బాలీవుడ్ లో ఇప్పటికే బోలెడన్ని బయోపిక్స్ వచ్చాయి. క్రికెటర్ల, సినిమా వాళ్ల జీవితాల ఆధారంగా ఆ సినిమాలు రూపొందాయి. అయితే వాటిల్లో వాస్తవాలు చూపినది తక్కువ, వాటిల్లో చూపినవన్నీ వాస్తవాలూ కాదు… అన్నట్టుగా సాగుతోంది పరిస్థితి. ఆయా వ్యక్తుల జీవితాల్లో వివాదాస్పద అంశాల గురించి అయితే ఏ సినిమాలోనూ సూటిగా స్పష్టంగా చూపలేదు.
సదరు సెలబ్రిటీల జీవితాల్లోని చీకటి అధ్యాయాలను, రసవత్తర అంకాలను, వారి వ్యక్తిత్వాన్ని వెల్లడించే అంశాలను.. హైడ్ చేసి సదరు సినిమాలను తీశారు.
ఈ పరంపరలో ఇప్పుడు సంజయ్ దత్ బయోపిక్ రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ సినిమాలో మాధురీదీక్షిత్ ప్రస్తావన ఉంటుందనేది. ఆ పాత్రను సోనమ్ కపూర్ చేయబోతోందట.
మాధురి సంజయ్ కు కేవలం సహచరనటి మాత్రమే కాదు… ఒక దశలో మాధురి ప్రేమలో దత్ సేదతీరాడు. టాడా కేసులో తొలి సారి జైలుకు వెళ్లే సమయానికి మాధురి ప్రేమలో సేదతీరుతుండేవాడు దత్. ఆ తర్వాత ఎన్నో జరిగాయి.. దత్- మాధురిలు వేరయ్యారు. మాధురి వివాహం చేసుకుంది. దత్ జైళ్లు, కోర్టులు చుట్టూ తిరుగుతూ ఖాళీ సమయాల్లో సినిమాలు చేస్తూ గడిపేశాడు. చివరకు మరో వివాహం చేసుకున్నాడు.
మరి మాధురి-దత్ ల మధ్య ప్రేమ కథలోని లోతులేంటి? అనేది దత్ జీవిత కథా సినిమాలో చూపుతారా? అనేది ప్రశ్నార్థకమే! సినిమా వస్తేగానీ అసలు కథ తెలీదు.