కబడ్డీ.. మన క్రీడ.. మన గ్రామీణ క్రీడ.. ఇదిప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. గతంలోనూ కబడ్డీ వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. కానీ, దురదృష్టవశాత్తూ ప్రపంచానికి కబడ్డీ గురించి తెలిసింది చాలా చాలా తక్కువ. ప్రో కబడ్డీ లీగ్ పుణ్యమా అని కబడ్డీ, మన దేశంలో 'పాపులారిటీ' తెచ్చుకుందన్నది నిర్వివాదాంశం.
కబడ్డీ గురించి తెలియడం వేరు.. కబడ్డీకి పాపులారిటీ పెరగడం వేరు. కబడ్డీ అంటే మనోళ్ళకి చాలా చాలా చులకన. చాన్నాళ్ళ క్రితం దేశంలో కబడ్డీ అంటే అదో ఇంట్రెస్టింగ్ గేమ్. రాను రాను కబడ్డీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. కబడ్డీ అంటే బలవంతుల గేమ్ మాత్రమే కాదు, మైండ్ గేమ్ కూడా. కానీ, కబడ్డీలో గాయాలకు ఆస్కారమెక్కువ. దాంతో, చాలా తేలిగ్గా కబడ్డీని దూరం చేసేసుకున్నాం.
కానీ, పరిస్థితులు మారాయి. ప్రో కబడ్డీ లీగ్‌తో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్ళకు అందులో చోటు కల్పించాం. తద్వారా ఆయా దేశాల్లో కబడ్డీ ఆట పట్ల కాస్తో కూస్తో క్రేజ్ పెంచగలిగాం. ఈ క్రమంలోనే కబడ్డీ, అంతర్జాతీయంగా పాపులారిటీ పెంచుకుంది.
కబడ్డీ వరల్డ్ కప్‌లో టీమిండియా విజయాన్ని కైవసం చేసుకోవడం ఒక ఎత్తయితే, ప్రపంచానికి కబడ్డీని భారతదేశం కానుకగా ఇచ్చిందన్న ప్రశంసలు ఇంకో ఎత్తు. నిజమే, క్రికెట్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం.. ఆ వెర్రిలో పడి, ప్రాణాలు కోల్పోతున్నాం. అవును, క్రికెట్ ఒకప్పుడు జెంటిల్‌మెన్ గేమ్. ఇప్పుడు కాదు. అదిప్పుడు జస్ట్ జూదం మాత్రమే. ఏమో, రానున్న రోజుల్లో కబడ్డీని కూడా ఆ స్థాయికి మనమే దిగజార్చేస్తామేమో.! ఎందుకంటే, ఆట మీద కన్నా ఆట చుట్టూ 'జూదానికే' ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నాం మనం.!
క్రికెట్‌లో స్లెడ్జింగ్ వుంటుంది. నిజానికది కాంటాక్ట్ గేమ్ కాదు. ఒకర్ని ఒకరు ఢీకొనే సందర్భాలు అసలుండవు. కానీ, కబడ్డీ అలా కాదు.. ఒక వ్యక్తి ఏడుగురితో పోరాటం చేయాల్సి వస్తుంది. కానీ, కబడ్డీలో స్లెడ్జింగ్ లేదు. రెచ్చగొట్టుకోవడమనేది ఏంటో తెలియకుండానే ఈసారి వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. చాల చాలా ప్రొఫెషనల్‌గా అందరూ ఆడారు. మరీ ముఖ్యంగా ప్రపంచానికి కబడ్డీ నేర్పిన భారత కబడ్డీ జట్టు, పూర్తిస్థాయి ప్రొఫెషనలిజం కనబర్చింది.
ఏదిఏమైనా.. కబడ్డీని మనం గెలిపించాం.. ఇప్పుడిక ఈ ఆటకి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ మరింత పెరిగేలా పాలకుల కృషి ముఖ్యం. మరి, పాలకుల నుంచి ఆ స్థాయి మద్దతు కబడ్డీకి దొరుకుతుందా.? వేచి చూడాల్సిందే.