యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా వస్తుందంటే.. ప్లానింగ్ అస్తవ్యస్థంగా ఉంటుందనే విషయం చాలామందికి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ను అడిగితే ఈ విషయం ఇంకా బాగా చెబుతారు. ఈ బ్యానర్ పై వస్తున్న తాజా చిత్రంపై కూడా ఇలాంటి గందరగోళమే నడుస్తోంది.
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రచారాన్ని ఆర్భాటంగా స్టార్ట్ చేశారు. ఆ వెంటనే కొన్ని సాంగ్స్ రిలీజ్ చేశారు. అదే టైమ్ లో ఆగస్ట్ 4 రిలీజ్ అంటూ గ్రాండ్ గా ప్రకటించారు.
ఓవైపు ఇంత హంగామా నడుస్తున్నప్పటికీ, మరోవైపు ప్రేక్షకుల్లో మాత్రం ఏదో మూల అనుమానం కొడుతూనే ఉంది. ఎందుకంటే, అక్కడున్నది యూవీ క్రియేషన్స్ బ్యానర్. వాళ్ల అనుమానమే ఇప్పుడు నిజమైంది. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా వాయిదా పడింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడం వల్ల 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో పాటు, ట్రయిలర్ రిలీజ్ డేట్ ను త్వరలోనే వెల్లడిస్తామంటూ చావుకబురు చల్లగా చెప్పింది.
అయితే దీనిపై నెటిజన్లు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. ఇలాంటి ప్రకటన ఏదో వస్తుందని తమకు ముందే తెలుసంటూ తెగ పోస్టులు పడుతున్నాయి. ప్రచారంతో పాటు, పోస్ట్ పోన్ పోస్టర్ కూడా రెడీ చేసుకుంటారా అంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆజ్యం పోస్తున్నారు.
నిజానికి ఇలాంటిదేదో జరుగబోతోందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర 3 రోజుల కిందటే వెల్లడించింది. అదే ఇప్పుడు అధికారికంగా వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఆగస్ట్ 18 తేదీ కోసం నిర్మాతలు వర్కవుట్ చేస్తున్నారు.