శ్రీ‌లంక కొంప ముంచిన స‌ల‌హాదారులు

జ‌గ‌దేక‌వీరుని క‌థ సినిమాలో రాజు రాజ‌నాల‌కి ఒక పాత మంత్రి వుంటాడు. మంచి మాట‌లు చెప్ప‌డానికి ప్ర‌యత్నిస్తుంటాడు. కానీ రాజు విన‌డు. కొత్త మంత్రి సీఎస్ఆర్ ఏదో పిచ్చి స‌ల‌హాలు ఇస్తే అవే రాజుకి న‌చ్చుతాయి.…

జ‌గ‌దేక‌వీరుని క‌థ సినిమాలో రాజు రాజ‌నాల‌కి ఒక పాత మంత్రి వుంటాడు. మంచి మాట‌లు చెప్ప‌డానికి ప్ర‌యత్నిస్తుంటాడు. కానీ రాజు విన‌డు. కొత్త మంత్రి సీఎస్ఆర్ ఏదో పిచ్చి స‌ల‌హాలు ఇస్తే అవే రాజుకి న‌చ్చుతాయి. చివ‌రికి ఇద్ద‌రూ పోతారు.

శ్రీ‌లంక‌లో ఈ రోజు భ‌యాన‌క ప‌రిస్థితి వుండ‌డానికి గొట‌బాయ రాజ‌ప‌క్సే స‌ల‌హాదారులు కూడా కార‌ణం. శ్రీ‌లంక‌లో ఎరువుల ఫ్యాక్ట‌రీలు లేవు. అన్ని ర‌కాల పురుగుల మందుల్ని దిగుమ‌తి చేసుకోవాల్సిందే! దానికి విదేశీ మార‌క ద్ర‌వ్యం అంటే ఫారిన్ క‌రెన్సీ ముఖ్యంగా డాల‌ర్లు కావాలి. శ్రీ‌లంక‌లో నిలువ‌లు లేవు. కొత్త‌గా అప్పులు పుట్ట‌వు. ఉన్న కాసింత‌లో పెట్రోలియం ఉత్ప‌త్తులు, అత్య‌వ‌స‌ర మందుల‌కి స‌ర్దాలి.

కోవిడ్ త‌ర్వాతి సంక్షోభం ఏప్రిల్ 2021లో ఒక స‌ల‌హాదారుడికి అద్భుత ఐడియా వ‌చ్చింది. ఎరువులు, పురుగుల మందుల దిగుమ‌తిని నిషేధించి దేశ‌మంతా ఆర్గానిక్ చేయించాల‌ని. దీని వ‌ల్ల డ‌బ్బులు మిగులుతాయి, ప్ర‌జ‌ల‌కి ఆరోగ్యం అన్నాడు.

దీనికి కొంచెం నేప‌థ్యం వుంది. ప్ర‌తి దేశంలోనూ ప‌ర్యావ‌ర‌ణం పేరుతో ప‌ని చేసే సంస్థ‌లుంటాయి. కొన్నింటికి విదేశీ సాయం కూడా అందుతూ వుంటుంది. వీళ్ల నిజాయ‌తీని శంకించ‌లేం. అన్ని చోట్లా వున్న‌ట్టే కొంద‌రు దొంగ‌లు కూడా వుంటారు. 2015లో మైత్రిపాల సిరిసేన అధ్య‌క్షుడుగా వున్న‌ప్పుడు దేశం మొత్తం ఆర్గానిక్ వ్య‌వ‌సాయానికి షిప్ట్ కావాల‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు విజ్ఞ‌ప్తి చేశారు. కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు.

అయితే గొట‌బాయ హ‌యాంలో ఏప్రిల్ 2021లో అమ‌ల్లోకి వ‌చ్చింది. స‌ల‌హాదారులంతా ఇదొక వ్య‌వ‌సాయ విప్ల‌వ‌మ‌ని ప్రాప‌గండ చేశారు. కొంత మంది వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు వ్య‌తిరేకించారు. రైతుల‌కి హ‌ఠాత్తుగా ఇది అర్థం కాద‌ని, దిగుమ‌తిలో తేడా వ‌స్తే వ్య‌వ‌సాయం వదిలేస్తార‌ని, రైతులు త‌మ కుటుంబాన్ని పోషించుకోడానికి వ్య‌వ‌సాయం చేస్తారు త‌ప్ప, సామాజిక ఆరోగ్యం కోసం కాద‌ని ఇది గ్రౌండ్ రియాల్టీ అని చెప్పారు. ఎవ‌రూ విన‌లేదు.

పురుగుల మందు వాడ‌కం వ‌ల్ల శ్రీ‌లంక‌లో కిడ్నీ వ్యాధులు పెరిగాయ‌ని, అందువ‌ల్ల నిషేధం క‌రెక్ట్ అని స‌మ‌ర్థించారు. నీళ్ల‌లోని ఫ్లోరైడ్ శాతం కిడ్నీ వ్యాధుల‌కి కార‌ణ‌మ‌ని, పురుగుల మందు వాడ‌కం కాద‌ని సైంటిస్టులు చెప్పి చూశారు.

అధ్య‌క్షుడి స‌ల‌హాదారుడొకాయ‌న ప్రాచీన గ్రంథాలు చ‌దివి క్రీస్తు పూర్వం సింహ‌ళ‌రాజు దుతుగెమును వ‌ద్ద బలాడ్యులైన యోధులు త‌యార‌వ‌డానికి ప్ర‌త్యేక ర‌కానికి చెందిన బియ్యం తిన‌డ‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం చేశాడు. ఆర్గానిక్‌లో ఆ బియ్యం మ‌ళ్లీ పండిస్తే కొత్త యోధులు త‌యార‌వుతార‌ని జోస్యం చెప్పాడు. ఇంకొకాయ‌న చెరువులు ఎండిపోవ‌డానికి కార‌ణం భూమిలో కెమిక‌ల్స్ క‌ల‌వ‌డ‌మే అన్నాడు (దీంట్లో కొంత నిజం వుండొచ్చు కూడా).

ఆర్గానిక్ సేద్యం మంచిదే కావ‌చ్చు. నూరు శాతం అమ‌లు చేయాల‌ని చూడ‌డం ఆత్మ‌హ‌త్య‌తో స‌మానం. ఎందుకంటే ఎలా పండించార‌ని కాదు, ముందు మ‌న‌కు తిన‌డానికి తిండి గింజ‌లు అవస‌రం.

అస‌లే శ్రీ‌లంక వ్య‌వ‌సాయం అంతంత మాత్రం. ఆర్గానిక్ రైతుల‌కి భారం కావ‌డంతో పాటు దిగుబ‌డి త‌గ్గించింది. వ‌రి త‌గ్గే స‌రికి బియ్యం క‌రువు. మొక్క‌జొన్న త‌గ్గేస‌రికి దీని ప్ర‌భావం పౌల్ట్రీ, ఇత‌ర రంగాల‌పై ప‌డింది. టీ త‌గ్గే స‌రికి ఎగుమ‌తుల‌పై దెబ్బ‌. ర‌బ్బ‌ర్ తోట‌ల‌కి వ‌చ్చే తెగుళ్ల‌ను ఆర్గానిక్ ద్వారా ఎలా నివారించాలో రైతుల‌కి అర్థం కాలేదు. న‌వంబ‌ర్‌లో ఈ పాల‌సీని ఉప‌సంహ‌రించుకున్నారు. అయితే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. మ‌రి జ‌నం క‌డుపు మంట‌కి ఇదొక‌టే కార‌ణ‌మా?  కాదు, ఇంకా చాలా వున్నాయి. అవి Next చెప్పుకుందాం.

జీఆర్ మ‌హ‌ర్షి