మళ్లీ బతికించింది తాగడానికా.. ఏంటి ‘బ్రో’ ఇది?

ఇది బ్రో కథ.. ఓపెన్ చేస్తే, హీరో చాలా పద్ధతిగా ఉంటాడు. ఉదయాన్నే జిమ్, యోగా చేస్తాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్యం చెక్ చేసుకుంటాడు. టైమ్ కు తింటాడు. పెర్ ఫెక్ట్ గా ఆఫీస్ కు…

ఇది బ్రో కథ.. ఓపెన్ చేస్తే, హీరో చాలా పద్ధతిగా ఉంటాడు. ఉదయాన్నే జిమ్, యోగా చేస్తాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్యం చెక్ చేసుకుంటాడు. టైమ్ కు తింటాడు. పెర్ ఫెక్ట్ గా ఆఫీస్ కు చేరుకుంటాడు. ఎంజాయ్ చేయడానికి అతడికి టైమ్ ఉండదు. ప్రేయసి లిప్ స్టిక్ కూడా టేస్ట్ చేసేంత టైమ్ లేదు అతడికి.

ఇది మేం చెప్పింది కాదు, బ్రో సినిమాలో హీరో పాత్రను ఇలానే చూపించారు. కట్ చేస్తే, అతడు చనిపోతాడు. కలిపురుషుడి చలవతో తిరిగి బతుకుతాడు. అలా మళ్లీ భూమ్మీదకు వచ్చిన హీరో ఏం చేస్తాడు?

బతకడానికి సెకెండ్ ఛాన్స్ అందుకున్న హీరో ఆ తర్వాత ఏం చేశాడన్నది మేకర్స్ డీటెయిల్డ్ గా చూపించారు. అయితే ఈ క్రమంలో అతడ్ని వీరతాగుబోతుగా చూపించడం విడ్డూరం. నిజానికి రెండోసారి బతికిన వ్యక్తి ఎవరైనా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాడు, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటాడు.

కానీ ఆశ్చర్యంగా బ్రో సినిమాలో లైఫ్ లైన్ అందుకున్న హీరో, సినిమాలో చాలా భాగం బార్ లోనే కనిపిస్తాడు. మందు కొడతాడు. ఐటెం భామతో చిందులేస్తాడు. అలా ఒకట్రెండు సన్నివేశాలు కాదు, తాగడానికే హీరో మళ్లీ పుట్టాడనిపించేలా మద్యం సన్నివేశాల్ని పెట్టారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

లైఫ్ ను బతకడం అంటే ఇదేనా..? మందు కొట్టి పబ్బుల్లో చిందులేస్తే జీవితాన్ని ఆస్వాదించినట్టా..? ఈ క్షణాన్ని ఆస్వాదించమంటూ సందేశం ఇచ్చింది మందు కొట్టడానికా..? ఇదెక్కడి పైత్యం అంటూ లెక్కలేనన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

వినోదాయం శితంలో మళ్లీ బతికిన హీరో తన కుటుంబాన్ని చక్కదిద్దుతాడు. కుటుంబం ప్రేమ పొందుతాడు, ఆఫీస్ లో మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అప్పటికే చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాడు. ఇందులో ఏదీ శృతిమించినట్టు కనిపించదు. అదే వినోదాయశితం రీమేక్/రీమిక్స్ గా వచ్చిన బ్రో సినిమా చూస్తే, అన్నీ తప్పులే కనిపిస్తాయి.

మళ్లీ బతికి భూమ్మీదకొచ్చిన హీరో తాగితందనాలాడతాడు. తనను తాను సంస్కరించుకోవడం సంగతి అటుంచి, ఇంకా గందరగోళంలోనే బతుకుతాడు. ఈ గందరగోళాన్ని, మద్యం ఎపిసోడ్లను సుదీర్ఘంగా చూపించిన మేకర్స్.. అసలైన సందేశాన్ని హడావుడిగా ఆఖరి నిమిషంలో చెప్పి, సినిమా అయిందనిపించారు.