చంద్రబాబు చెప్పారు.. మోడీ పాటించేశారు.!

నల్లధనాన్ని అరికట్టడంలో 500, 1000 రూపాయలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రెడిట్‌ ఎవరిదో తెలుసా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారిది. ముందుగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ,…

నల్లధనాన్ని అరికట్టడంలో 500, 1000 రూపాయలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రెడిట్‌ ఎవరిదో తెలుసా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారిది. ముందుగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, హర్షం వ్యక్తం చేసింది ఆయనగారే. ఆ స్పందన వెనుక 'పబ్లిసిటీ కోణం' అందరూ గ్రహించే వుంటారు. ప్రపంచానికి ఐటీని పరిచయం చేసిందే చంద్రబాబు మరి.! 

ఒక్కటి మాత్రం నిజం. చాలాకాలంగా చంద్రబాబు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా చేస్తే, అవినీతి తగ్గుతుందట. ఆ లెక్కన, నరేంద్రమోడీ చంద్రబాబు మాటల్ని పరిగణనలోకి తీసుకున్నారేమో.! ఆగండాగండీ, 500 నోట్లు రద్దయిపోలేదు. పాత నోట్లు రద్దయి, వాటి స్థానంలో కొత్తగా 500 రూపాయల నోట్లు వస్తాయంతే. వెయ్యి రూపాయల నోట్లు మాత్రం పూర్తిగా రద్దయిపోయాయి. వాటికి బదులు 2000 రూపాయల నోట్లు చెలామణీలోకి వస్తున్నాయి. 

వారెవ్వా.. అవినీతి ఇకపై డబుల్‌ కానుందన్నమాట. నిజమే మరి, ఓటుకు ఐదొందలు కాదు, వెయ్యి కాదు.. ఇకపై 2 వేల రూపాయలు సింగిల్‌ నోట్‌తో ఇచ్చేయొచ్చు. 2 వేల రూపాయల నోట్ల కట్ట ఒకటి తీసుకెళితే, అది రెండు లక్షలవుతుంది. గతంలో ఇది ఒక లక్ష మాత్రమే. అంటే, అవినీతి కొత్త రూపంలో.. ఇంకా వేగంగా జోరందుకుంటుందని అనుకోవాలా.? 

నిజానికి, వున్నపళంగా నోట్లను రద్దు చేయడమంటే దేశంలో మొత్తం నల్లధనం బయటపడటమో, లేదంటే మాడి మసైపోవడమో జరుగుతుంది. కొత్తగా నల్లధనాన్ని పుట్టించడం కొంచెం కష్టమే అయినా, దాన్ని ఇష్టంగా మార్చేసుకోవడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. సో, అవినీతి పూర్తిగా అంతమైపోతుందనీ.. నల్లధనం మటుమాయమైపోతుందని ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేయలేం. 

ఏదిఏమైనా, చంద్రబాబు తొందరపడి ప్రకటన చేసేశారు.. ప్రధానిని అభినందించేశారు.. 500 నోట్లు మారుతున్నాయి.. 1000 నోట్లు రద్దవుతున్నాయ్‌.. కానీ 500 నోట్లు కొత్తకొత్తగా వచ్చేస్తున్నాయి.. వెయ్యి కాదు, 2 వేల రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయ్‌. మోడీ మ్యాజిక్‌తో చంద్రబాబు గెలిచినట్టా.? ఓడినట్టా.?