గతంతో పోల్చితే, ప్రస్తుతం దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చాలా చాలా చాలా తగ్గిపోయాయని చెప్పక తప్పదు. ఈ మధ్యకాలంలో.. అంటే, గడచిన రెండున్నరేళ్ళలో పరిస్థితులు చాలావరకు ప్రశాంతంగానే వున్నాయి. కానీ, సరిహద్దుల్లో మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో పాకిస్తాన్ పైశాచికత్వం ప్రదర్శిస్తోంది. యురీ ఘటన తర్వాత భారత సైన్యం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి తీవ్రవాదం తగ్గుతుందేమోనని అంతా అనుకున్నా, పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాయి.
అసలేం జరుగుతోంది.? పాకిస్తాన్ పైశాచికత్వానికి కారణమేంటి.? అని ఆలోచిస్తే, చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గినా, జమ్మూకాశ్మీర్ మాత్రం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తగలబడింది. పాక్ ప్రేరేపిత వేర్పాటువాదులు ఓ పక్క, తీవ్రవాదులు ఇంకోపక్క.. వీరికి మద్దతుగా కాశ్మీర్లో అల్లరి మూకలు ఇంకోపక్క.. వెరసి, కాశ్మీర్‌ని రావణకాష్టంగా మార్చేశారు.
తీవ్రాదులకు – భద్రతాదళాలకు మధ్య కాశ్మీర్లో ఎన్కౌంటర్లు సర్వసాధారణం. అయినా, అవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. దానర్థం, తీవ్రవాదుల్ని అక్కడే భారతసైన్యం నిలువరిస్తోందని. తద్వారా దేశంలోకి తీవ్రవాదులు చొరబడ్డం చాలావరకు తగ్గిపోయిందని చెప్పకతప్పదు. దేశంలోని స్లీపర్ సెల్స్ నుంచీ, కొన్ని అసాంఘీక శక్తుల నుంచీ తీవ్రవాదులకు సహకారం తగ్గిపోవడంతో, పాక్ ప్రేరేపిత తీవ్రవాదం ఆ కసిని, సరిహద్దుల్లో సైన్యంపై చూపించడం మొదలుపెట్టింది.
ఓ వైపు పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత సరిహద్దుల్లోని సైనిక పోస్టులపైనా, గ్రామాలపైనా దాడులకు దిగుతుండడం, ఈ గందరగోళంలో తీవ్రవాదులు తేలిగ్గా భారత్ వైపుకు దూసుకురావడం ఎక్కువైంది. షరామామూలుగానే భారత సైన్యం, తీవ్రవాదుల్ని ఎక్కడికక్కడ మట్టుబెడ్తుండడం జరుగుతోందనుకోండి.. అది వేరే విషయం. దేశంలోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో, సరిహద్దుల్లోని సైన్యంపై పాక్ ప్రేరేపిత తీవ్రవాదం పైశాచికత్వం ప్రదర్శిస్తోంది.
నిజానికి, సరిహద్దుల్లో భారత సైన్యానికీ, పాకిస్తాన్ సైన్యం ప్లస్ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదానికీ మధ్య పోరు నిత్యం జరిగేదే. అది ఇప్పుడు కాస్త ఎక్కువయ్యిందంతే. కాశ్మీర్లో అల్లర్లు తగ్గడం భారత్ వరకూ శుభపరిణామంగానే భావించాలి. దానికన్నా మిన్నగా, దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం ఆహ్వానించదగ్గ విషయం. అంతర్గత భద్రత మెరుగుపడిన దరిమిలా, సరిహద్దుల్లో శతృవుని పూర్తిగా నిలువరించే రోజెంతో దూరంలో లేదు.
అసహనంతో పైశాచికత్వం ప్రదర్శిస్తోన్న పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదం ఇప్పటికే నిర్వీర్యమవుతోంది.. అది పూర్తిగా నిర్వీర్యమవడానికి ఇంకొంత సమయం పడుతుంది.