చచ్చింది నిజం.. చచ్చిపోలేదు, ఇదే నిజం.!

పాపాల పాకిస్తాన్‌ ఎప్పుడు నిజం ఒప్పుకుంది గనుక.? భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి, దాదాపు 40 మంది తీవ్రవాదుల్ని మట్టుబెడితే, చనిపోయినవారి మృతదేహాల్ని పాకిస్తాన్‌ సైన్యం, ట్రక్కుల్లో రహస్యంగా…

పాపాల పాకిస్తాన్‌ ఎప్పుడు నిజం ఒప్పుకుంది గనుక.? భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి, దాదాపు 40 మంది తీవ్రవాదుల్ని మట్టుబెడితే, చనిపోయినవారి మృతదేహాల్ని పాకిస్తాన్‌ సైన్యం, ట్రక్కుల్లో రహస్యంగా తరలించేసి, అబ్బే.. ఎవరూ చచ్చిపోలేదు, అసలు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయన్న భారత వాదనే తప్పు.. అని తేల్చిన విషయం విదితమే. 

కానీ, నిజం నిప్పులాంటిది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన మాట వాస్తవమనీ, అదే సమయంలో తీవ్రవాదులు చచ్చిపోవడమూ నిజమేననీ, తమ సైనికులు కూడా చనిపోయారనీ పేర్కొంటూ, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌కి చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన విషయం విదితమే. 

తాజాగా, భారత సైన్యం సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యాన్ని చీల్చిచెండాడింది. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత్‌పై కాల్పులతో విరుచుకుపడ్తోన్న పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పింది. ఎదురుదాడి జరిగితే పాకిస్తాన్‌ పరిస్థితేంటో మరోమారు నిరూపించింది భారత సైన్యం. హీరానగర్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులకు గట్టిగా సమాధానం చెప్పిన భారత సైన్యం (బిఎస్‌ఎఫ్‌), ఏకంగా 9 మంది పాక్‌ సైనికుల్ని హతమార్చింది. 

అయితే, షరామామూలుగానే పాకిస్తాన్‌ సైన్యం తమవైపు నుంచి ఎలాంటి మరణాలూ చోటు చేసుకోలేదని తేల్చేసింది. కానీ, చనిపోయిన సైనికుల్ని పాకిస్తాన్‌ సైన్యం హడావిడిగా తరలించిన వైనంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది భారత సైన్యం. ఈ ఘటనలో ఓ తీవ్రవాది కూడా మరణించడాన్ని బట్టి చూస్తోంటే, కాల్పుల ఉల్లంఘన వెనుక తీవ్రవాదుల్ని ఎగదోసే వ్యూహాన్ని పాకిస్తాన్‌ గట్టిగానే అమలు చేస్తోందన్నమాట. 

ఏదిఏమైనా, ప్రస్తుతానికైతే పాకిస్తాన్‌ బుకాయిస్తోంది.. కొన్ని రోజులాగితే, పాకిస్తాన్‌ మీడియానే అక్కడి సైన్యం తీరుని ఎండగట్టేస్తుంది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో కూడా అదే జరిగింది కదా.!