టాలీవుడ్ ను కరోనా కారణంగా వడ్డీల భారం పీడిస్తోంది. గతం రెండేళ్లుగా చాలా భారీ సినిమాలు ఇలాగే వడ్డీల బారిన పడ్డాయి. ఒక్కో సినిమాకు యాభై కోట్ల వరకు వడ్డీల భారమే పడిపోయింది. రెండు రూపాయలకన్నా తక్కువ వడ్డీకి టాలీవుడ్ లో డబ్బులు దొరకవు.
ఎవరైనా టాప్ హీరో అంటే చాలు కనీసం పది కోట్లు అడ్వాన్స్ ఇవ్వాల్సి వుంటుంది. అడ్వాన్స్ ఇచ్చిన నాటి నుంచి సినిమా విడుదల వరకు రెండు నుంచి మూడు ఏళ్లు పడుతుంది. అంటే అక్కడికే వడ్డీ భారం అయిదు నుంచి పది కోట్ల వరకు జస్ట్ హీరో అడ్వాన్స్ భారమే పడుతుంది.
ఇక సినిమా కు కావాల్సిన ఫైనాన్స్ షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల ముందు రోజు వరకు వుంటుంది. కనీసం అరవై డెభై కోట్లు తీసుకోవాల్సిందే. అంటే అదో యాభై కోట్లు అయిపోతుంది. ఇదంతా సినిమా మీద భారమే.
బ్లాక్ బస్టర్ క్రాక్ కు వడ్డీల భారం పడింది. ఆచార్య లాంటి డిజాస్టర్ ను వడ్డీల భారం కుంగదీసింది. సర్కారు వారి పాటకు కూడా వడ్డీల భారం గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు నుంచి తెచ్చిన పది కోట్లకే ఇప్పటి వరకు ఏడు కోట్లు వడ్డీలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పది కోట్లకే ఇన్నేళ్లలో ఏడు కోట్లు వడ్డీ కట్టారు అంటే టోటల్ ప్రాజెక్టు మీద ఎంత కట్టి వుంటారు.
సినిమా బిజినెస్ థియేటర్, నాన్ థియేటర్ కలిపి 170 కోట్లకు కాస్త అటు ఇటుగా అయింది. సినిమా మేకింగ్, హీరో రెమ్యూనిరేషన్ అన్నింటికీ ఈ మొత్తం అలా అలా సరిపోతుంది. లాభాలు రావాలి అంటే సినిమా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. ఆచార్య సినిమాకు రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. కానీ సినిమా ఫెయిల్ కావడంతో టాప్ త్రీ పీపుల్ కు రెమ్యూనిరేషన్ లే మిగలని పరిస్థితి. కానీ ఇక్కడ మహేష్ బాబు కాబట్టి ఆయన రెమ్యూనిరేషన్ ముందే సెటిల్ అయిపోతుంది.
ఎఫ్3 సినిమా కు కూడా బాగా టైమ్ పట్టింది. సినిమా మేకింగ్ కు రెండున్నరేళ్ల సమయం తీసుకుంది. అందువల్ల దానికి కూడా వడ్డీలు లెక్క కట్టుకుంటే బడ్జెట్ పెరుగుతుంది. పైగా ఆ సినిమాకు రెమ్యూనిరేషన్ల భారం కూడా గట్టిగా పడిందని తెలుస్తోంది.