కరెన్సీ మాయ: నలుపు – తెలుపు మాటల వెనుక.!

దేశంలో కరెన్సీ సంక్షోభం నెలకొంది. దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. చిన్న వ్యాపారాలు దాదాపుగా చితికిపోయాయి. పెద్ద వ్యాపారాలు సైతం మనుగడ…

దేశంలో కరెన్సీ సంక్షోభం నెలకొంది. దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. చిన్న వ్యాపారాలు దాదాపుగా చితికిపోయాయి. పెద్ద వ్యాపారాలు సైతం మనుగడ సాధించలేని పరిస్థితి. కరెన్సీ కొరత.. మరీ ముఖ్యంగా చిల్లర కొరత జన జీవనాన్ని అస్తవ్యస్థం చేసిపారేస్తోంది. నల్లధనం వెలికి వస్తుందా.? లేదా.? అన్నది వేరే విషయం. ప్రస్తుతానికైతే, దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్తోందన్నది నిర్వివాదాంశం. 

ఈ పరిస్థితుల్లో, నల్లధనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా అందరూ చెప్పుకునే సినీ పరిశ్రమ నుంచి 'పెద్ద నోట్ల రద్దుపై' వస్తున్న ప్రకటనలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. సినీ పరిశ్రమ అంటే ఇక్కడ టాలీవుడ్‌ అనో, కోలీవుడ్‌ అనో, బాలీవుడ్‌ అనో కాదు.. మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమ. టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గర టిక్కెట్లు తెగని పరిస్థితి నెలకొందిప్పుడు. కారణం కరెన్సీ సంక్షోభమే. అయినాసరే, సినీ పరిశ్రమ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? 

పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ, ముందుగానే తమ స్నేహితులకు సమాచారం అందించారనే విమర్శ ఒకటుంది. దానికి బలం చేకూర్చుతూ బీజేపీకి చెందిన నేతలే కొందరు నోరు జారేశారు. అంటే, పెద్ద నోట్ల రద్దుపై అధికారిక నిర్ణయానికి ముందే చాలావరకు బ్లాక్‌ మనీ వైట్‌ మనీగా మారిపోయిందన్నమాట. ఆ సమాచారం బహుశా సినీ పరిశ్రమకు కూడా ముందుగా అందేసి ఉండదేమో, లేదంటే తనను కీర్తించేవారికి పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా ప్రధాని నరేంద్రమోడీ వెసులుబాటు కల్పించడమో చేసి వుండాలన్న విమర్శలు తాజాగా వెల్లువెత్తుతున్నాయి. 

లేకపోతే, పెద్ద నోట్ల రద్దుతో అతి పెద్ద దెబ్బ సినీ పరిశ్రమకే తగిలింది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా పదిహేను రోజులుగా థియేటర్లకు జనాల్లేక నానా కష్టాలూ ఎదురవుతున్నాయి. ఒక్కరోజు సినిమా షూటింగ్‌ ఆగిపోతే, ఆ సినిమాకి కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఓ సినిమా పోస్ట్‌ పోన్‌ అయ్యిందంటే వచ్చే నష్టం ఊహించనలవిగా వుంటుంది. కానీ, సినీ పరిశ్రమ మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తోందంటే తెరవెనుక ఏదో జరిగి వుండాలి. అదేంటి… నలుపు – తెలుపు – నలుపు మాటల వెనుక 'మాయ' ఏమిటి.? ఏమిటీ, సినీ 'నమో' జపం.! అంతా ఆశ్చర్యంగా వుంది కదూ.! అదే కరెన్సీ మాయ.