక్కలకీ చాలా తేడా వుంటుంది.
ప్రచారం కోసం పెద్ద పెద్ద లెక్కలు చెప్పడం ఇప్పుడు నిర్మాతల కొంప ముంచేస్తోంది. 'బాహుబలి'పై ఐటీ ఎటాక్ అలా జరిగిందే. తాజాగా, మహేష్ కొత్త సినిమా చుట్టూ ఇప్పుడు సవాలక్ష గుసగుసలు విన్పిస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ దాదాపు 30 కోట్ల దాకా అమ్ముడుపోయాయన్నది మహేష్ – మురుగదాస్ కాంబినేషన్లో రానున్న సినిమాపై విన్పిస్తోన్న హాటెస్ట్ గాసిప్. సినిమాని ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఓ పక్క విన్పిస్తోందనుకోండి.. అది వేరే విషయం.
30 కోట్ల రూపాయల శాటిలైట్ ప్రైస్ అంటే చిన్న విషయమేమీ కాదు. పోనీ, 30 కాదు.. 26 లేదా 28 అనుకుందాం.. అదీ చిన్న విషయమేమీ కాదు కదా.! ఇంత ఫిగర్ గురించి ఐటీ అధికారులకు ఉప్పందితే (ఉప్పందడమేంటి.? మీడియాలో గాసిప్స్ వచ్చేస్తుంటేనూ..) ఐటీ అధికారులు ఊరుకోరు. అభిమానుల్ని ఉత్సాహపరిచే ఇలాంటి కథనాలు ఇప్పుడు కొత్త కాదు. కొన్ని సందర్భాల్లో సినిమా యూనిట్ ఈ గాసిప్స్‌ని లీక్ చేయడమూ చూశాం.
పరిస్థితులు మారాయి.. ఐటీ కళ్ళు పూర్తిగా సినీ పరిశ్రమ మీదనే వున్నాయి. ఏ రాజకీయ ప్రముఖుడి మీదా ఐటీ దాడులు ఈ మధ్యకాలంలో జరగలేదుగానీ, సినీ పరిశ్రమ మీద మాత్రం సర్వసాధారణమైపోయాయి. ఎందుకంట.? సినీ పరిశ్రమ మీద ఈ ఐటీ అధికారులకు ఈ ప్రేమంట.?