రాజకీయాల్లో ఏవీ అనుకున్నట్లు జరగవు. ఇప్పుడే ఈ పని చేయాల్సిన అవసరం లేదనుకుంటే అప్పుడే చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి కార్యరంగంలోకి దూకాల్సిందే. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు చేయాల్సిన పని అదే.
ఈమధ్యే జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో నేతలంతా ముక్తకంఠంతో 'రాహుల్ మీరు అధ్యక్ష పదవి స్వీకరించండి' అని కోరారు. కాని యువరాజు ఇప్పుడే కాదని ఏడాదిపాటు వాయిదా వేశారు. దీంతో ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవీ కాలాన్ని పొడిగించాల్సివచ్చింది. కాని ఏడాదిపాటు సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగే పరిస్థితి లేదు. ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడమే ఇందుకు కారణం.
చాలాకాలంగా అంతంతమాత్రంగా ఉన్న సోనియా గాంధీ మళ్లీ తీవ్రంగా అస్వస్థత పాలైనట్లు, ఆస్పత్రిలో చేర్చినట్లు తాజా సమాచారం. ఆమె అనారోగ్యానికి సంబంధించిన వివరాలు తెలియకపోయినా వెంటనే ఆస్పత్రిలో చేరడంతో పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు కాంగ్రెసు నాయకులు అనుమానిస్తున్నారు. వైరల్ ఫీవరని కొందరు చెబుతున్నారు. సోనియా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని కాంగ్రెసు అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు కూడా ఆమె ఎక్కువ రోజులు హాజరుకాలేకపోయారు. తాను పనిచేయలేని స్థితిలో ఉన్నానని ఆమె భావిస్తున్నారు. వచ్చే ఏడాది (2017) ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నారని ఈమధ్య వార్తలొచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫిబ్రవరి, మార్చిలో జరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెటును ముందుకు జరిపి ఫిబ్రవరి ఒకటో తేదీనే ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. బడ్జెటు, ఎన్నికలు చూసుకొని సోనియా గాంధీ పదవికి రాజీనామా చేస్తారని కాంగ్రెసు వర్గాల సమాచారం. ఆమె బలవంతంగా పదవిలో ఉన్నా అది నామమాత్రమే. అలా ఉండటం ఆమెకు ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే రాహుల్ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరిస్తుండొచ్చు.
వాస్తవానికి అధ్యక్ష పదవి తీసుకునేందుకు ఆయన మానసికంగా సిద్ధంగా లేరని సీడబ్ల్యుసీ సమావేశంలోనే తేలిపోయింది. అయినప్పటికీ తల్లికి చేతకావడంలేదు కాబట్టి మూడ్ మార్చుకోవాల్సిందే. పార్టీ సీనియర్ నాయకుల్లో కొందరు అధ్యక్షురాలిగా సోనియాయే ఉండాలని కోరుతుండగా, యువ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన, చేరుతున్నవారు రాహుల్ రావాలని కోరుతున్నారు.
రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయడానికిగాను సీడబ్ల్యుసీ త్వరలోనే సమావేశం అవుతుందని నాయకులు చెబుతున్నారు. ఇక ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై పార్టీలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఆమె క్రియాశీలక రాజకీయల్లోకి లాంఛనంగా 2019లో అడుగుపెడతారని కొందరు నాయకులు చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె తల్లి సోనియా నియోజకవర్గమైన రాయబరేలీ నుంచి పోటీ చేయవచ్చంటున్నారు. దీన్నిబట్టి చూస్తే సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాకుండా ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నమాట…! అదే జరిగితే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా ఉంది.
సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేదనేది వాస్తవం. ఆమె గర్భాశయ ముఖద్వార కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు అమెరికాలో ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న తరువాత ఒకప్పటిలా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. ఇంటి పక్కన భవనంలో కీలకమైన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంటేనే వెళ్లలేకపోయారంటే ఆమె పూర్తి విశ్రాంతి తీసుకునే దశకు చేరుకున్నారని అర్థమవుతోంది. ఆమె రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే అవకాశం లేదని మీడియా పండితులు చెబుతున్నారు. అంతా భుజాన వేసుకొని పనిచేయడం మానేయాలని వైద్యులు సలహా ఇచ్చారు.
కొంతకాలం క్రితం యూపీలోని వారణాసిలో (ప్రధాని మోదీ నియోజకవర్గం) ఎన్నికల ప్రచారం చేస్తూ హఠాత్తుగా అనారోగ్యం పాలైన సోనియాలో యాక్టివ్నెస్ తగ్గిపోయింది. దాదాపు నాలుగు నెలలుగా బయటకు రావడంలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌లో ఆమె ఎన్నికల ప్రచారం చేయకపోవచ్చని అనుకుంటున్నారు. రాహుల్‌కు ఎంత త్వరగా బాధ్యతలు అప్పగిస్తే అంత మంచిదని ఆమె భావిస్తున్నా ఇప్పటివరకు ముందుకు పడలేదు. రాహుల్ చేతిలో కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు ఎలా ఉన్నప్పటికీ అనారోగ్యం రీత్యా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వక తప్పదు.