కడప జిల్లా పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనమరుగైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా, దాని పొరుగునే జమ్మలమడుగు ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాలో టీడీపీ తీవ్ర కుదుపునకు లోనైంది.
వైఎస్ కుటుంబంపై 1999 నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ పులివెందుల అసెంబ్లీకి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ నేత ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో యధావిధిగానే జగన్ చేతిలో సతీష్‌రెడ్డి ఓడిపోయారు.
పార్టీ తనకు అన్యాయం చేసిందనే అసంతృప్తితో సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అనాథ అయ్యింది. ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే టీడీపీ అనే మాటే ఎక్కడా వినిపించడం లేదు.
ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులనే వాళ్లే లేకుండా పోయారు. దీనికి చంద్రబాబు స్వీయ తప్పిదాలే కారణమని చెప్పక తప్పదు. మొదటి నుంచి టీడీపీకి రామసుబ్బారెడ్డి కుటుంబం అండగా ఉంటూ వస్తోంది. టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా …రామసుబ్బారెడ్డి కుటుంబం మాత్రం పార్టీ వెంటే నడిచింది.
అలాంటిది 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్ముకున్న రామసుబ్బారెడ్డి, ఆయన కుటుంబానికి న్యాయ చేయకపోగా, తీవ్ర అన్యాయం చేసింది. వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడంతో పాటు మంత్రి పదవి కట్టబెట్టి రామసుబ్బారెడ్డిని డమ్మీ చేశారు. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి, పి.రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి టీడీపీ బరిలో దింపింది. ఇద్దరు నాయకులు ఓడిపోయారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారాయి. రామసుబ్బారెడ్డి , ఆదినారాయణరెడ్డి ఒకరి తర్వాత మరొకరు టీడీపీకి రాజీనామా చేయడంతో పార్టీ దిక్కులేనిదైంది. రామసుబ్బారెడ్డి రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న వైసీపీలో చేరగా, ఆదినారాయణరెడ్డి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ బీటెక్ రవిని చంద్రబాబు నియమించారు. బీటెక్ రవి పలుకుబడి ఏంటో తెలుసుకోవాలంటే పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలంలోని ఆయన సొంతూరు కసనూరు వెళ్దాం.
కసనూరు పంచాయతీ ఓసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ పంచాయతీ పరిధిలోకి ముసల్‌రెడ్డిపల్లె అనే చిన్న గ్రామం కూడా వస్తుంది. ఈ పంచాయతీలో 1300 ఓట్లు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో రవి కుటుంబం నిలబడకుండా, ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన మహిళను బరిలో నిలిపారు. 247 ఓట్ల తేడాతో వైసీపీ మద్దతుదారు అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
కనీసం స్వగ్రామంలో కూడా సత్తా చూపలేని నాయకుడికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారంటే… టీడీపీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే ….ఈ రెండు నియోజకవర్గాల్లో కనీసం ఒక్క చోట కూడా టీడీపీ తరపున పోటీ చేసేవాళ్లే లేరంటే ఆశ్చర్యం కలగక మానదు. పులివెందుల మున్సిపాలిటీలో 33కు 33 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ తరపున అభ్యర్థులను నిలిపి పరువు కాపాడుకున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగులో మున్సిపాల్టీలో వైసీపీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నదంటే, అది ఆదినారాయణరెడ్డి ఘనతే. జమ్మలమడుగులో 20 వార్డుల్లో 2 వార్డులను మాత్రమే వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులకు గాను కేవలం 9 చోట్ల మాత్రమే బీజేపీ అభ్యర్థులను బరిలో నిలపగలిగారు.
జమ్మలమడుగులో మాత్రం పోటీ నువ్వానేనా అన్నట్టుగా బీజేపీ-వైసీపీ మధ్య సాగుతోంది. మొత్తానికి తాత్కాలికంగా వైసీపీని దెబ్బ తీయాలనే అత్యుత్సాహంలో చంద్రబాబు సొంత పార్టీని కనమరుగు చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవ అంటే ఇదే కాబోలు.