నల్లధనాన్ని అరికట్టాలంటే పెద్ద నోట్లను 'స్క్రాప్' చెయ్యాల్సిందే..
– ఆర్థిక నిపుణుల వాదన ఇది.
కానీ, నల్లధనాన్ని అరికట్టేందుకంటూ పాత పెద్ద నోట్లను మార్చి, కొత్త పెద్ద నోట్లను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఏంటి లాభం.? అనేదానికన్నా ముందుగా నష్టం గురించి ఆలోచించాలి. ఆ నష్టం గురించి కనీస ఆలోచన చేయకుండా నిన్న రాత్రి ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనతో దేశం అల్లకల్లోలమైపోతోంది. అర్థరాత్రికే పరిస్థితి అదుపు తప్పేసింది. తమ వద్ద వున్న నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక జనం రోడ్డెక్కారు. నానా పాట్లూ పడ్డారు. కొందరు కొన్ని నోట్లను మార్చుకున్నారు.
తెల్లారింది.. పాల ప్యాకెట్ దగ్గర్నుంచి.. అన్ని చోట్లా సమస్యలే. అసలంటూ వంద నోట్లు ఎక్కడ.? వున్నవన్నీ 500 లేదా 1000 నోట్లు మాత్రమే. అవి ఎక్కడా మారడంలేదాయె. కావాలంటే వెయ్యి రూపాయల పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోండి.. అంతేగానీ, 'చిల్లర' అడగొద్దంటూ పెట్రోల్ బంకు నిర్వాహకుల సమాధానానికి జనం చిత్తయిపోతున్నారు. పెట్రోల్ అనేది మరీ అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆసుపత్రుల్లో పరిస్థితే అత్యంత దయనీయంగా తయారైంది.
500, 1000 నోట్లు తీసుకుంటే అది మీ పర్సనల్ రిస్క్.. అంటూ ఆర్‌బిఐ ప్రకటించేయడంతో, ఎవరూ ఆ నోట్లను తీసుకోడానికి ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో 'వెయ్యి నోటు ఇస్తే, 5 వంద రూపాయల నోట్లు ఇస్తాం..' అంటూ మార్కెట్‌లో కొందరు అక్రమార్కులు సరికొత్త ఆఫర్లు ప్రవేశపెట్టారు. 'చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం..' అంటూ సాధారణ ప్రజానీకం చాలావరకు ఇలాంటి మాయగాళ్ళను ఆశ్రయించి, డబ్బుని పోగొట్టుకుంటున్నారు.
టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. పెట్రోల్ బంక్‌ల వద్ద పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది.? టిఫిన్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు.. ఒకటేమిటి, మొత్తంగా చూస్తే దేశమంతా రణరంగమైపోయింది. ఈ పాట్లు పెద్దోళ్ళకి కాదు, సామాన్యులకే. 'ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ వున్నాయి కదా..' అని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. ఆన్ లైన్ వాడనివారి సంగతో! నేడు బ్యాంకులు పనిచేయవు. నేడు, రేపు ఏటీఎంలు పనిచేయవు. మరెలా.?
చాలాకాలం నుండీ వంద రూపాయల నోట్లు తగ్గిపోయాయి. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఏ ఏటీఎంకి వెళ్ళినా అక్కడ 500 లేదా 1000 నోట్లు మాత్రమే వుంటున్నాయి. 100 నోట్లు చాలా అరుదు. అంటే, వందనోట్లు వినియోగంలో వున్నా అవి చాలా తక్కువేనన్నమాట. సరిగ్గా టైమ్ చూసి ప్రధాని నరేంద్రమోడీ సామాన్యుడి నడ్డి విరిచేశారు. రేపట్నుంచి పరిస్థితి కొంత అదుపులోకి రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. రేపటి పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయడం కష్టం.
ఇంతా చేసి, దేశంలో అవినీతి మటుమాయమైపోతుందనీ, నల్లధనమంతా బయటకు వచ్చేస్తుందనీ నమ్మగలమా.? అక్రమార్కులు ముందే జాగ్రత్తపడ్డారనడానికి, 2 వేల నోట్లకు సంబంధించి సోషల్ మీడియాలో గత నెల రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిదర్శనం. మరెవరికోసం ఈ నోటు పోటు.? మిస్టర్ ప్రధాని నరేంద్రమోడీ.. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.!