చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఓ వెలుగు వెలిగిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టాలు అన్నీఇన్నీ కావు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందని ఏబీవీ భావించారు.
అయితే అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆవేదన ఆయనలో ఉంది. ఏబీవీ ముఖం చూడడానికి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ ఇష్టపడక పోవడం గమనార్హం.
ఏబీవీపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏబీవీని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను చేత పట్టుకుని గత నెల 29న ఏబీవీ సచివాలయానికి వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను కలిసి తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అందజేశారు. పోస్టింగ్‌తో పాటు పెండింగ్ జీతభత్యాల అంశాన్ని సీఎస్ దృష్టికి ఏబీవీ తీసుకెళ్లారు.
పోస్టింగ్ అంశాన్ని ప్రాసెస్‌లో పెడతామని తనకు సీఎస్ హామీ ఇచ్చినట్టు గత నెలలో ఏబీవీ తెలిపారు. అయినప్పటికీ పోస్టింగ్, పెండింగ్ జీతాలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ మరోసారి బుధవారం సీఎస్‌ను కలిసేందుకు ఏబీవీ సచివాలయానికి వెళ్లారు.
అయితే ఏబీవీ ముఖం చూసేందుకు సీఎస్ ఆసక్తి చూపలేదని ఆయన అపాయింట్‌మెంట్ నిరాకరణే చెబుతోంది. ఏబీవీని వెయిటింగ్ రూమ్‌లోనే కూచోపెట్టి సీఎస్ సచివాలయం నుంచి వెళ్లిపోవడం చర్చకు తెరలేచింది.