Bethaludu, Bethaludu review"> Bethaludu, Bethaludu review" /> Bethaludu, Bethaludu review" />

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: భేతాళుడు

సినిమా రివ్యూ: భేతాళుడు

రివ్యూ: భేతాళుడు
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
విజయ్‌ ఆంటోని ఫిలిం ఫ్యాక్టరీ
తారాగణం: విజయ్‌ ఆంటొని, అరుంధతి నాయర్‌, మురుగదాస్‌, చారుహాసన్‌, మీరాకృష్ణన్‌, వై.జి. మహేంద్ర తదితరులు
సంగీతం: విజయ్‌ ఆంటోని
కూర్పు: వీర సెంథిల్‌
ఛాయాగ్రహణం: ప్రదీప్‌ కలిపురయాత్‌
నిర్మాత: ఫాతిమా విజయ్‌ ఆంటోని
దర్శకత్వం: ప్రదీప్‌ కృష్ణమూర్తి
విడుదల తేదీ: డిసెంబరు 1, 2016

'బిచ్చగాడు' ఘన విజయంతో తెలుగునాట పాపులర్‌ అయిన విజయ్‌ ఆంటోని ఈసారి 'భేతాళుడు'గా మన ముందుకొచ్చాడు. ఆసక్తికరమైన కథాంశాలని ఎంచుకోవడంలో స్పెషలిస్ట్‌ అయిన విజయ్‌ ఆంటోని ఈసారి కూడా తన ప్రత్యేకత చాటుకున్నాడు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా మొదలయ్యే 'భేతాళుడు' కట్టి పడేసే కథనంతో ఇంటర్వెల్‌ వరకు థ్రిల్‌ చేస్తుంది. కానీ ఆ తర్వాత సడన్‌గా దారి తప్పి మరో సినిమా ఏదో చూస్తోన్న భావన కలిగిస్తుంది. 

ఒక ఐటీ ఉద్యోగికి (విజయ్‌ ఆంటోని) ఉన్నట్టుండి తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పని చేస్తున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ సడన్‌గా డార్క్‌ అయి, అందులోంచి ఒక చెయ్యి వచ్చి అతడిని పట్టుకోవాలని చూస్తుంది. 'నువ్వు చచ్చిపోతే నన్ను చేరుకోవచ్చు' అంటూ ఒక గొంతు అతడిని హిప్నటైజ్‌ చేస్తుంటుంది. తనకేం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నంలో అతడు తన గతాన్ని కనుక్కుంటాడు. ఆ జన్మలో దారుణంగా హత్యకి గురైన అతను తనని చంపిన స్త్రీపై ఈ జన్మలో పగ తీర్చుకోవాలని చూస్తాడు. ఉన్నట్టుండి తనకి గత జన్మ స్మృతులు ఎలా గుర్తుకొస్తాయి. అంతవరకు వినిపించని ఆ గొంతు ఇప్పుడెందుకు వినిపిస్తున్నట్టు. 

దర్శకుడు టైమ్‌ వేస్ట్‌ చేయకుండా ఈ ఆసక్తికరమైన కథకి ఇన్‌స్టంట్‌గా కనక్ట్‌ అయ్యేలా చెప్పడం మొదలు పెట్టాడు. కథని ఆరంభించిన పాయింట్‌ బాగున్నా కానీ, కనీసం ఆ పాత్ర తాలూకు గతం చెప్పేటప్పుడు అయినా క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌ మీద దృష్టి పెట్టాల్సింది. పాత్రలన్నీ కథలోకి సడన్‌గా ప్రవేశిస్తుంటాయి. దాని వల్ల కథతో కనక్ట్‌ అయినా కానీ క్యారెక్టర్స్‌తో రిలేట్‌ చేసుకునే వీలుండదు. అయితే కథలో జరుగుతోన్న విషయం ఆసక్తికరంగా ఉండడంతో ఇలాంటి పొరపాట్లని అంతగా పట్టించుకోం. తనని గత జన్మలో చంపిన జయలక్ష్మి ఎవరనేది దినేష్‌ (విజయ్‌ ఆంటోని) అన్వేషిస్తుంటే, అతనితో పాటుగా ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత మనలోను అధికమౌతుంటుంది. ఆమె ఎవరనేది రివీల్‌ చేసే వరకు దర్శకుడు భేతాళుడుని పరుగులు పెట్టించాడు. 

అనూహ్యమైన మలుపుతో 'విరామం' ఇచ్చిన దర్శకుడు జయలక్ష్మి అతడిని చంపడానికి గల కారణం కూడా బాగానే (రొటీన్‌ అయినప్పటికీ) బాగానే చూపెట్టాడు. ఇక భేతాళుడు ఆ జయలక్ష్మిపై ఏ విధంగా పగ తీర్చుకుంటాడనే పాయింట్‌పై పుట్టించిన ఆసక్తిని చంపేస్తూ థ్రిల్లర్‌ సడన్‌గా కమర్షియల్‌ సినిమాల మాదిరిగా మారిపోతుంది. అంతవరకు రేకెత్తించిన ఎక్సయిట్‌మెంట్‌పై అధాటున బకెట్‌ నీళ్లు కుమ్మరించినట్టవుతుంది. చాలా కమర్షియల్‌ సినిమాల్లో చూపించే ఒక కారణాన్ని చూపించి ఇంతవరకు మీరు చూసిందంతా దీనివల్లే అంటే చిర్రెత్తుకొస్తుంది. 

పోనీ లాజిక్‌ కోసమని ఇలా చేసారని సరిపెట్టుకుందామన్నా, అక్కడ్నుంచి సన్నివేశాలన్నీ సిల్లీగా అనిపిస్తుంటాయి. క్లయిమాక్స్‌ సీన్‌ అయితే 'ఇంత చేసినా ఈ సినిమా హిట్టెలా అవుతుందో చూద్దాం' అని తమకి తామే పరీక్ష పెట్టుకున్నారనే ఫీలింగ్‌ కలిగిస్తుంది. 'ముని' తరహాలో ముగించి ఈ భేతాళుడుని మాస్‌ ఫ్రెండ్లీ చేద్దామని చూసారు కానీ అంతవరకు చూపించిన దానికి దీంతో లింకు లేకపోవడంతో మొత్తం సినిమాకే మోసమొచ్చింది. 

విజయ్‌ ఆంటోని చాలా లిమిటెడ్‌ టాలెంట్‌ ఉన్న యాక్టర్‌. పచ్చిగా చెప్పాలంటే సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఆర్టిస్ట్‌. ఇలాంటి హీరో ఉన్నప్పుడు కథ రెండింతలు బలంగా వుండాలి. లేదంటే హీరో తేలిపోవడమే కాక సినిమా కూడా పేలిపోతుంది. ఇప్పటివరకు కథల విషయంలో చాలా జాగ్రత్త వహించిన ఆంటోని 'బిచ్చగాడు' ఘన విజయంతోనో లేక మరి దేనికో ఈసారి లైట్‌ తీసుకున్నట్టున్నాడు. కథ వరకు మంచిదే ఎంచుకున్నా కానీ అది గాడి తప్పిన విషయాన్ని కనిపెట్టలేకపోయాడు. అరుంధతి నాయర్‌ మినహా మిగిలిన తారాగణం నుంచి సహకారం లేకపోవడంతో తెరపై 'భేతాళుడు' డల్లయిపోయాడు. తెరవెనుక నుంచి మాత్రం మంచి సహకారమే అందుకున్నాడు. విజయ్‌ ఆంటోని సంగీతం, ప్రదీప్‌ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధానాకర్షణలుగా నిలిచాయి. దర్శకుడు ప్రదీప్‌ సగం వరకు ఎలాంటి చింత లేకుండా బండి లాగించేసినా, టాప్‌ గేర్‌కి వెళ్లాల్సిన చోట కంట్రోల్‌ కోల్పోయి యాక్సిడెంట్‌ చేసేసాడు.

ఫస్ట్‌ హాఫ్‌లో చూపించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌కి తగ్గ సెకండ్‌ హాఫ్‌నే రాసుకున్నట్టయితే ఈ చిత్రం ఖచ్చితంగా అలరించి వుండేది. విజయ్‌ ఆంటోనీ లాంటి ఇమేజ్‌ లేని హీరో ఉన్నప్పుడు ఇలాగే ముగించాలనే కండిషన్స్‌ వుండవు కనుక దర్శకులు సెన్సేషనల్‌గా ఆలోచించడానికి, ఆ ఆలోచనల్ని అమలు చేయడానికి స్కోపెక్కువ. అలాంటి అవకాశం ఉన్నప్పుడు దానిని వాడుకోకుండా మసాలా అంశాలతో మాస్‌ని ఆకట్టుకోవాలని చూడడం అనవసరపు ప్రయాస. కష్టపడి మంచి పెయింటింగ్‌ వేసి, అది అద్భుతంగా తయారవుతోన్న దశలో స్వయానా బురద చల్లినట్టు దర్శకుడు ఈ భేతాళుడిని చేజేతులా చెడగొట్టేసాడు. విజయ్‌ ఆంటోనికి మరో విజయాన్ని గుమ్మం వరకు తీసుకొచ్చి లోనికి రానివ్వకుండా తన్ని పంపేసాడు. 

బాటమ్‌ లైన్‌: 'భేతాళుడు' చెట్టెక్కేసాడు!

గణేష్‌ రావూరి