సినిమా రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: ద్వారక క్రియేషన్స్‌ తారాగణం: నాగచైతన్య, మంజిమ మోహన్‌, బాబా సెహగల్‌, సతీష్‌ కృష్ణన్‌, డేనియల్‌ బాలాజీ తదితరులు సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ కూర్పు: ఆంటోనీ…

రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: ద్వారక క్రియేషన్స్‌
తారాగణం: నాగచైతన్య, మంజిమ మోహన్‌, బాబా సెహగల్‌, సతీష్‌ కృష్ణన్‌, డేనియల్‌ బాలాజీ తదితరులు
సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌
కూర్పు: ఆంటోనీ
ఛాయాగ్రహణం: డాన్‌ మెక్‌ఆర్థర్‌, డానీ రేమండ్‌, కధిర్‌
నిర్మాత: ఎం. రవీందర్‌ రెడ్డి
రచన, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌
విడుదల తేదీ: నవంబరు 11, 2016

అంతవరకు సరదాగా తిరుగుతోన్న ఒక కుర్రాడికి అసాధారణ కష్టమొచ్చింది. క్షణంలో మారిపోయిన తన జీవితాన్ని నిలుపుకోవడానికి అతను ఎదురు తిరుగుతాడు. మనిషిగా ఎదుగుతాడు. గౌతమ్‌ మీనన్‌ 'సాహసం శ్వాసగా సాగిపో' ఇతివృత్తం ఇదే. ఆ కుర్రాడికి ఎదురైన సమస్యని అక్కడే, అప్పుడే పరిష్కరించుకుని, అదే ఊపులో ముగించేసినట్టయితే గౌతమ్‌ మీనన్‌ ఎంచుకున్న కథకి తగ్గ ముగింపు ఇచ్చినట్టుండేది. కానీ గౌతమ్‌ దీనికో కమర్షియల్‌ సినిమా ముగింపునిచ్చాడు. ఆ ట్విస్టు వేరే కమర్షియల్‌ సినిమాల్లో చాలా సార్లు వాడేసినదే అయినా కానీ తన సినిమాలో వెరైటీగా అనిపిస్తుందని అనుకున్నాడో ఏమో కానీ తన సినిమాల్లో మనం ఊహించని ఒక ముగింపునిచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఒక విధంగా అదో సాహసం అనాలి. ఈ కథని అందాకా స్ట్రెచ్‌ చేయాల్సిన పని లేదు. అలాంటి ముగింపునివ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. 

సాహసం శ్వాసగా సాగిపో… ఆరోగ్యవంతుడి శ్వాసలా పర్‌ఫెక్ట్‌గా ఆడకుండా, హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్న పేషెంట్‌ శ్వాసలా పడీ, లేస్తుంటుంది! ఒక మంచి సీన్‌ వస్తే, దాని వెంట ఒక బోరింగ్‌ సీన్‌ వస్తూ… కాసేపు కదలకుండా కూర్చునేలా చేస్తే, ఆ తర్వాత కాసేపు అసహనంతో కదిలేట్టు చేస్తూ ఈ సినిమా గ్రాఫ్‌ అలా పడుతూ, లేస్తూ సాగుతుంటుంది. 

ఒక సగటు మధ్యతరగతి కుర్రాడి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమెని చూస్తూ గడిపేస్తోన్న అతడికి బైక్‌ మీద సౌత్‌ ఇండియా ట్రిప్‌ వెళ్లాలనే కోరిక. ఆ అమ్మాయి కూడా అతనితో పాటు వెళుతుంది. మూడు మాటలు, ఆరు పాటలు అన్నట్టు సాగిపోతోన్న వారి ప్రయాణంలో అనుకోని కుదుపు. యాక్సిడెంట్‌ అయి ఆ కుర్రాడు హాస్పిటల్‌ పాలవుతాడు. సాధారణ యాక్సిడెంటే అనుకుంటోన్న వారికి అదో మర్డర్‌ అటెంప్ట్‌ అని తెలుస్తుంది. ఆ అమ్మాయి చాలా పెద్ద ప్రమాదంలో ఉంటుంది. పోలీసులు, రౌడీలు కుమ్మక్కవుతారు. ఆ కుర్రాడే తనని కాపాడాలి. తప్పనిసరి పరిస్థితుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. కానీ వాళ్లనుంచి తప్పించుకోవడం అంత తేలికా?

లవ్‌స్టోరీగా మొదలై యాక్షన్‌ మోడ్‌లోకి టర్న్‌ అయ్యే ఈ కథ ఖచ్చితంగా మిగిలిన సినిమాలకంటే భిన్నంగా అనిపిస్తుంది. మధ్యమధ్యలో బోర్‌ కొట్టించినా, పాటలెక్కువయినట్టు అనిపించినా కానీ గౌతమ్‌ మీనన్‌ స్క్రీన్‌ప్లే-డైరెక్షన్‌, రెహమాన్‌ మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ అలా చెవులూ, కళ్లూ తెరకి అప్పగించేసేట్టు చేస్తాయి. స్వగతంలో మాట్లాడుకునే టిపికల్‌ గౌతమ్‌ మీనన్‌ 'హీరో' అప్పుడప్పుడూ తన అంతరంగాన్ని వివరిస్తూ నవ్విస్తాడు, విసిగిస్తాడు, ఆలోచింపచేస్తాడు. ప్రతి దానినీ సహజంగా ఉంచాలనే గౌతమ్‌ మీనన్‌ తపన రొమాన్స్‌లోనే కాదు యాక్షన్‌ సీన్స్‌లోను కనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్‌ దగ్గర 'పిల్లలూ ఇక మీదట కళ్లు మూసుకోండి' అంటూ ఇచ్చిన వార్నింగ్‌కి తగినంత యాక్షన్‌ సెకండ్‌ హాఫ్‌లో కరవైంది. ఎక్స్‌ట్రార్డినరీ సిట్యువేషన్‌ ఫేస్‌ చేస్తోన్న ఆర్డినరీ కుర్రాడి తాలూకు రియాక్షన్‌, అతను తీసుకునే డెసిషన్స్‌ అన్నిటినీ ఇంకాస్త పకడ్బందీగా రాసుకోవాల్సింది. ఐడియాగా బాగున్నా ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్‌ అయిన ఫీలింగ్‌ వస్తుంది. 

అలాగే ప్రాణాపాయంలో ఉన్న హీరోయిన్‌ తల్లిదండ్రుల గురించి ఎలాంటి ఫీలింగ్‌ రాదంటే ఆ క్యారెక్టర్లని డెవలప్‌ చేయకపోవడమే కారణం. కనీసం వారితో హీరోయిన్‌కి ఉన్న బాండింగ్‌ తెలియజేస్తూ ఒక రెండు సీన్లయినా పెట్టుకుని ఉండాల్సింది. హీరో స్నేహితుడి క్యారెక్టర్‌ పండిందంటే అందుకు కారణమదే. ముందే చెప్పుకున్నట్టు మొత్తం కథని అదే రాత్రి ముగించేయడానికి చూడాల్సింది. మళ్లీ కొన్నేళ్లు గ్యాప్‌ ఇచ్చి, హీరోని నిజంగా హీరోని చేసి, ఒక అనవసరపు ఫైట్‌ తీసి… ఇదంతా అవసరం లేదనిపిస్తుంది. కథలో సస్పెన్స్‌గా ఉంచిన దానిని మొత్తం చివర్లో బుర్రకథలా చెప్పేయడం కూడా బాలేదు. రైటింగ్‌ పరంగా హడావిడిగా ముగించేసిన సంగతి స్పష్టంగా తెలుస్తుంది. గౌతమ్‌ మీనన్‌ సినిమాల్లో చాలా వరకు సెకండాఫ్‌లో స్ట్రగుల్‌ అవుతాయంటే కారణమిదే. మొదలుపెట్టడం ఇసుక మేడ కడుతోన్న పిల్లాడిలా జాగ్రత్తగా మొదలుపెట్టి, పూర్తి చేయడానికి మాత్రం అప్పుడే పెన్‌, పేపర్‌ చేతికి దొరికిన చంటివాడిలా ఏదోఒకటి బరికి పారేస్తుంటాడు. 

నటుడిగా నాగచైతన్య 'ఏమాయ చేసావె'కి, ఇప్పటికీ చాలా ఎదిగాడు. మరీ రిజర్వ్‌డ్‌గా అనిపించే చైతన్య ఇందులో ఫ్రీగా, క్యాజువల్‌గా కనిపించాడు. అతని డైలాగ్‌ డెలివరీ కూడా మునుపటి కంటే మెరుగైంది. మంజిమ మోహన్‌ ఆకట్టుకుంటుంది. బాబా సెహగల్‌ బ్యాడ్‌ ఛాయిస్‌. కీలకమైన ఈ పాత్రకి ఎవరైనా సీజన్డ్‌ ఆర్టిస్ట్‌ని తీసుకోవాల్సింది. టెక్నికల్‌గా సినిమా ఉన్నత శ్రేణిలో ఉంది. సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెహమాన్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎడిటర్‌కి చాలా కఠినమైన పరీక్ష పెట్టాడు సినిమాటోగ్రాఫర్‌. అయినప్పటికీ అతను అద్భుతంగా రాణించాడు. 

గౌతమ్‌ మీనన్‌ దర్శకుడిగా చాలా సందర్భాల్లో మెరిసాడు. 'వెళ్లిపోమాకే' పాట చిత్రీకరణ అతనిలోని పొయెటిక్‌ సెన్స్‌కి అద్దం పడుతుంది. ఇద్దరిని కాల్చి చంపిన హీరో తన మనసులో 'రేపు నా పిల్లలకి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి' అనుకోవడం మనిషి తత్వాన్ని స్టడీ చేసిన దర్శకుడి అనుభవాన్ని తెలియజేస్తుంది. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో ఆకట్టుకున్న అంశాలు, సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు ఉన్నాయి. అలాగే విసిగించిన సందర్భాలు, పేలవంగా అనిపించిన క్షణాలు, అన్నిటికీ మించి నిరాశపరిచిన ముగింపు ఉన్నాయి. కాస్త మనసు పెట్టి రాసినట్టయితే, ద్వితీయార్ధంలో కాస్తంత జాగ్రత్త వహించినట్టయితే ఈ సాహసం నిరంతరంగా సాగిపోయేది. ఈ ఒడిదుడుకుల వల్ల ఎమోషన్స్‌ బ్యాక్‌ సీట్‌ తీసుకుని, ఫస్ట్‌ హాఫ్‌ 'రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌' యాడ్‌ ఫిలింలా, సెకండ్‌ హాఫ్‌ 'మోడ్రన్‌ కాంబాట్‌' వీడియో గేమ్‌లా అనిపించిందంటూ కొందరు కామెంట్‌ చేస్తే అది వాళ్ల తప్పు కాదు మరి. 

బాటమ్‌ లైన్‌: సాహసం లేదు, నీరసం రాదు!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri