‘నారాయణ’ బాగోతం-1: తెరవెనక కథ

నారాయణ ప్రస్తుతానికి బెయిల్ పై రిలీజై ఉండొచ్చు. కానీ ప్రశ్నాపత్రాల లీక్ లో ఆయన ప్రమేయం లేదని చెప్పలేం. దీనికి సంబంధించి నారాయణకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్,…

నారాయణ ప్రస్తుతానికి బెయిల్ పై రిలీజై ఉండొచ్చు. కానీ ప్రశ్నాపత్రాల లీక్ లో ఆయన ప్రమేయం లేదని చెప్పలేం. దీనికి సంబంధించి నారాయణకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రధాన నిందితుడు గిరిధర్ రెడ్డి ని విచారించిన పోలీసులు, విద్యాసంస్థలు, ర్యాంకుల ముసుగులో 'నారాయణ' చేస్తున్న దందాను సీన్-బై-సీన్ బయటపెట్టారు. ఈ మేరకు గిరిధర్ రెడ్డి లీక్ గొలుసు మొత్తాన్ని కళ్లకుకట్టినట్టు వివరించినట్టు పోలీసులు తెలిపారు.

1. జేఈఈ, నీట్ లాంటి పరీక్షల్లో ర్యాంకులపైనే నారాయణ సంస్థలు దృష్టి ఎక్కువగా పెడతాయని గిరిధర్ వెల్లడించాడు. మాథ్స్, సైన్స్‌లపైనే ప్రధాన దృష్టి ఉంటుందన్న గిరిధర్ రెడ్డి, తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజ్ సబ్జెక్టులు, సోషల్‌ స్టడీస్‌పై పెద్దగా దృష్టిపెట్టరని, వెల్లడించాడు.

2. అలా నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యార్థులకు తెలుగు, హిందీ, సోషల్ సబ్జెక్టులపై పట్టు ఉండదు. మరి పట్టు లేకపోతే మార్కులు రావు కదా? నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధ్యం కాదు కదా. సరిగ్గా ఇక్కడే 'నారాయణ' బాగోతం మొదలవుతుంది. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లన్నీ తెరపైకొచ్చేది ఇక్కడే.

3. ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్కూల్ డీన్లు, వైస్ ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్‌తో విజయవాడలో ప్రత్యేకంగా నారాయణ సమావేశం నిర్వహిస్తారట. ఒకవేళ అలా కుదరకపోతే వర్చువల్ గానైనా సమావేశం తప్పనిసరి. మొత్తం రూట్ మ్యాప్ ఆ సమావేశంలోనే ఫిక్స్ అవుతుంది.

4. నారాయణ ఆదేశాల ప్రకారం, ప్రతి జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ప్రతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లు ఉన్న టీచర్ల జాబితాలను ముందుగా సంపాదిస్తారు. దీని కోసం డీఈఓ ఆఫీసుల్లో ఉన్న క్లరికల్ సిబ్బందిని మేనేజ్ చేస్తారు. ఆ జాబితా సంపాదించడం నుంచి అసలు కథ మొదలవుతుంది.

5. జాబితాలో ఉన్న ఇన్విజిలేటర్లందరికీ డబ్బులు అందుతాయి. కొంతమందికి నగదు రూపంలో, మరికొందరికి బహుమతుల రూపంలో తాయిలాలు అందిపోతాయి. వాళ్ల సహకారంతో ప్రశ్నాపత్రాలను వివిధ రూపాల్లో సంపాదిస్తారు. కొన్ని చోట్ల ఫొటోలు, మరికొన్ని చోట్ల జిరాక్స్, చాలాచోట్ల కార్బన్ కాపీతో పేపర్లు బయటకు వచ్చేస్తాయి.

6. ప్రశ్నాపత్రం చేతికొచ్చిన తర్వాత, ఆ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో ఆఘమేఘాల మీద సమాధానాలు రాయిస్తారు. ఆ సమాధానాల్ని వాటర్ బాయ్స్ ద్వారా లేదా, ఏఎన్‌ఎంల ద్వారా విద్యార్థులకు చేరవేస్తారు. ఒక్కోసారి ఇన్విజిలేటర్లే స్వయంగా తమ చేతులతో 'నారాయణ' విద్యార్థులకు చిట్టీలు అందిస్తారు. అలా పిల్లలంతా ఎంచక్కా ఆన్సర్ షీట్ నింపేస్తారు. జంబ్లింగ్ విధానం పెట్టినా, ఈ 'పద్ధతి'ని అడ్డుకోలేరనే విషయం ఇక్కడ గమనార్హం.

7. ఇక తాజా ఘటన విషయానికొస్తే.. నారాయణ ఆదేశాల ప్రకారం అది వరకే తిరుపతి నారాయణ స్కూల్ లో పని చేసి, ప్రస్తుతం ఎన్నారై అకాడమీలో పనిచేస్తున్న సుధాకర్ అనే వ్యక్తి ద్వారా తెలుగు ప్రశ్నపత్రాన్ని సంపాదించినట్టు గిరిధర్ రెడ్డి పోలీసులకు వెల్లడించాడు.

8. చేసింది గిరిధర్ అయినప్పటికీ, స్కెచ్ వేసింది బాల గంగాధర్ అనే వ్యక్తి. ప్లాన్ మొత్తం బాల గంగాధర్ దే. ఈ ప్రశ్నలకు సమాధానాలను గిరిధర్ రెడ్డి తెప్పించుకున్నాడు. మరింతమందికి ప్రశ్నాపత్రం చేరవేయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది టీచర్లకు కూడా ఫార్వార్డ్ చేసాడు.

9. ప్రతి ఏటా జరిగే ఈ తంతు, ఈ ఏడాది కూడా మామూలుగానే జరిగిపోయేది. అస్సలు బయటకొచ్చే ఛాన్స్ లేదు. కానీ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని గిరిధర్ అనుకున్నాడు. అందుకే సదరు ప్రశ్నాపత్రాన్ని ఉద్దేశపూర్వకంగా చిత్తూర్ టాకీస్ పేరుతో నడుస్తున్న జర్నలిస్టుల వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేశాడు.

10. ఇక ఆ తర్వాత నుంచి జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. ఈ సాక్ష్యం ఆధారంగానే నారాయణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని కోర్టుకు తెలిపి, పూచీ కత్తుతో బయటపడ్డారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే.