పవన్‌కల్యాణ్… టాలీవుడ్ అగ్రహీరో. తాజాగా ఆయన నటించిన బ్రో అనే సినిమా విడుదలైంది. అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అది వేరే సంగతి. జనసేన అనే పేరుతో పదేళ్ల క్రితం రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రశ్నించడానికే తాను సరికొత్తగా వచ్చానని బీరాలు పలికారు. తీరా చూస్తే… 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి పల్లకీ మోశారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసి దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు.
ఆ తర్వాత బీజేపీతో జత కట్టారు. అలాగని ఆ పార్టీతో కలిసి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారా? అంటే అదీ లేదు. టీడీపీతో అనధికార పొత్తులో ఉన్నారనే విమర్శకు చోటు ఇచ్చేలా నడుచుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఒకసారి, ఇటీవల కాలంలో ఎన్డీఏ సర్కార్ ఏపీలో వస్తుందని మరోసారి …ఇలా ఎప్పుడేం మాట్లాడ్తారో ఆయనకే తెలియడం లేదు. దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించాలని వైసీపీ రెచ్చగొడుతోంది.
అబ్బే…ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేనని పవన్‌కల్యాణ్ అనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీని రామచంద్ర యాదవ్ స్థాపించారు. 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం చర్చకు దారి తీసింది. సినిమా హీరోగా పెద్ద సంఖ్యలో అభిమానులు కలిగి, తనకంటూ సొంత ఇమేజ్ కలిగిన పవన్‌కల్యాణ్… ఒంటరిగా పోటీ చేయడానికి వెనుకాడుతున్నారని, కానీ రామచంద్ర యాదవ్ మాత్రం ధైర్యంతో బలమైన పార్టీలను ఢీకొట్టడానికి ముందుకెళుతున్నారనే చర్చకు తెరలేచింది.
ప్రతి గ్రామానికి తమ జెండా, ఎజెండా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసుకుంటానని రామచంద్ర ధీమాగా చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీని నడపడానికి కావాల్సింది చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారెవరైనా క్షేత్రస్థాయిలో బలపడేందుకు చూస్తారని, ఆ పని రామచంద్ర యాదవ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో పవన్ ప్రకటించడానికి భయపడుతున్నారని, ఇదే రామచంద్ర యాదవ్ విషయానికి వస్తే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అమీతుమీ తేల్చుకుంటానని తేల్చి చెప్పారని పలువురు గుర్తు చేస్తున్నారు.
వారాహి యాత్రకు బయల్దేరి వచ్చే ముందు… ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదని ఇంట్లో చెప్పి వస్తానని పవన్ చెప్పడం తెలిసిందే. కానీ రాజకీయ ఉద్ధండులతో తలపడుతూ ప్రాణాలకు సైతం ప్రమాదం తెచ్చుకుంటున్న నాయకుడు రామచంద్ర యాదవ్. పవన్ వెండితెరపై మాత్రమే హీరో. రాజకీయ తెరపై హీరోగా రామచంద్ర యాదవ్‌ను కొన్ని వర్గాలు చూస్తున్నాయి.
తనకు చేగువేరా స్ఫూర్తి అని పవన్ అంటుంటారు. రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఎదురొడ్డి ఎలా పోరాడాలో రామచంద్ర యాదవ్‌ను చూసి తమ వాడు నేర్చుకోవాలని కాపు సామాజిక వర్గం హితవు చెబుతోంది. ఏమయ్యా పవన్ వినిపిస్తోందా?