బాలీవుడ్ హీరోయిన్ తాప్సి నివాసాలపై ఈరోజు ఐటీ దాడులు జరిగాయి. ఆమెకు సంబంధించిన కొన్ని ఆస్తులపై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాడులు నిర్వహించిందనే విషయం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ముంబయిలో తాప్సికి చెందిన రెండు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
పన్ను ఎగవేతకు సంబంధించి ఈరోజు ముంబయి, పూణెలో దాదాపు 20 నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ లిస్ట్ లో తాప్సితో పాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత మధు మంతెన కూడా ఉన్నారు. అనురాగ్ కశ్యప్ కు చెందిన ఫాంటమ్ ఫిలిమ్స్ లావాదేవీలకు సంబంధించి ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
ఇక ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్ మెంట్ కంపెనీ క్వాన్ పై కూడా దాడులు జరిగాయి. డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ విక్రమాదిత్య మోత్వానె, నిర్మాత వికాస్ బాల్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి.
రీసెంట్ గా హీరోయిన్ తాప్సి, దర్శకుడు అనురాగ్ కశ్యప్.. రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టం, పౌరసత్వం సవరణ చట్టంపై కాస్త ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో వీళ్ల నివాసాలు, ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.