'డర్టీపిక్చర్' విద్యాబాలన్ కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ మూవీ. అలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ తన కెరీర్‌లో వస్తుందో రాదో తనకు తెలియదనీ, ఎప్పటికీ అదే 'ది బెస్ట్ మూవీ' అనీ విద్యాబాలన్ చెబుతోంది. తన తాజా చిత్రం 'కహానీ -2' సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న విద్యాబాలన్, గ్లామర్ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదనీ, గ్లామర్‌తోపాటు అన్నీ వుండాలనీ చెబుతున్న విద్యాబాలన్, పెళ్ళయ్యాక సినిమాల్లో గ్లామరస్‌గా కన్పించకూడదనే రూల్ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. 'కరీనాకపూర్ పెళ్ళయ్యాక కూడా వెండితెరపై గ్లామరస్‌గానే కన్పిస్తోంది.. ఐశ్వర్యారాయ్ కూడా అంతే.. ఏమో, నేను కూడా అంతేనేమో..' అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది విద్యాబాలన్.
అంటే, త్వరలో గ్లామరస్‌గా మిమ్మల్ని వెండితెరపై చూడొచ్చన్నమాట.? అనడిగితే, 'వై నాట్..' అంటూనే, గ్లామర్ విషయంలో ఇదివరకటకీ, ఇప్పటికీ తన ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయనీ, గ్లామరస్‌గా కన్పించడానికి చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందనీ విద్యా బాలన్ చెబుతోంది. 'డర్టీ పిక్చర్' తర్వాత అంత పేరు తెచ్చేలా 'కహానీ-2' సినిమా వుంటుందని విద్యాబాలన్ ఆశాభావం వ్యక్తం చేసింది.