నవంబర్ 8, 2016 ….
భారత దేశం మలి సంధ్య నుంచి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక హఠాత్ పరిణామం. గౌ. ప్రధాన మంత్రి జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ నల్ల ధనం పై యుద్ధం ప్రకటించి 500 , 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. మధ్య తరగతి, సామాన్య ప్రజానీకం ఒకింత సంభ్రమాశ్చర్యాలు లోనవుతూ, ఈ నిర్ణయాన్ని మనస్పూర్తి గా ఆహ్వానిస్తూ నిద్రకు ఉపక్రమించారు.
2 వ రోజు నుంచి – ఇప్పటివరకు
పత్రికలలో , టీ. వీలలో మరింత సమాచారమొచ్చింది. బ్యాంకులకు ఒక రోజు సెలవు ప్రకంటించి, శని , ఆది వారాలు పని చేయంచి అంతా సవ్యంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 100 , 2000 నోట్లను అందరికి అందు బాటులో ఉంచి దైనందిన కలాపాలకు విఘాతం కలిగించమంటూ, పాత నోట్ల స్వీకరణకు , కొత్త నోట్ల తీసుకోవడానికి కొన్ని ( చాలా??) షరతులు విధించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఒక మార్పు కొంచెం అసౌకర్యంగా వున్నా మంచి భవిష్యత్తు కోసం అనుకుంటూనే పది రోజులు గడిపేసాము, ఇబ్బందులు తగ్గక పోగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
ఒక్కసారిగా , రహస్యమనో, సంచలనమనో 86 % చలామణి లో వున్న ద్రవ్యాన్ని రద్దు చేయటంతో అనుకున్నవి , అనుకోనివి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎటిఎం లలో కొత్త నోట్ల పరిమాణం సరిపడక పోవడం వలన, 100 నోట్లు తగినన్ని అందు బాటులో లేక పోవడంవలన యావత్తు దేశానికి బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లే దిక్కయ్యాయి. నల్ల ధనం మీద అనుకున్న యుద్ధం సామాన్యునికి శరాఘాతం అయ్యింది.
చర్య – ప్రతి చర్య:
న్యూటన్ 3 వ సిద్ధాంతాన్ని బాగా అనుకరించే మన రాజకీయ పార్టీలు సామాన్యుల వెతలే వేదికగా ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటిఁచి ప్రతిచర్యకు ఉపక్రమించాయి. తృణమూల్, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, సమాజ వాది పార్టీలు, బీజేపీ మిత్ర పక్షమైన శివ సేన ఒక త్రాటి మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నాయి.
ప్రజలు అసౌకర్యం, ప్రభుత్వ అసంపూర్తి ప్రణాళికలు ఒక వరంగా మారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కావలసినంత బలం ప్రతిపక్షాలకి వచ్చింది. సరిగ్గా ఇక్కడే బీజేపీ, మోడీ కొంచెం ఆత్మ రక్షణ లో పడ్డారు.
ప్రధాని మోడీ ప్రసంగాలలో ఈ అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోంది. నల్ల ధనం మాటెలా వున్నా ప్రజలు అసంతృప్తి చాప కింద నీరులా మారి బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ఏకమైతే పరిస్థితి ఏమిటి? రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయం పురికొల్పుతుందా ? ప్రతిపక్షాలు ఏకమవడానికి మనమే ఒక సువర్ణ అవకాశమిచ్చామా ? అన్న ప్రశ్నలు బీజేపీ మదిలో ఏకధాటిగా ఆవిష్కృతమవుతున్నాయి.
క్రమంగా ఐక్యమవుతున్న ప్రతిపక్షాలని కట్టడి చేయడానికి బీజేపీ కి ఇప్పుడు తటస్థ రాష్ట్రాల మద్దతు చాలా అవసరం. ఉత్తర భారతదేశం లోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం, ఢిల్లీ, పశ్చిమ బంగా వంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు బహిరంగంగా సవాలు విసరడంతో ఇప్పుడు బీజేపీకి దక్షిణ భారత ముఖ్యమంత్రుల మద్దతు అనివార్యమయంది.
రాజనీతిజ్ఞత – వ్యక్తి ప్రతిష్ట
దక్షిణభారతంలోని ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రమవడం వలన, కేరళ కమ్యూనిస్ట్ పాలనా లో ఉండటంవలన ప్రభుత్వ నిర్ణయానికి. వ్యతిరేకం. తమిళనాడు లో జయలలిత ఆరోగ్య రీత్యా విధాన నిర్ణయాల్లో ఆలస్యము సహజం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు మోడీకి, బీజేపీ కి చాలా ముఖ్యము. ఈ రాష్ట్రాలు కనుక బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఊపిరి అందదు.
దీన్ని ముందుగానే ఊహించే దార్శనికత గల తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహత్క మౌనం వహిస్తూనే గవర్నర్ ని కలిసి తన అసంతృప్తిని వెల్లడించి కేంద్రానికి ఒక సందేశం పంపారు. అదే సమయములో అయన ప్రతిపక్షాలకి అవకాశమివ్వకుండా తటస్థ వైఖరి అవలంభించారు. ఇటువంటి మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలిసిన ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రధాని ప్రకటన వెలువడగానే క్షణాల్లో ఆ నిర్ణయాన్ని తానే ప్రభావితం చేసినట్టుగా, అనుకోకుండా వచ్చే ప్రతిష్టలో భాగస్వామిని కాకపోతాననే అభద్రతాభావం తో ఎవరు అడక్కుండా, మన రాష్ట్రము మీద పడే భారాన్ని సైతం అంచనా వెయ్యకుండా షరతుల్లేని మద్దతు ఇచ్చేసారు.
భవిష్యత్తు పరిణామాలు:
సహజముగానే తటస్థ మిత్రుల కోసం పరితపిస్తన్న బీజేపీ, కెసిఆర్ మెప్పు కోసం ఆయనని ఢిల్లీ ఆహ్వానించారు . కార్యసాధకుడైన కెసిఆర్ ఇటువంటి అందివచ్చిన అవకాశాన్ని 100% ఉపయోగించుకొని రాష్ట్రానికి కావాల్సింది సాధించుకుంటారు. మరి కొన్నిరోజుల్లో తెలంగాణ కి ఒక ఐఐఎం, పవర్ ప్లాంట్ అనుమతులు, కావల్సిన డ్రై పోర్ట్ తో పటు ఒక ప్యాకేజి…ఇవి కాకుండా హైదరాబాద్ మీద సర్వ హక్కులని వదులుకొనే దిశగా ఆంధ్ర ప్రభుత్వము నుంచి సచివాలయ, అసెంబ్లీ భవనాల పై ఒక సానుకూల ప్రకటన ….ఇవన్నీ ఊహాజనితమైనా, ఇటువంటి ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు.
ఇదీ వ్యూహం … ఇదీ రాజనీతిజ్ఞత …
కేంద్రం చేయవల్సింది చాలా వుండి ప్రత్యేక హోదా మాయమై, ఎటుంవంటి ప్రాముఖ్యత లేని పాకేజీ నే మహా భాగ్యం అనుకుని మరల దానికి చట్టబద్ధత కోసం చట్ట సభ లో ఉపన్యాసాలు ఇచ్చి దాని సాధించటమే ఆంధ్ర ప్రజల భాగ్య రేఖ అనిపించేలా అభినయాల నడుమ ,మనకి కావలిసినవి సాధించుకునే ఒక మహత్తరమైన అవకాశాన్ని చేజేతులా వదిలేసుకున్న నాయకత్వాన్ని ఏమనాలి?? కొంచెం వ్యూహాత్మకంగా ,సంయమనం పాటించి ఉంటే మోడీ నుంచి మనకి కావాల్సనివి సాధించుకునే సువర్ణ అవకాశం ఉండేది. సర్వం నేనే, నేనే సర్వం అని భావించే ప్రధాని ఈ పరిస్థితుల్లో తనకి మద్దతు ఇచ్చే వారి కోసం ఎమి చేయటానికైనా సిద్ధం. మరి ఇటువంటి పరిస్థితుత్లో కాక మరి ఎప్పుడు మన రాష్ట్ర అవకాశాలు తీర్చుకొనేది?
“Leadership is better measured in crisis”, నాయకత్వం సంక్షోభం లో బాగా పరిగణించ బడుతుంది. ఇటువంటి అవకాశాన్ని కెసిఆర్ సమర్ధవంతం గా ఉపయోగించుకుంటే , బాబు తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడటం గర్హనీయం . సంక్షోభం లో అవకాశాన్ని వదిలేసుకొని, చట్టబద్ధత దేహీ అంటూ ఢిల్లీ వయపు చూడటం ఏ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం??
ఇటువంటి నిర్ణయాత్మక సమయములో ఇదేనా ఒక దగాపడిన జాతి ఆశించేది??
ఇది ఒక వైఫల్యం ..ఒక వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రాకులాట …
నేను ఏ పార్టీ కి చెందినవాడిని కాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం . రాజధాని కూడా లేని రాష్ట్రానికి కావాల్సిన అన్యాయం జరిగిపోయింది …ఇక నుంచి మనము వదులుకునే ఒక్కొక్క అవకాశము,కొన్ని దశాబ్దాలు పూడ్చలేని నష్టంతో సమానము.
Murali Mohan
[email protected]