వందల కోట్లు ఖర్చవుతున్నాయి.. వాటిల్లో చాలావరకు బూడిదలో పోసిన పన్నీరే. హైద్రాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఖర్చు గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. విజయవాడ క్యాంపు కార్యాలయం కోసం తక్కువేమీ ఖర్చు చేయలేదు. తాత్కాలిక సచివాలయం కోసం కూడా వెయ్యి కోట్లపైనే ఖర్చు చేశారు. ఇటీవల పూర్తయిన పట్టిసీమ ప్రాజెక్ట్ అయినా, త్వరలో ప్రారంభం కానున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయినా.. ఇవన్నీ తాత్కాలికమే.. వీటికీ వేల కోట్లు తగలేస్తున్నారు. అంతా తాత్కాలికమే.
ఇక, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జాతీయ విద్యా సంస్థల్ని నెలకొల్పింది. వాటిల్లో చాలావరకు విద్యాబోధన కూడా షురూ అయ్యింది. కానీ, ఆయా విద్యాసంస్థల నిర్మాణం ప్రస్తుతానికి హంబక్కే. క్లాసులు మాత్రం వేరే చోట జరుగుతోంది. అంటే, విద్యాసంస్థలకీ అద్దె కొంపలన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో నివాసం వుంటోన్నది కూడా 'అద్దె' ప్రాతిపదికనే.!
కొత్త రాష్ట్రం, సవాలక్ష సమస్యలతో ఏర్పడ్డ రాష్ట్రం గనుక చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. కానీ, కోట్లు తగలేసి, అద్దె కాపురమేంటి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 'రేకుల షెడ్లు, చెట్టు నీడ.. కాదేదీ పరిపాలనకు అనర్హం..' అన్న ఒకప్పటి మాటలు, పబ్లిసిటీకే పరిమతమయ్యాయి. మరీ అంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్ర పాలన వుండాలని ఎవరూ కోరుకోరు. కానీ, అద్దె కాపురం కోసం వృధా ఖర్చు చేయడమే వివాదాస్పదమవుతోంది.
ఆర్నెళ్ళలో తాత్కాలిక సచివాలయం నిర్మించినట్లు, జాతీయ విద్యాసంస్థల్నీ యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఇవ్వొచ్చు కదా.? ఈ ప్రశ్నకు కేంద్రం నుంచి సమాధానం రాదు. ముఖ్యమంత్రీ, కేంద్రాన్ని ఈ విషయమై నిలదీయరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏ సభకు హాజరైనా, చాంతాడంత లిస్టు చదువుతారు. 'పదేళ్ళలో ఏర్పాటు చేయాల్సినవి రెండేళ్ళలో ఏర్పాటు చేశాం..' అంటారు. ఏదీ ఎక్కడ.? ఒక్క జాతీయ విద్యాసంస్థ భవనం చూపించండి.. అనడిగితే, వెంకయ్య నెత్తిన ముసుగేసుకోవాల్సిందే.
మీసాలకు శంపంగె నూనెకు కరువేమీ లేదు.. కానీ, మింగడానికే మెతులుకు దొరకడంలేదు. ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. నిజ్జంగా నిజమిది. ముఖ్యమంత్రి సోకులకీ, కేంద్రం ఆర్భాటపు ప్రకటనలకీ హద్దూ అదుపూ లేకుండా పోతోంది. రెండున్నరేళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకో రెండేళ్ళలో అయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రూపమొస్తుందా.? అంటే, అవకాశాలు చాలా చాలా చాలా తక్కువేనని చెప్పకతప్పదు.
'కాంగ్రెస్ చేసిన నష్టం నుంచి బయటపడేందుకు ఐదేళ్ళు పట్టింది..' అంటూ 2019 ఎన్నికల్లో ఓ పక్క బీజేపీ, ఇంకోపక్క టీడీపీ కహానీలు చెప్పడం ఖాయం. అప్పటిదాకా, అద్దె కొంపల్లోనే ఆంధ్రప్రదేశ్ కాపురం.. ఇందులో ఇంకో మాటకు తావే లేదు.