రివ్యూ: రెమో
రేటింగ్: 2.5/5
బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్
తారాగణం: శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, సతీష్, కె.ఎస్. రవికుమార్, యోగిబాబు, రాజేంద్రన్ తదితరులు
సంగీతం: అనిరుధ్
కూర్పు: రూబెన్
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
నిర్మాత: ఆర్.డి. రాజా
రచన, దర్శకత్వం: భాగ్యరాజ్ కణ్ణన్
విడుదల తేదీ: నవంబరు 25, 2016
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ నుంచి సూపర్‌స్టార్‌గా అవతరిస్తోన్న శివ కార్తికేయన్ తాజా చిత్రం 'రెమో' తెలుగులోకి అనువాదమైంది. అతని గత చిత్రాలు కొన్ని ఇక్కడ రీమేక్ అయ్యాయి. ఇక సొంతంగా తెలుగు మార్కెట్ ఏర్పరచుకోవాలని శివ కార్తికేయన్ డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే మన వాళ్లకి గుర్తుండిపోవడానికా అన్నట్టు తను ఆడ వేషం కట్టిన 'రెమో'తో ఇక్కడ అడుగు పెట్టాడు. దిల్ రాజు ద్వారా విడుదలైన 'రెమో' చిత్రం శివ కార్తికేయన్‌కి తమిళనాడులో వున్న ఫాలోయింగ్ ఆధారంగా, అతని అభిమానుల్ని అలరించడానికి అల్లుకున్న కథలా వుంది.
కథగా ఇందులో చెప్పుకోతగ్గ విషయం లేదు. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్ బిల్డప్ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్ చేసేట్టుగా తీర్చిదిద్దారు.
సినిమాలో కొన్ని జెన్యూన్ ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. లేడీ గెటప్‌లో శివ కార్తికేయన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. మేకప్ ఆర్టిస్టులకి క్రెడిట్ దక్కుతుంది. స్టోరీ పరంగా వీక్ అయినా కానీ టెక్నికల్‌గా సాలిడ్‌గా వుండేలా చూసుకున్నారు. అనిరుధ్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, రసూల్ పుకుట్టి సౌండ్ డిజైన్ ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి. దర్శకుడు కాస్త కథ, కథనాల మీద ఫోకస్ పెట్టినట్టయితే ఈ రెమో నిజంగానే శివ కార్తికేయన్‌కి తెలుగులో మంచి లాంఛ్ ప్యాడ్ అయి వుండేదేమో.
శివ కార్తికేయన్ తమిళ వాళ్లకి స్టార్ కనుక అతడి సినిమాలో వాళ్లు లాజిక్కులు వెతక్కపోవచ్చు. కానీ తెలుగు ఆడియన్స్‌కి అతనెవరో తెలియదు. కాబట్టి మనవాళ్లు అతడిని గుర్తించాలన్నా, గుర్తుంచుకోవాలన్నా ఇలాంటి డొల్ల స్క్రిప్టులు సరిపోవు. అపరిచితుడు, గజినిలాంటి ప్రత్యేక లక్షణాలున్న కథలు కావాలి. ఇలాంటి రొటీన్ సినిమాలు చేయడానికి తెలుగు హీరోలే చాలా మంది వున్నప్పుడు అలాంటి వాటిని తెచ్చి ఇక్కడి వారిని మెప్పించాలని చూడడం వృధా ప్రయాస.
నాటకాలు వేసుకునే హీరో లేడీ గెటప్ వేయడానికి విదేశీ మేకప్ ఆర్టిస్టులని రప్పించుకుంటాడు. తర్వాత హీరోయిన్‌ని మెప్పించడానికి ఆకాశం మొత్తం కాంతులతో, బెలూన్స్‌తో నింపేస్తాడు. ఆడవాళ్లతో మాట్లాడ్డానికే తడబడతాడంటూ పరిచయం చేసిన హీరో ఒక్కసారిగా 'ఎంబిబిఎస్' చదివిన హీరోయిన్‌నే తన మాటలతో మాయ చేసేస్తాడు. డాక్టర్ అయిన హీరోయిన్ తనకోసం పది బుడగలు ఎగరేసి, రెండు మాటలు చెప్పి, నాలుగు ఈలలు వేసిన వాడు ఎవడూ, ఏంటీ, ఏం చేస్తుంటాడు అనేది చూడకుండా గుడ్డిగా ప్రేమించేస్తుంది. అతని కోసం ఎంగేజ్‌మెంట్ కాన్సిల్ చేసుకుని, తల్లిదండ్రులని వదిలేసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తుంది. తాము ఇంత బేలగా, తింగరిగా వుంటేనే అబ్బాయిలు ఇష్టపడతారేమో అని అమ్మాయిలు… అమ్మాయిలంతా తింగరబుచ్చిలే, కన్‌ఫ్యూజ్ చేసేసి వెంట తిప్పుకోవచ్చు అని అబ్బాయిలు ఫిక్స్ అయిపోయేలా ఈ డైరెక్టర్లు భావితరాన్ని హిప్నటైజ్ చేసి పారేస్తున్నారు.
అన్ని సినిమాల్లో ఇలాంటివి కామనే అయినప్పుడు ఈ అనువాద చిత్రాన్ని మాత్రం అలుసుగా తీసుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని మీకు అనిపించవచ్చు. నిజమే… మన హీరోలున్నప్పుడు, మన సినిమాలైనప్పుడు ఇలాంటివి పెద్దగా పట్టించుకోం కానీ, పక్క రాష్ట్రం నుంచి ఇక్కడ పాగా వేయాలని చూస్తే, ఇలాంటి రొటీన్ యవ్వారాలకి ఇక్కడ జాగా లేదని చెప్పడానికి తప్పకుండా ఇలాంటివన్నీ ఎత్తి చూపిస్తాం. అనువాద చిత్రాలని ఆదరించే పెద్ద మనసు భారతదేశంలో తెలుగువారికి వున్నంతగా ఇంకెవరికీ లేదనేది నిజం. కాకపోతే చూడ తగ్గ విషయం వుంటే బిచ్చగాడినైనా చూస్తాం కానీ లేదంటే బిలియనీర్ జాగ్వార్‌లనీ పక్కకి పొమ్మనేస్తాం. తెలుగు మార్కెట్‌లోకి ఎంటర్ అవుదామని చూసే హీరోలంతా ఈ పాయింట్లు అండర్‌లైన్ చేసుకోవాలి మరి.
కీర్తి సురేష్ మరోసారి తన అందంతో, నటనతో మెప్పించింది. శివ కార్తికేయన్‌కి అలవాటు పడడానికి కాస్త టైమ్ పడుతుంది. అయినప్పటికీ అతను అక్కడ అంత పెద్ద స్టార్ ఎలా అయిపోయాడనేది పజిల్‌గానే మిగిలిపోతుంది. రొటీన్ సినిమానే కానీ రెమో కాలక్షేపానికి బాగానే పనికొస్తుంది. కాకపోతే డబ్బులు పెట్టి ఆస్వాదించే వినోదంగా కంటే ఇంట్లో ఫ్రీగా చూసే వీలున్నప్పుడు ఈ వినోదంతో ఎక్కువ కాలక్షేపమవుతుంది.
బాటమ్ లైన్: రొటీన్ 'రెమో'న్స్!
– గణేష్ రావూరి