ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ కొండారెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యకు శ్రీకారం చుట్టింది. ఒక రకంగా ఇది షాకింగ్ చర్యే అని చెప్పక తప్పదు.
పులివెందుల నుంచి రాయచోటికి రోడ్డు వేస్తున్న ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగులపై తీవ్రస్థాయిలో వైఎస్ కొండారెడ్డి బెదిరింపులకు దిగడం తీవ్ర వివాదానికి దారి తీసింది. వైఎస్ కొండారెడ్డి బెదిరింపులపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన సీరియస్‌గా స్పందించారు.
వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తద్వారా తన పేరు చెప్పుకుని బెదిరింపులు లేదా అక్రమాలకు పాల్పడే వారికి సీఎం ఓ హెచ్చరిక పంపారు.
వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండారెడ్డిపై మరో కఠిన చర్యకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బెయిల్‌పై విడుదలయ్యే కొండారెడ్డిని జిల్లాలో ఉండనివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
దీంతో వైఎస్ కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణకు ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపినట్టు కడప ఎస్పీ అన్బురాజన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బహిష్కరణ చర్య తీసుకున్నట్టు ఆయన తెలపడం విశేషం.
వైఎస్.కొండారెడ్డి పై ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఉద్యోగులను బెదిరించడంతో పాటు పలు కేసులున్నాయని తెలిపారు. వైఎస్ కొండారెడ్డిపై బహిష్కరణ వేటు అసాధారణ చర్యగా కడప జిల్లాలో చర్చ జరుగుతోంది.