రైలు ప్రమాదం.. ఈ పేరు చెబితే ఉలిక్కిపడాల్సిందే ఎవరైనా. సామాన్యుడికి అతి చవకైన ప్రయాణం లభించేది ఈ రైలులోనే. అఫ్కోర్స్, విమాన ధరలతో పోటీ పడే, అతి ఖరీదైన ప్రయాణాల్నీ మన రైల్వే శాఖ అందిస్తోందనుకోండి.. అది వేరే విషయం. మన దేశంలో రైళ్ళ వేగం పెంచడం కోసం ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి.
రైలు ప్రమాదాలకు ముఖ్యమైన కారణం అతి వేగం అని అనలేం. ఎందుకంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో బుల్లెట్ రైళ్ళు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. అక్కడ ప్రమాదాలు చాలా చాలా అరుదు. కానీ, మన దేశంలో సగటున 100 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించని రైళ్ళు అతి ఘోరమైన ప్రమాదాల్ని చవిచూస్తున్నాయి. ఎందుకిలా.? అంటే, సింపుల్గా వచ్చే సమాధానాల్లో మొదటిది మానవ తప్పిదం, రెండోది నిర్వహణా లోపం.
మానవ తప్పిదాలు అరుదుగానే జరిగినా, నిర్వహణా లోపాలు మాత్రం సర్వసాధారణమైపోయాయి. గతంతో పోల్చితే ఇప్పుడు రైలు ప్రమాదాలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, బుల్లెట్ రైలు కోసం పరుగులు పెడుతున్న భారతావని, రైలు ప్రమాదాల పరంగా పూర్తి భద్రతను సంతరించుకోవాల్సి వుంది. ప్రయాణీకులకు 100 కిలోమీటర్ల వేగంలోనే భద్రత ఇవ్వలేని భారత రైల్వే శాఖ, 200 కిలోమీటర్లో, 300 కిలోమీటర్లో వేగంతో ప్రయాణించే రైళ్ళను తీసుకొస్తే ఇంకేమన్నా వుందా.?
తాజాగా, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్న దరిమిలా, మృతుల సంఖ్య భారీగానే వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా, ఇప్పుడే మనకి బుల్లెట్ రైలు అవసరమా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఖచ్చితంగా అవసరమే.. కానీ, అంతకన్నా ముందు, రైల్వే శాఖలో ప్రక్షాళన తప్పనిసరి.
ఇదివరకట్లో అయితే, రైలు ప్రమాదం జరిగిందంటే చాలు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖమంత్రి రాజీనామా డిమాండ్ తెరపైకొచ్చేది.. కొందరు నైతిక విలువలు పాటించి, రాజీనామాలు కూడా చేసేవారనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లేవు.
కొత్తగా మన దేశంలో బుల్లెట్ ట్రైన్ కోసం వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు చేయతలపెట్టింది నరేంద్రమోడీ సర్కార్. ఇంత ఖర్చు చేసి, భద్రత లేకపోతే ఎలా.? అన్న అనుమానాలు తలెత్తడం సహజమే. పైగా, అంత ఖర్చు చేసినప్పుడు వాటి నిర్వహణ కోసం ఇంకా ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. ఆ ఖర్చులనుంచి రైల్వే శాఖ గట్టెక్కాలంటే టిక్కెట్ ధర కూడా భారీగానే వుండాలి. తద్వారా సామాన్యుడికి రైలు ప్రయాణం గగనమైపోతుంది. కేవలం బలిసినోడికి మాత్రమేనన్నమాట ఈ బుల్లెట్ ట్రైన్. అభివృద్ధి చెందిన మన దేశంలో ఇదంతా అవసరమా.? అన్న అనుమానాలు ఆర్థిక నిపుణుల నుంచే వ్యక్తమవుతుండడం గమనార్హం.
రైలు పట్టాలు తప్పడం, రైలు తగలబడటం, రైళ్ళు ఢీకొనడం.. వంటివాటికి తావులేకుండా ముందే చేయగలిగితే, ఆ తర్వాత హై స్పీడ్, బుల్లెట్.. ఇంకేదన్నా ప్రయోగం రైల్వే శాఖలో చేయొచ్చుగాక.!