భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్ష పదవి నుంచి తప్పించాకా.. బండి సంజయ్ కు కేంద్రంలో మంత్రి పదవి దక్కబోతోందనే ప్రచారం ఒకటి జరిగింది.
తెలంగాణలో బీజేపీని ఇన్నాళ్లూ ఉనికిలో నిలిపిన బండి సంజయ్ ను ఆ పదవి నుంచి అధిష్టానం తప్పించింది. ప్రత్యేకించి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తమ వ్యూహాలను మార్చుకోవడంలో భాగంగా బీజేపీ బండి సంజయ్ ను తప్పించినట్టుగా వార్తలు వచ్చాయి. బండి మార్కు రాజకీయం తెలంగాణలో వర్కవుట్ కాదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టుగా విశ్లేషణలు వినిపించాయి.
తెలంగాణలో బీజేపీని బండి సంజయ్ ఎంతో కొంత బలోపేతం చేసినా, ఆయనతో ఇంతకు మించి సాధ్యం కాదని బీజేపీ హైకమాండ్ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే సంజయ్ కు అంతకు మించి పెద్ద బాధ్యతలు దక్కుతాయని, ఆయనను కేంద్రంలో సహాయమంత్రిగా తీసుకోవడం ఖాయమనే ప్రచారం కూడా ఆ సమయంలోనే జరిగింది.
అయితే ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇప్పుడు బండి సంజయ్ కోసం ప్రత్యేకంగా కేంద్రమంత్రి వర్గంలో మార్పుచేర్పులు చేయలేమనుకున్నారో.. ఏమో కానీ, ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా చేసింది బీజేపీ అధిష్టానం.
ఈ మేరకు సంజయ్ కు ఒక పదవిని ఇచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీకి చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షుల్లో ఒకరిగా చేశారు. దీంతో బండి సంజయ్ కు దక్కింది గట్టి ప్రమోషన్ అని చెప్పుకునేందుకు కూడా అస్కారం లేకుండా పోయింది. మరి కేంద్రమంత్రి అవుతారనే ప్రచారం పొందిన బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నిలవడమే ప్రస్తుతానికి దక్కిన హోదా!