టాలీవుడ్ బయ్యర్లకు అలవాటేమిటంటే, గాలి వాటంలో సాగిపోవడం. భేతాళుడు సినిమా విషయంలో ఇలాగే వుంది వ్యవహారం. బిచ్చగాడు విజయం చూసి, భేతాళుడు సినిమాను బొలోమంటూ కొనేసారు. డబ్బింగ్ చేసిన నిర్మాత, అసలు పనులు పూర్తి కాకుండానే హ్యాపీగా బిజినెస్ చేసేసుకున్నారు. ఫస్ట్ హాండ్ లో కొన్ననిర్మాత కేవలం రెండు కోట్లకు కొని మూడు కు అమ్మేసారు. దాన్ని తీసుకున్న నిర్మాత మాత్రం పది కోట్ల మేరకు బిజినెస్ చేసినట్లు బోగట్టా.
కొడుకును హీరో చేయాలని ప్రయత్నిస్తూ, భారీ సినిమాలు తీస్తున్న నిర్మాత ఈ సినిమాను నాలుగు ఏరియాలకు కొన్నారని తెలుస్తోంది. విశాఖ ఏరియానే కొటి రూపాయిలకు అమ్మారు. నైజాం రెండు కోట్ల దగ్గర బిజినెస్ చేసారు. సుమారు నాలుగు వందలకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఇంతకీ విజయ్ ఆంటోనీ తెలుగు వారికి పరిచయం అయింది కేవలం రెండు సినిమాలతో. సలీం పెద్దగా ఆడలేదు. బిచ్చగాడు అద్భతమైన హిట్. ఇప్పుడు ఇది మూడోది. ఈ సినిమా మీద బజ్ ఇంతా అంతా కాదు. అదే సమయంలో భయం కూడా కనిపిస్తోంది. ఏం అవుతుందో అన్న ఆందోళన కొన్న బయ్యర్లలో కనిపిస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు హిట్ టాక్ వస్తే, దూసుకుపోతాయి. తేడా టాక్ వస్తే చతికిల పడిపోతాయి. అదీ సమస్య.
పైగా దీన్ని మారుబేరానికి కొన్ని నిర్మాత టైమ్ అంతగా బాలేదు. ఇటీవల చాలా కాలంగా ఆయన చాలా నష్టపోయారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఆయన భారీ నష్టాలు చవిచూసారు. ఈ సినిమా విక్రయాల్లో మంచి లాభాలు కళ్ల చూసారు.మరి ఈసారి అయినా అదృష్టం కలిసి వస్తుందో రాదో చూడాలి. లేదూ అంటే ఈ ప్రభావం వచ్చే నెలలో ఆయన విడుదల చేసే మరో డబ్బింగ్ సినిమా మీద పడే అవకాశం వుంది.
గతంలో ఇలాగే మన జనాలు సూర్య, కార్తీ, అజిత్ డబ్బింగ్ సినిమాల మీద భారీ కొనుగోళ్లు జరిపి కుదేలయ్యార. విజయ్ ఆంటోనీ సినిమా ఆ కోవలో వెళ్లకుండా వుంటే చాలు. బయ్యర్లు గట్టెక్కేస్తారు.