ప్రపంచమంతా నినదిస్తోంది తీవ్రవాదానికి మతం లేదని. కానీ, మతం ప్రాతిపదికన తీవ్రవాదుల్ని కూడా రాజకీయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇంతకన్నా సిగ్గుమాలిన విషయమేముంటుంది.? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జైలు నుంచి 8 మంది తీవ్రవాదులు తప్పించుకోవడం, వారిని ఏటీఎస్ మట్టుబెట్టడం తెల్సిన విషయమే. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ అనుమానాల నివృత్తి కోసం విచారణ కూడా షురూ అయ్యింది.
ఇక్కడే, రాజకీయం మొదలైంది. జైలు నుంచి ముస్లింలే ఎందుకు తప్పించుకుంటున్నారు.? హిందువులు ఎందుకు తప్పించుకోవడంలేదు.? అన్న ప్రశ్న లేవనెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్. ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి (ఛత్తీస్గడ్ విడిపోకముందు) ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వున్నప్పటికీ, దిగ్విజయ్‌సింగ్‌కి ఇలాంటి అనుమానాలు ఎందుకు కలిగాయో మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.
ముస్లిం సమాజం సైతం తీవ్రవాదానికి బలైపోతున్న దరిమిలా, ఇస్లామిక్ దేశాలు సైతం తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నినదిస్తున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు.? టెర్రర్ ఫ్యాక్టరీ పాకిస్తాన్లో సైతం సాధారణ ప్రజానీకం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినదిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. భారతదేశంలో తీవ్రవాదానికి ప్రధాన కారణం పాకిస్తాన్. మతం ముసుగులో పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తాజాగా ఎన్కౌంటర్లో చనిపోయిన 8 మంది ముస్లింలే ఎందుకు అవ్వాలి.? అన్న ప్రశ్న తెలివిగానే దిగ్విజయ్‌సింగ్ లేవనెత్తారుగానీ.. ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న తీవ్రవాదాన్ని ఆ 8 మందీ ఓ మతంగా మార్చుకున్నారనే విషయం మర్చిపోకూడదు.
ఇక, దేశంలో సిమీ కార్యకలాపాల్ని చూస్తే, ఆ సంస్థ అరాచకాలకు ముస్లిం సమాజం కూడా బలైపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం జరుపుతున్న పేలుళ్ళు, ఇతరత్రా మారణహోమంలో కేవలం హిందువులు మాత్రమే బలైపోవడంలేదు. పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న భారత సైన్యంలోనూ కేవలం హిందువులే లేరు. అన్ని మాటలకు చెందినవారూ వున్నారు. దేశాన్ని రక్షించడమే మా మతం అభిమతం.. అంటోంది సైన్యం. దురదృష్టవశాత్తూ ఇలాంటి రాజకీయ నాయకులకే మతం గుర్తుకొస్తోంది.