పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. వార్తా పత్రికల్లో, టెలివిజన్ ఛానెళ్లలో సింహ భాగం వార్తలు, కథనాలు నోట్ల రద్దు గురించే. ఈ కథనాలు చదువుతుంటే, చూస్తుంటే బాబోయ్ ఇన్ని కష్టాలా? అని హృదయం ద్రవించి పోతోంది కూడా.
ఈ కథనాల్లో, వార్తల్లో నిజాలతో పాటు కొన్ని అతిశయోక్తులూ ఉన్నాయి. సోషల్ మీడియాలో, ఇతరత్రా అతి ప్రచారం కూడా జరుగుతోంది. ఫలితంగా సామాన్య ప్రజల్లో భయాలు ఎక్కువయ్యాయి. నోట్ల రద్దు ప్రహసనంలో ఇదో కోణం.
మరో కోణం నుంచి చూస్తే కొంత మంచి కనబడుతోందని కొందరు సంతోషిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు లేకపోవడంతో గత వారం రోజుల్లో విచ్చలవిడి ఖర్చు బాగా తగ్గింది. విందులు చిందులు, విలాసాలు కులాసాలు తగ్గిపోయాయి. హైదరాబాద్‌తో సహా పలు పట్టణాలు, నగరాల్లో విలాసాలకు బ్రేక్ పడింది.
ప్రధానంగా హైదరాబాదువంటి నగరాల్లో యువత విచ్చలవిడిగా మందు కొట్టేసి నిర్లక్ష్యంగా, రాష్‌గా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు తద్వారా మరణాలకు కారకులవుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా చిన్నారి రమ్య, ఆమె బంధువులు కొందరు యువకులు చేసిన యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు.
ఆర్థిక సంస్కరణల అమలు తరువాత మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఇబ్బడిముబ్బడిగా డబ్బు పెరిగిపోవడం, అన్ని రకాల సంపన్నవర్గాల్లో నల్లధనం పోగుపడటంతో విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బంటే లెక్కలేకుండాపోయింది. పుట్టినరోజు మొదలుకొని వివాహాల వరకు అత్యంత భారీగా నిర్వహించడం అలవాటైపోయింది.
గత వారం రోజుల్లో మద్యం వ్యాపారం సగానికి పైగా పడిపోవడంతో తాగుబోతుల కుటుంబాలు సంతోషిస్తున్నాయి. తమ వ్యాపారం పడిపోయిందని, దారుణంగా దెబ్బ తిన్నామని మద్యం వ్యాపారులు, అమ్మకందారులు ఆవేదన చెందుతున్నారు. వారి వ్యాపారం దెబ్బ తినడం ఎలా ఉన్నప్పటికీ తాగుబోతులు కంట్రోల్లో ఉన్నారు. వారికి ఇంటి అవసరాలు గుర్తొస్తున్నాయి. నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటే అదే పది వేలు అనుకునే పరిస్థితి ఏర్పడింది.
ఉద్యోగుల్లోనూ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారు ప్రత్యేకం. వీరి జీవనశైలే వేరుగా ఉంటుంది. వారికి జీతాలు ఎక్కువ కావడంతో వారాంతంలో క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, మల్టీఫ్లెక్సులు, మాల్స్…ఇలాంటివాటిల్లో కులాసాగా విలాసంగా గడుపుతుంటారు. ఇప్పుడు డబ్బు లేకపోవడంతో నేల మీద ఉంటున్నారు.
ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం…గత వారం రోజుల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ఫిర్యాదులు బాగా తగ్గిపోయాయి. నోట్ల రద్దుకు ముందు ఏసీబీకి రోజుకు సగటున 15 నుంచి 20 ఫిర్యాదులు అందేవి. నోట్లు రద్దయినప్పటినుంచి మూడు నుంచి ఐదు ఫిర్యాదులకు మించి రావడంలేదు. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి లంచాలు ఇచ్చే పరిస్థితి లేదు. లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు బాగా తగ్గాయని ఏసీబీకి చెందిన ఓ అధికారి చెప్పారు. కొందరు 500, 1000 నోట్లు లంచంగా ఇస్తామని చెబుతున్నా సిబ్బంది తీసుకోవడంలేదు. లంచం వంద రూపాయల నోట్లుగా ఇవ్వాలని లేదా విలువైన బహుమతుల రూపంలో ఇవ్వాలని కోరుతున్నారట…!
ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది లంచాలు తీసుకోకుండా నీతిమంతులైపోయారని అనుకోలేం. కాకపోతే ఇచ్చేందుకు ప్రజల దగ్గర డబ్బులేదు. కాలం చెల్లిన నోట్లు తీసుకొని తిప్పలు పడటమెందుకని లంచగొండులు వెనకంజ వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఎక్కువకాలం ఉండదని, కొత్త నోట్లు విస్తృతంగా చెలామణిలోకొచ్చిన తరువాత లంచాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారి చెప్పారు.
ఇదిలా ఉంటే, పెద్ద నోట్ల రద్దుతో రాజకీయ నాయకుల చేతులు కట్టేసినట్లయింది. వీరికి కూడా కాంట్రాక్టర్లు మొదలైనవారి నుంచి లంచాలు అంటే పర్సంటేజీలు అందడంలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులకు దిగులు పట్టుకుంది. ఈ రాష్ట్రంలో డిసెంబరు లేదా జనవరిలో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార పార్టీకి, ప్రధాన ప్రతిపక్షానికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచక తప్పదు. వెయ్యి, ఐదొందల నోట్లు రద్దయినా 500 నోట్లు వస్తున్నాయిగాని వెయ్యి నోట్లు బందైపోయాయి. దానికి బదులు రెండు వేల నోట్లు వచ్చాయి. దీంతో నాయకులు దిగులు పడుతున్నారు.
ఓటర్లు రెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అడిగినంత ఇవ్వకుంటే ఓట్లు వేయరని నాయకులు భయపడుతున్నారు. ఏది ఏమైనా పెద్ద నోట్ల రద్దు దేశానికి కుదుపే కాదు, విచ్చలవిడితనానికి అదుపు కూడా అని చెప్పొచ్చు.