పెద్ద నోట్లు క్యాన్సిల్ వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమను చావు దెబ్బ తీసిందన్న వార్తలు వినిస్తున్నాయి. పైకి అంతా జస్ట్ ఓకె అని వినిపిస్తోంది కానీ,భవిష్యత్ భయానకంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. నిన్నటికి నిన్న ఇచ్చిన స్ట్రోక్ వేరు. ఆ స్ట్రోక్ వల్ల వచ్చే పరిణామాలు వేరు.
నిన్నటికి నిన్న ఇచ్చిన స్ట్రోక్ టాలీవుడ్ లో పలువురికి భారీగా తగిలేసిందని వినికిడి. ఓ మ్యూజిక్ కంపెనీ అధినేత దగ్గర కాస్త గట్టిగానే మిగిలిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం తను సినిమాలు తీయడం మానేసి, తెరవెనుక నుంచి తీయిుస్తున్న ఓ నిర్మాత దగ్గర భారీగా క్యాష్ రూపంలోనే వుండిపోయిందని టాక్.
ప్రస్తుతం సినిమాలు చేతిలో లేకుండా పెళ్లి ఆలోచనలు చేస్తున్న ఓ హీరోయిన్ దగ్గర మూడు కోట్ల వరకు క్యాష్ వుండిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా హిట్ లు కొట్టిన ఓ నిర్మాణ సంస్థ దగ్గర భారీగానే క్యాష్ వుండిపోయిందని తెలుస్తోంది. త్వరలో తీయబోయే సినిమా కోసం దాన్ని అలా వుంచారని వినికిడి. జనంలోకి వెళ్తూ, జనంలో క్రేజ్ సంపాదించుకున్న ఒక టాప్ హీరోకి జస్ట్ రెండు నెలల క్రితమే ఓ టాప్ డైరక్టర్, టాప్ ప్రొడక్షన్ హవుస్ కాంబినేషన్ లో సినిమాకు 10 కోట్లు అడ్వాన్స్ ముట్టినట్లు తెలుస్తోంది.
దాదాపు అంత క్రేజ్ వున్న మరో టాప్ హీరో కు భారీగా డబ్బు వస్తుంది కానీ బ్లాక్ సమస్య లేదట. ఎందుకంటే ఎప్పటి డబ్బు అప్పుడు ఆయన భార్య బయటకు పంపేస్తారట. ఓ ప్రొడక్షన్ హవుస్ కు పెట్టుబడిగా, సినిమా థియేటర్ల వ్యాపారం ఛేసే ఓ వ్యాపారికి పెట్టుబడిగా. అందువల్ల అతనికి సమస్య వుండదంటున్నారు.
పైనాన్షియర్లు కుదేలు
ఇవన్నీ ఒక ఎత్తు, సినిమాలకు ఫైనాన్స్ చేసే వారి బాధలు మరొక ఎత్తు. ఒక ఫైనాన్షియర్ దగ్గర ఏకంగా 18 కోట్లు క్యాష్ రూపంలో వుండిపోయిందని టాక్. అలాగే చాలా మంది ఫైనాన్సియర్ల దగ్గర నాలుగు అయిదు కోట్ల నుంచి, పది కోట్ల వరకు క్యాష్ వుండిపోయందటున్నారు. అంతే కాదు, ఈ ఫైనాన్షియర్లకు ఇంకో సమస్య కూడా వుంది. వీరి డబ్బులు కోట్లకు కోట్లు టాలీవుడ్ మీద అప్పుల రూపంలో వున్నాయి. ఇవన్నీ బ్లాక్ లో ఇచ్చినవే. తిరిగి మళ్లీ బ్లాక్ లోనే చెల్లించాలి.
బ్లాక్ మళ్లీ పేరుకోవడం అన్నది ఇప్పట్లో సాధ్యం కాదు. మరి ఆ అప్పుల వసూలు ఎలా? వైట్ లో ఇవ్వలేరు..తీసుకోలేరు. పైగా ఇప్పుడు ఫైనాన్స్ చేసేవాళ్లంతా మొత్తం దారుణంగా దెబ్బతినడంతో, ప్రపోజల్ లో లేదా, సెట్ లపై వున్న సినిమాలు చాలా వరకు ఆగిపోయే ప్రమాదం వుందని అంటున్నారు. ఇలాంటి సినిమాలో ఇటీవలే పూజ జరుపుకున్న పెద్ద హీరో భారీ సినిమా కూడా వుంటుందని టాక్. మరో సూపర్ డూపర్ భారీ సినిమా రూపకర్తల దగ్గర భారీగా బ్లాక్ వుండి వుంటుందని అంచనావేస్తున్నారు.
జ్యూయలర్స్ కు చేరిపోయాయా?
టాలీవుడ్ హీరోలకు చెందిన కొంత మొత్తం రాత్రికి రాత్రి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోల భార్యలకు సాధారణంగా బంగారం, జ్యూయలరీ మీద మక్కువ ఎక్కువ అని. చాలా మంది ఇళ్లలో వున్న కొద్ది లక్షల మొత్తాన్ని తమ తమ జ్యూయలర్స్ దగ్గరకు చేర్చేసి, బంగారం, డైమండ్లుగా మార్చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్నహైదరాబాద్ లో బంగారం టర్నోవర్ వందల కోట్లలో వున్నాయంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
రన్నింగ్ ఆగిపోయినట్లే
టాలీవుఢ్ లో నిత్యం రన్నింగ్ లో రోజుకు కనీసం కోటి రూపాయలన్నా నగదు వుంటుంది. ఇది చాలా వరకు బ్లాక్ నే. సో, ఇప్పుడు కనీసం మరో నెలా రెండు నెలల వరకు ఈ వ్యవహారాలు అన్నీ ఆగిపోతాయి. స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, ఇలాంటి వాటికి సమస్య లేదు. అవన్నీ చెక్ పేమెంట్లే. కానీ జూనియర్ ఆర్టిస్టులు, రోజువారీ బత్తాలు, మిస్ లేనియస్ ఖర్చులతోనే సమస్య. పైగా కొన్నాళ్ల పాటు ఎటీఎమ్ లావాదేవీలు కూడా లిమిట్ కావడంతో కాస్త కష్టమే. అందువల్ల చిన్న, మీడియం సినిమాల షెడ్యూళ్లు అనుకున్నట్లు సాగే అవకాశం కనిపించడం లేదు.
ఇక రికార్డులు వుండవేమో?
ఫస్ట్ డే రికార్డులు అన్నవి ఫ్యాన్స్ కు చాలా కీలకం. ఈ రికార్డుల వెనుక ఓ మర్మం వుంది. అవి ఫిక్స్ డ్ హైర్ లు, థియేటర్ అడ్వాన్స్ లు. అవన్నీ కలిపి ఫస్ట్ డే కలెక్షన్ కింద చూపించడం అలవాటు. ఇకపై ఈ ఫిక్స్ డ్ హైర్ లు, థియేటర్ అడ్వాన్స్ లు అంతగా రావడం కష్టం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అసలు ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి బయ్యర్లకు, బయ్యర్ల నుంచి నిర్మాతలకు లెఫ్ట్ లో డబ్బులు రావడమే గగనం అవుతుందని తెలుస్తోంది.